విద్యార్థుల అరెస్ట్‌..కేంద్రం కీల‌క నిర్ణ‌యం

Update: 2019-02-02 06:31 GMT
అమెరికాలో సంచలనం సృష్టించిన పే టు స్టే కుంభకోణం దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధానంగా తెలుగు రాష్ర్టాల్లోని అనేక మంది త‌ల్లిదండ్రుల‌కు కంటిమీద కునుకు లేని ప‌రిస్థితిని సృష్టించిన సంగ‌తి తెలిసిందే. న్యూజెర్సీ - అట్లాంటా - హ్యూస్టన్ - మిషిగాన్ - కాలిఫోర్నియా - లూసియానా - నార్త్ కరోలినా - మిస్సోరి రాష్ర్టాల్లో ప్రత్యేక దాడులు నిర్వహించి సుమారు 200 మంది విదేశీ విద్యార్థుల్ని అరెస్టు చేసినట్లు అక్కడి యంత్రాంగం ప్రకటించింది. వీరిని వివిధ డిటెన్షన్ సెంటర్లకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అరెస్టయిన విదేశీ విద్యార్థుల్లో తెలుగు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారు. అయితే, వీరిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చేందుకు భార‌తీయ అధికారులు కృషి చేస్తున్నారు. ప్ర‌త్యేక హాట్‌ లైన్ ద్వారా నిరంతరం సేవ‌లు అందిస్తోంది.

విద్యార్థుల అరెస్టు నేప‌థ్యంలో త‌గు స‌హాయం చేసేందుకు అమెరికాలోని భారత రాయ‌బార కార్యాల‌యం రంగంలోకి దిగింది. టెక్సాస్‌ లోని డిటెన్షన్‌ సెంటర్‌ లో ఉన్న భారత విద్యార్థులను అక్కడి భారత కాన్సులేట్‌ అధికారులు కలిశారు. విద్యార్థులకు అన్ని విధాల సాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటుగా అరెస్టయిన విద్యార్థులకు సాయం చేసేందుకు 24 గంటల పాటు పనిచేసే హాట్‌ లైన్‌ ను తెరిచింది. విద్యార్థులు - వాటి కుటుంబసభ్యులకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు ఓ నోడల్‌ అధికారిని కూడా నియమించింది. త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని కోరుకుంటూ త‌మ‌ను సంప్ర‌దించాల‌ని కోరింది. కాగా, భార‌త‌విదేశాంగ శాఖ‌ ప్ర‌తినిధి ర‌వీశ్‌ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వాషింగ్ట‌న్ రాయ‌బార కార్యాల‌యంతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామ‌ని తెలిపింది. దీంతోపాటుగా విద్యార్థుల‌ను క‌లుసుకునేందుకు రాయ‌బార కార్యాల‌య వ‌ర్గాల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని కూడా విన్న‌వించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ ప్ర‌క్రియ‌కు అనుమ‌తి ద‌క్కిన త‌ర్వాత త‌గు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

కాగా, వీసా గడువు ముగిసినా సుమారు 600 మంది విదేశీ విద్యార్థులు అమెరికాలోనే ఉండేందుకు సహకరించిన ఎనిమిది మంది తెలుగు విద్యార్థులను మిషిగాన్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఆరుగురిని డెట్రాయిట్‌ లో - ఇద్దరిని వర్జీనియా - ఫ్లోరిడాలో అరెస్టుచేశారు. వీరిపై వీసా అక్రమాలకు పాల్పడడం - తప్పుడు ధ్రువపత్రాల సమర్పణ - లాభాపేక్ష కోసం విదేశీయులకు అక్రమంగా ఆశ్రయం కల్పించడం వంటి అభియోగాలు మోపారు. ఈ మేరకు సంబంధిత పత్రాలను న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. నిందితులు ఉద్దేశపూర్వకంగా - లాభాపేక్షతోనే విదేశీ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలుచేసి వారికి అక్రమంగా ఆశ్రయం కల్పించారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.3.5 లక్షల నుంచి రూ.14.25 లక్షల వరకు వసూలు చేశారు అని సంబంధిత పత్రాల్లో పేర్కొన్నారు. అభియోగాలు రుజువైతే నిందితులకు గరిష్ఠంగా ఐదేళ్ల‌ వరకు జైలు శిక్షపడే అవకాశం ఉంది. మరోవైపు డెట్రాయిట్‌ లో అరెస్టయిన ఆరుగురు తెలుగు విద్యార్థులను సంకెళ్లతో గురువారం స్థానిక కోర్టుకు తీసుకువచ్చారు. అయితే, వీరికి బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించి, కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు. కాగా, తాజాగా అరెస్టయిన విద్యార్థుల్లో పలువురికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారు 60 మైళ్ల పరిధిని దాటిపోకుండా వారికి జీపీఎస్ ట్యాగ్ తగిలించారు. అరెస్టు కానివారు ఫిబ్రవరి 5లోగా దేశం వదిలి వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరించారు. కాగా, ఇమ్మిగ్రేషన్ జడ్జిల డేట్స్ దొరకకపోవడంతో ఈ కేసు మరో రెండు వారాలు కొనసాగే అవకాశం ఉందని సమాచారం.

Tags:    

Similar News