వలసల్లో భారతీయులే టాప్.. వరల్డ్ వైడ్ గా..?

Update: 2019-11-29 06:08 GMT
ఉద్యోగం కోసం, చదువుల కోసం ఇతర దేశాలకి వలస వెళ్లే వారి సంఖ్య నానాటికి పెరుగుతూ పోతుంది. ముఖ్యంగా ఇందులో ఉద్యోగం కోసం ఇతర దేశాలకి వలస వెళ్లే వారే అధికంగా ఉన్నారు. మన దేశంలో సరైన ఉపాధి లభించక కొంతమంది .. విదేశాలలో ఉద్యోగాలు చేయాలన్న కోరికతో కొంతమంది ఇతర దేశాలకి వెళ్లిపోతున్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా తమ సొంత దేశం నుండి ఇతర దేశాలకి వలస వెళ్లిన వారి జాబితాని తాజాగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది.

ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా.. భారతీయులదే అగ్రస్థానం అన్నట్టు ..ఈ జాభితా లో కూడా  మనమే అగ్రస్థానంలో నిలిచాము.  2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారుల్లో 1.80 కోట్ల మంది భారతీయులేనని ఈ నివేదిక తేల్చింది. ఈ జాబితాలో భారత్‌ తర్వాతి స్థానాల్లో మెక్సికో, చైనా నిలిచాయి. ప్రపంచ వలసదారుల జనాభా 27.2 కోట్లకు చేరిందని ఐరాస ప్రకటించింది. అలాగే వలస దారులు ఎక్కువగా అమెరికాకి వెళ్ళడానికే ఇష్టపడుతున్నట్టు ఈ సర్వే లో వెల్లడైంది. అలాగే ఈ మధ్య ఈ వలసలు మరి ఎక్కువగా పెరిగిపోయినట్టు తెలిపింది.

ఇకపోతే ఈ వలసదారుల వల్ల మన దేశానికీ చేరుతున్న సంపద 1,25,000 కోట్లు. ఇక ప్రపంచ వ్యాప్తంగా  ఉన్న వివిధ దేశాలకు చెందిన ప్రవాసులు తమ మాతృదేశాలకు ప్రతి ఏటా పంపించే మొత్తం సొమ్ము ఎంతో తెలుసా? అక్షరాల 689 బిలియన్ డాలర్లు. ఇందులో భారత ప్రవాసీయులు పంపిస్తున్నది 78 బిలియన్ డాలర్లు. 2010లో కేవలం 53 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మొత్తం ఇప్పుడు ఏకంగా 47శాతం పెరిగి 78 బిలియన్ డాలర్లకు చేరింది.
Tags:    

Similar News