ఏఎన్32 విమాన గల్లంతు ఉదంతంపై అప్ డేట్స్

Update: 2016-07-23 05:07 GMT
చెన్నైలోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ కు వెళ్లాల్సిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్-32 శుక్రవారం గల్లంతైన సంగతి తెలిసిందే. దీని ఆచూకీ కోసం విపరీతంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. 29 మందితో ఉన్న ఈ విమాన గల్లంతుకు సంబంధించిన అప్ డేట్స్ చూస్తే..

= తాంబరం నుంచి టేకాఫ్ అయిన 16 నిమిషాలకే కంట్రోల్ స్టేషన్ నుంచి సంబంధాలు తెగిపోయింది.  మొత్తం 29 మంది ఉండగా వీరిలో తొమ్మిది మంది విశాఖకు చెందిన వారైతే.. వారిలో ఆరుగురు తెలుగువారు.

= గల్లంతైన విమానం కోసం వైమానికి.. నౌక దళంతో పాటు.. జాతీయ విపత్తు నివారణ సంస్థ గాలింపు చర్యలు చేపట్టాయి. శ్రీలంక.. మలేషియా.. సింగపూర్ దేశాలు సాయం చేస్తామని ముందుకొచ్చాయి.

= ఈ విమానంలో కేవలం నాలుగు గంటలు ప్రయాణించేందుకు అవసరమైన ఇంధనం ఉంది. తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ కు మధ్య ప్రయాణం రెండు గంటలు మాత్రమే కావటం గమనార్హం.  ఏటీసీతో సంబంధాలు కోల్పోయే సమయానికి విమానం భూమికి 23వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ మధ్య దూరం 1200 కిలోమీటర్లు కాగా.. చెన్నై నుంచి 300 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

= గల్లంతైన విమానం ఆచూకీ కోసం 12 యుద్ధ నౌకలు.. రెండు డార్నియర్ యుద్ధవిమానాలు.. హెలికాఫ్టర్లు.. రెండు పీ8ఐ నిఘా విమానాలను వినియోగిస్తున్నారు. ఒకవేళ సముద్రంలోకి కానీ విమానం కూలిపోయి ఉంటే.. కూలిన వెంటనే తన ఆచూకీని చెప్పేసిగ్నల్స్ ను అందుకోవటానికి వీలుగా ఒక జలాంతర్గామిని ఉపయోగిస్తున్నారు.

= ఇటీవల చెన్నై నుంచి కడలూరు పర్యవేక్షణ పనుల కోసం వెళ్లిన ఒక చిన్నపాటి విమానం బయలుదేరి కాసేపటికే గల్లంతైంది. ఇందులో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. ఈ చిన్న విమానం అదృశ్యమైన ఉదంతం ఒకకొలిక్కి రాక ముందే.. 29 మందితో కూడిన విమానం అదృశ్యం కావటం గమనార్హం.

= పోర్ట్ బ్లెయిర్ లో తుపాకులకు అవసరమయిన మరమ్మతులు చేయటానికి విశాఖకు చెందిన నిపుణులైన నేవీ సిబ్బంది ఆరుగురు నుంచి 50 మంది వరకూ బృందాలుగా తరచూ పంపిస్తుంటారు. అక్కడి అవసరానికి తగ్గట్లు రెండు రోజుల నుంచి నెలన్నర వరకూ కూడా సిబ్బంది సేవలు అందిస్తూ ఉంటారు.

= తాజాగా అదృశ్యమైన విమానం ఏఎన్-32 ఈ నెలలోనే మూడుసార్లు సమస్యలు తెల్తెతినట్లుగా నేవీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈ సమాచారం నిజమైన పక్షంలో తరచూ లోపాలున్న విమానాన్ని ఎందుకు వినియోగించారన్నది ఒక ప్రశ్న.

= గడిచిన కొద్దిరోజులుగా బంగాళాఖాతంలో వాతావరణం ఏ మాత్రం సరిగా లేదు. ప్రతికూల వాతావరణం.. బలమైన గాలులు.. ఉరుములు.. మెరుపులు తరచూ వస్తున్న నేపథ్యంలో వాతావరణం అనుకూలించక కూలిపోయే ప్రమాదం ఉందన్న మాట వినిపిస్తోంది.

= రష్యా టెక్నాలజీతో రూపొందించిన ఈ విమానాన్ని 1976 జులైలో తీసుకొచ్చారు. ఈ విమానం ప్రత్యకత ఏమిటంటే.. అతి చిన్న ఎయిర్ పోర్ట్ లలో అయినా టేకాఫ్ తీసుకోగలవు. 16,880 కేజీలు ఉన్న ఈ విమానం టేకాఫ్ వెయిట్ 27వేల కేజీలు. 6.7 టన్నుల సరుకుల్ని మోసుకెళ్లగలదు. గంటకు గరిష్ఠంగా 530కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

= ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఈ తరహా విమానాలు దాదాపు వంద వరకూ ఉన్నాయి. ఒకసారి ఇంధనాన్ని నింపితే నాలుగు గంటల పాటు నిర్విరామంగా ఎగరగలదు. భారత్ లో ఇప్పటివరకూఈ తరహా విమానాలు 11 సార్లు ప్రమాదానికి గురైతే.. ఇప్పటివరకూ 100 మందికి పైగా మరణించారు.
Tags:    

Similar News