పాక్ కి వెళ్లిన కశ్మీరీలకు షాక్ ఇచ్చిన కేంద్రం..ఏంచేసిందంటే ?

Update: 2019-12-18 11:20 GMT
ఆర్టికల్ 370 రద్దు - కశ్మీర్ విభజన తరువాత కేంద్రం మరో సాహసోపేత నిర్ణయం తీసుకుంది కేంద్రం. 1947 నుంచి 1954 మధ్య కాలంలో పాకిస్థాన్ కు వెళ్ళిపోయిన కశ్మీరీలు - వారి వారసులు తిరిగి కశ్మీర్ కు వచ్చేందుకు వీలు కల్పించే చట్టాన్ని కేంద్రం రద్దు చేసింది. దీనికి  జమ్మూ కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని ఆయుధంగా చేసుకుంది.   37 ఏళ్ళ క్రితం నాటి ఈ చట్టం రద్దు కావడం కశ్మీర్ చరిత్రలో ఓ పెద్ద సంచలనం. అసలు ఈ చట్టం ఏమిటో ఒకసారి చూస్తే ..

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ 1982లో ఓ ప్రైవేటు బిల్లును ఆమోదించింది. ఆ చట్టం ప్రకారం 1947 మార్చి 1 నుంచి 1954 మే 14 వరకు కశ్మీర్ నుంచి పాకిస్థాన్ కు వలస వెళ్ళిపోయిన వారు - వారి వారసులు జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో తిరిగి సెటిల్ అయ్యేందుకు అంటే పాకిస్థాన్ నుంచి శాశ్వతంగా తిరిగి వచ్చేందుకు ఈ చట్టం వీలు కల్పించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 కింద వర్తించేలా ఈ చట్టాన్ని 1982 ఆగస్టు 5న భారత పార్లమెంట్ కూడా ఆమోదించింది. నిజానికి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడే బీజేపీ - కాంగ్రెస్ - నేషనల్ పాంథర్స్ పార్టీ లాంటి పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. నేషనల్ కాన్ఫరెన్స్ - పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ - కొన్ని ఇతర చిన్న పార్టీలు మాత్రం ఈ బిల్లును సమర్థించాయి. దాంతో దాన్ని తొమ్మిది మంది సభ్యుల సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఆ కమిటీ ఆమోదంతో అది చట్టంగా మారింది

అప్పట్లో కేంద్రం ఈ చట్టాన్ని రాష్ట్రపతి ద్వారా అడ్డుకునేందుకు ప్రయత్నించింది. నాటి రాష్ట్రపతి జైల్ సింగ్ ఈ చట్టం విషయంలో సుప్రీం కోర్టుకు నివేదించారు. ఆ బిల్లు లేదంటే ఆ బిల్లు లోని అంశమేదైనా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నదేమో చెప్పాల్సిందిగా కోరారు. ఆ కేసును సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించింది. తన అభిప్రాయం వెల్లడించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. రిటర్న్డ్ - రెస్పెక్ట్ ఫుల్లీ - అన్ ఆన్సర్డ్ అంటూ మూడే మూడు పదాలతో దాన్ని రాష్ట్రపతికి తిప్పిపంపింది. అయితే ఆ చట్టం కార్యరూపం దాల్చడంపై మాత్రం స్టే విధించింది. అప్పట్లోనే   ఈ బిల్లును వ్యతిరేకిస్తూ నేషనల్ పాంథర్స్ పార్టీ - బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

ఇక 2016లో మరో సారి ఈ చట్టం సుప్రీం కోర్టు పరిశీలనకు వచ్చింది. వారసులు గాకుండా వలస వెళ్ళిన వారు మాత్రం తిరిగి రావడాన్ని పరిశీలించవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అసలు ఈ చట్టం కింద భారత్ కు తిరిగి వచ్చేందుకు వలస వెళ్ళిన వారిలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారని 2018 డిసెంబర్ లో సుప్రీం కోర్టు ఆరా తీసింది. సుప్రీం ప్రశ్నకు 2019 జనవరి 7న రాష్ట్రప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఆ చట్టం కింద ఒక్క దరఖాస్తు కూడా రాలేదని స్పష్టంచేసింది. మరో వైపున కేంద్రం కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించింది.

దేశభద్రతకు ముప్పు కలుగుతుందని చెప్పింది. ఇక తాజాగా కాశ్మీర్  పునర్ వ్యవస్థీకరణ చట్టం కింద రీసెటిల్ మెంట్ యాక్ట్ ను రద్దు చేసింది. రీసెటిల్ మెంట్ చట్టం రద్దు కావడంతో పాకిస్థాన్ నుంచి కశ్మీరీయులు తిరిగి కశ్మీర్ లో సెటిల్ అయ్యేందుకు తలుపులు మూసుకుపోయినట్లే అయింది. రీసెటిల్మెంట్ చట్టం ఇక ముగిసిన అధ్యాయంగా మారింది. ఇక దీనిపై ఎలాంటి వ్యతిరేకత వస్తుందో వేచి చూడాలి చూడాలి.
Tags:    

Similar News