ర‌ఘురామ్ మాట..చైనాని ఇప్పట్లో చేరుకోలేం!

Update: 2015-08-27 09:11 GMT
చైనా సంక్షోభం ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌ ను కుదిపేస్తోంది. మ‌న మార్కెట్ కూడా డ్రాగన్ ప్ర‌భావంతో గ‌డ‌చిన రెండుమూడు రోజులుగా కుదేలైపోయింది. అయితే, మ‌నం టెన్ష‌న్ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌నీ ఈ సంక్షోభాన్ని అవ‌కాశంగా మ‌ల‌చుకుని ప్ర‌పంచ శ‌క్తిగా ఎదుగుదామ‌నీ ప్ర‌ధాని మోడీ అంటున్నారు. చైనాను మించి అభివృద్ధి చెందేందుకు ఇదే త‌రుణ‌మ‌ని చెబుతున్నారు. సంస్క‌ర‌ణ వేగాన్ని పెంచ‌డం ద్వారా భార‌త్‌ ను ప్ర‌పంచంలోనే శ‌క్తిమంత‌మైన దేశంగా మార్చ‌డానికి ఇదే మంచి త‌రుణం అని ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ కూడా అభిప్రాయప‌డ్డారు.

అయితే... ప్రాక్టిక‌ల్‌ గా చైనాను మ‌నం మించ‌గ‌ల‌మా... అన్న‌ది ప్ర‌శ్న‌! భార‌త్ ఎంత త్వ‌ర‌గా ఎదిగినా కూడా చైనాని దాట‌లేదని రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్ ఈ త‌రుణంలో వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకంటే, చైనాతో పోల్చుకుంటే మ‌నం చాలా వెన‌క‌బ‌డే ఉన్నామ‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేస్తున్నారు. చైనాకంటే మ‌నం అధిక వృద్ధి రేటు సాధించినా కూడా దీర్ఘ‌కాలంలో దాని ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌ద‌ని అంటున్నారు రాజ‌న్‌. గ‌ణాంకాల్లో చూసుకున్నా చైనా జీడీపీ కంటే మ‌నం ఎంతో వెన‌క‌బ‌డే ఉన్నాం అన్నారు. వ‌ర‌ల్డ్ బ్యాంకు లెక్క‌ల ప్ర‌కారం చూసుకుంటే... చైనా జీడీపీ 10 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు ఉంటోంద‌నీ, మ‌న‌దేశం స్థూల జాతీయోత్ప‌త్తి కేవ‌లం 2 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు మాత్ర‌మే అని అన్నారు. అందుకే, ప్ర‌స్తుతం చైనా అంత‌ర్జాతీయంగా బ‌ల‌మైన ఆర్థిక శ‌క్తిగా ఎదిగింద‌ని వివ‌రించారు.

ప్ర‌పంచ‌ మార్కెట్లన్నీ ప‌డిపోవ‌డానికి చైనా ఒక్క‌టే కార‌ణం అన‌డం కూడా స‌రికాద‌ని రాజ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. సంక్షోభంలో కూరుకుపోయిన ప్ర‌తీ దేశ‌మూ ఆ భారాన్ని సెంట్ర‌ల్ బ్యాంకుల‌పై తోసేయ‌డం స‌రికాద‌న్నారు. అన్ని స‌మ‌స్య‌ల‌కీ సెంట్ర‌ల్ బ్యాంక్ జోక్యం ఒక్క‌టే తార‌క‌ మంత్రం కాదు. దేశ ఆర్థిక స‌మ‌స్య‌ల్ని సంస్క‌ర‌ణ ద్వారా స‌రిదిద్దుకోవాలి, అంతేగానీ సెంట్ర‌ల్ బ్యాంకులు జోక్యం పెరిగిపోవ‌డం కూడా మంచిది కాద‌ని చెప్పారు.  ఇక‌, భార‌త్ విష‌యానికొస్తే... మ‌న దేశాన్ని ఇత‌ర దేశాల‌తో పోల్చ‌లేమ‌ని చెప్పారు. ఇక్క‌డి ప‌రిస్థితులు వేర‌ని అన్నారు. మ‌న‌దేశం ముందుగా ద్ర‌వ్యోల్బ‌ణ స‌మ‌స్య‌ను అధిగ‌మించాల‌ని అన్నారు.
Tags:    

Similar News