అయోధ్యపై కోర్టుకు..ముస్లిం సంఘాల కీల‌క నిర్ణ‌యం

Update: 2019-12-02 17:22 GMT
దశాబ్దాల తరబడి సాగుతున్న అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో ప‌రిష్కారం దొరికింద‌ని భావిస్తున్న త‌రుణంలో..కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. అయోధ్య భూమిని రామాల‌య నిర్మాణం కోసం హిందువుల‌కు ఇవ్వాల‌ని ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటీష‌న్ దాఖ‌లైంది. జ‌మాతే ఉలేమా హింద్ ఇవాళ ఈ పిటిష‌న్ వేసింది. ఆదివారం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) స‌మావేశం త‌ర్వాతే ఈ పిటిష‌న్ దాఖ‌ల‌వ‌డం గ‌మ‌నార్హం.

 ఆల్ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు జనరల్ సెక్రెటరీ మౌలానా వలి రహ్మానీ మీడియాతో మాట్లాడుతూ...అయోధ్య కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై దేశంలోని 99 శాతం మంది ముస్లింలు అసంతృప్తిగానే ఉన్నారని పేర్కొన్నారు. ‘మసీదు నిర్మాణంలో ఎలాంటి ఆసక్తి లేని ముస్లింలు - భయంతో బతికే వాళ్లే ఈ తీర్పును పరిష్కారంగా భావిస్తున్నారు` అని రహ్మానీ చెప్పారు. తీర్పులో పలు వివాదాస్పద అంశాలను పరిశీలించాలని కోరేందుకే పిటిషన్ వేయనున్నట్లు ఆయన వివరించారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉంది కాబట్టే రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని రహ్మానీ చెప్పారు. గత నెలలో జరిగిన బోర్డు సమావేశంలో రివ్యూ కోరాలని నిర్ణయించామని - డిసెంబర్ 9న పిటిషన్ వేస్తామని అప్పుడే చెప్పామని తెలిపారు. అయితే, తమ పిటిషన్ ను కోర్టు పరిశీలనకు తీసుకోదేమోనని అంటూనే..రహ్మానీ దానర్థం పిటిషన్ దాఖలు చేయొద్దని కాదన్నారు.

కాగా, నేడు సుప్రీంకోర్టులో జ‌మాతే ఉలేమా హింద్‌ రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. వివాదాస్ప‌ద అయోధ్య భూమికి సంబంధించి లిటిగెంట్ సిద్దిక్‌ కు వారుసుడైన మౌలానా స‌య్యిద్ అశ‌ద్ ర‌షీద్ ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ... బాబ్రీ మ‌సీదు స్థ‌లాన్ని అప్ప‌గించాల‌న్న తీర్పును త‌ప్పుప‌ట్టారు. వివాదాస్ప‌ద భూమి ముస్లింల ఆధీనంలోనే ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. బాబ్రీ మ‌సీదును హిందువులు కూల్చార‌ని - అలాంట‌ప్పుడు వారికే ఎలా తీర్పును అనుకూలంగా ఇస్తార‌ని ఆయ‌న త‌న పిటిష‌న్‌లో ప్ర‌శ్నించారు. బాబ్రీ అంశంలో 1934 - 1949 - 1992లో జ‌రిగిన నేరాల‌ను సుప్రీం విస్మ‌రించింద‌ని ర‌షీద్ త‌న పిటిష‌న్‌ లో పేర్కొన్నాడు. అడ్వ‌కేట్ మ‌క్బూల్ ద్వారా 217 పేజీల పిటిష‌న్‌ ను ఆయ‌న దాఖ‌లు చేశారు.ఇదిలాఉండ‌గా, ఈ భూవివాద కేసులో ప్రధాన కక్షిదారుగా ఉంటూ వచ్చిన సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉంది. పునఃసమీక్షకు వెళ్లకూడదని తీర్మానించింది.


Tags:    

Similar News