యూ... ఇండియ‌న్స్‌...మీకు ఇంగ్లిష్ రాదు

Update: 2019-06-22 06:57 GMT
కొద్దికాలంగా స‌ద్దుమ‌ణిగిన జాత్యాంహ‌కార క‌ల‌కలం తిరిగి మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌స్తోంది. జాత్యాంహ‌కార వ్యాఖ్య‌లు చేసే అమెరికాకు తోడుగా యూరోపియ‌న్ దేశాలు సైతం చేరుతున్నాయి. ఐర్లాండ్‌ కు విహార యాత్ర కోసం వెళ్లిన ఓ భారతీయ కుటుంబాన్ని ఆదేశానికి చెందిన ఓ పౌరుడు పరాభవించాడు. భారతీయుల మేనిఛాయ- ఇంగ్లిష్ పలికే తీరు- సంప్రదాయం- జాతీయత గురించి అవహేళన చేస్తూ గంటపాటు జాత్యాహంకార వ్యాఖ్యలతో రెచ్చిపోయాడు. స‌ద‌రు భార‌తీయుడు ఈ ఘ‌ట‌న‌ను సోష‌ల్ మీడియాలో పంచుకోవ‌డంతో..ఐర్లాండ్ రైల్వే క్ష‌మాప‌ణ కోరింది.

ఇండియాకు చెందిన ప్రసూన్ భట్టాచార్జీ తన కుటుంబంతో కలసి ఐర్లాండ్‌ కు విహార యాత్ర కోసం వెళ్లారు. అందులో భాగంగా బెల్‌ ఫాస్ట్ నుంచి డబ్లిన్ వెళ్లే రైలు ఎక్కారు. ప్రసూన్ భట్టాచార్జీ కుటుంబం కూర్చున్న సీటు పక్కన ఓ ఐర్లాండ్ పౌరుడు ఒక బీరు క్యాన్ తీసుకుని కూర్చున్నాడు. ప్రసూన్ కుటుంబం శరీరం రంగు, ఇంగ్లిష్ పలికే విధానం, భారతీయ సంప్రదాయం, జాతీయత గురించి వెక్కిరిస్తూ.. అవహేళనలూ చేస్తూ అవమానించాడు. వారించాల్సిన రైలు గార్డు వీరిని పట్టించుకోకుండా మొబైల్‌ చూస్తూ నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. సీటులో కూర్చో అంటూ ఆ వ్యక్తిని అక్కడికి వచ్చిన ట్రెయిన్ గార్డు హెచ్చరించాడు.

త‌న‌పై చేసిన‌ జాత్యాహంకార వ్యాఖ్యలు పేర్కొంటూ, జరిగిన ఘటనపై విచారాన్ని వ్యక్తం చేస్తూ ప్రసూన్ భట్టాచార్జీ ఓ ట్వీట్ చేశారు. ప్రసూన్‌ భట్టాచార్య మోదీని- ఐర్లాండ్‌ ప్రధానిని ట్యాగ్‌ చేస్తూ ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశాడు. దీనిపై స్పందించిన ఐరిష్ రైలు సంస్థ భారతీయ కుటుంబం తమ రైలులో ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నందుకు చింతిస్తున్నట్టు తెలిపింది. జరిగిన ఘటనపై క్షమాపణలు కోరింది. కాగా, ఈ సంఘటనపై ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ అధికారి స్పందిస్తూ.. సీసీటీవీ ఫుటేజ్‌ మరియు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.



Tags:    

Similar News