అలా చేస్తే మూడో స్థానం మ‌న‌దే అంటున్న మోడీ

Update: 2017-01-03 11:12 GMT
తిరుప‌తిలో జ‌రుగుతున్న 104వ‌ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ దేశ ప్ర‌జ‌ల ఆశ‌యాల‌ను విజ్ఞాన శాస్త్రం తీర్చాల‌ని అన్నారు. సైన్స్‌ను స‌ర‌ళ‌త‌రంగా బిజినెస్ చేసే వ్య‌వ‌స్థ‌ను స్థాపించాల‌ని - విజ్ఞానాన్ని పంచాలంటే - దాన్ని బంధించ‌రాద‌ని అన్నారు. విదేశాల‌కు చెందిన‌ విద్యార్థుల‌ను పీహెచ్‌ డీ ప్రాజెక్టుల‌కు తీసుకోవాల త‌ద్వార విభిన్న ప్ర‌తిభాపాట‌వాలు ఒక‌చోట చేరుతాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. శాస్త్ర‌, సాంకేతిక రంగాల్లో పెట్టుబ‌డులు పెర‌గాల‌న్నారు. అలా చేస్తే వ్య‌వసాయం - విద్య - శాస్త్ర - సాంకేతిక రంగాల్లో 2030నాటికి మ‌న‌దేశం మూడో స్థానంలో ఉంటుందని ప్ర‌ధాన‌మంత్రి భ‌రోసా వ్య‌క్తం చేశారు.

త‌మ విజ‌న్‌ తో నిరంత‌రం దేశ అభివృద్ధి కోసం కృషి చేసిన శాస్త్ర‌వేత్త‌ల‌కు ప్ర‌జ‌లు ఎప్పుడూ రుణ‌ప‌డి ఉంటార‌ని ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. మౌళిక స‌దుపాయాల కోసం చేస్తున్న పెట్టుబ‌డుల ద్వారానే భ‌విష్య‌త్తు నిపుణులు త‌యారు అవుతార‌ని తెలిపారు. ఆవిష్క‌ర‌ణ లాంటి అంశాల‌పై ప్ర‌భుత్వం దృష్టి పెట్టింద‌న్నారు. శాస్త్ర‌ - సాంకేతిక విజ్ఞానాన్ని విస్త‌రింప చేసేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని మోడీ అన్నారు. సైబ‌ర్ ఫిజిక‌ల్ వ్య‌వ‌స్థ శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని - సైబ‌ర్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సిన అవ‌స‌రం ఆస‌న్న‌మైంద‌న్నారు. వ్య‌వ‌సాయం - విద్య‌ - సాంకేతిక రంగాల మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.  అన్ని మేటి సంస్థ‌ల్లోనూ శాస్త్రీయ సామాజిక బాధ్య‌త‌ను పెంచాల‌ని ప్ర‌ధాన‌మంత్రి సూచించారు.

సేవా - ఉత్ప‌త్తి రంగాల్లో టెక్నాల‌జీ వినియోగాన్ని పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు. దేశంలో ప‌నిచేస్తున్న మేటి సైన్స్ అండ్ టెక్నాల‌జీ సంస్థలు మౌళిక అధ్య‌య‌న వ్య‌వ‌స్థ‌ను విశ్వ‌స్థాయిలో రూపుదిద్దాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మౌళిక విజ్ఞానాన్ని ఆవిష్క‌ర‌ణ‌లు - స్టార్ట్ అప్ దిశ‌గా తీసుకెళ్లాల‌న్నారు. దాని వ‌ల్లే స‌మ‌గ్ర అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని మోడీ ఉద్ఘాటించారు. అంత‌కుముందు ప్ర‌ధాని మోడీ ప‌లువురు నోబెల్ గ్ర‌హీత‌ల‌కు స‌న్మానం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు - గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ పాల్గొన్నారు. సైన్స్ కాంగ్రెస్ స‌మావేశం త‌ర్వాత మోడీ తిరుమ‌ల వెళ్లి వెంక‌న్న‌ను ద‌ర్శ‌నం చేసుకొని అనంత‌రం ఢిల్లీ వెళ్ల‌నున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News