ప్రపంచంలో 7వ స్థానానికి చేరిన భారత్ .. 2లక్షలకి చేరువలో కేసులు !

Update: 2020-06-01 05:15 GMT
దేశంలో అల్లకల్లోల్లం సృష్టించిన ఈ వైరస్‌ అంచనాలకు అందని విధంగా సాగుతుంది. ఒక్కోసారి కేసులు తగ్గినట్లు, జోరు తగ్గినట్లు కనిపిస్తూ, మరో సందర్భంలో దూసుకుపోతున్నట్లు  కనిపిస్తుంది. దేశంలో కొత్తగా మరో 8392 పాజిటివ్ కేసులు రావడంతో. మొత్తం కేసుల సంఖ్య 190535కి చేరింది. అలాగే నిన్న(ఆదివారం) ఒక్క రోజే 230 మంది చనిపోయారు. కాగా ప్రస్తుతం దేశంలో  మొత్తం రికవరీ కేసులు 91818గా ఉన్నాయి.

అదే సమయంలో యాక్టివ్ కేసులు 93322గా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువ కేసులున్న దేశాల్లో భారత్ 7వ స్థానంలో ఉంది. రోజువారీ ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల్లో నాలుగో  స్థానంలో ఉంది. ఎక్కువ మరణాలు ఉన్న దేశాల్లో 13వ స్థానంలో ఉంది.ఇప్పటి వరకు 5,408 మంది మరణించారు.

ఇకపోతే ఏపీలో కూడా ఈ  వైరస్ రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. వైరస్ నిర్ములన కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు.వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా వైరస్ అదుపులోకి రావడంలేదు. ఇకపోతే ఏపీలో ఇప్పటివరకు  3042 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో 2135 మంది డిశ్చార్జి అయ్యారు. అందువల్ల ఇప్పుడు ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 845. పాజిటివ్ కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన వారు 111 మంది ఉన్నారు. వారంతా యాక్టివ్ పేషెంట్లుగా ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 418 మంది మొత్తం కేసుల్లో భాగంగా ఉన్నారు.

ఇక తెలంగాణ విషయానికొస్తే ..వైరస్ కంట్రోల్ లోకి వచ్చింది అని అనుకున్న సమయాల్లో లాక్ డౌన్ 4 లో సడలింపులు ఇవ్వడంతో రాష్ట్రంలో మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజు కి భారీగా పెరిగిపోతుంది. ఆదివారం  ఒక్కరోజే ఏకంగా 199 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే కొత్తగా 122 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోనూ 40 కొత్త కేసులొచ్చాయి. మేడ్చల్‌లో 10 నమోదయ్యాయి. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల పరిధిలోనే మరో 172 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇవి కాకుండా మరో ఏడు జిల్లాల్లోనూ పాజిటివ్‌లు నిర్థారణ అయ్యాయి.  తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 2,698కి చేరింది. వీరిలో 1428 మంది వైరస్  నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 1,188 మంది చికిత్స పొందుతున్నారు.
Tags:    

Similar News