కరోనా పురిటిగడ్డలో తెలుగోళ్లు అంతమంది ఉన్నారా?

Update: 2020-01-29 10:26 GMT
ప్రపంచాన్ని వణకిస్తున్న కరోనా వైరస్ కు సంబంధించి తాజాగా బయటకు వచ్చిన ఒక సమాచారం తెలుగువారికి షాకింగ్ గా మారింది. అక్కడెక్కడో చైనాలోని వూహాన్ ఫ్రావిన్స్ లో కరోనా వైరస్ పుట్టినిల్లు అన్న విషయం తెలిసిందే. అక్కడ మనోళ్లు ఎవరూ ఉండరనుకున్నా.. ఆ ప్రాంతంలో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న సమాచారం బయటకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఇంజినీర్లు అక్కడ చిక్కుకుపోయారని చెబుతున్నారు.

క్యాంపస్ సెలక్షన్లో భాగంగా శ్రీసిటీలోని టీసీఎల్ కంపెనీకి ఎంపికైన ఇంజినీర్లు మూడు నెలల శిక్షణ కోసం వుహాన్ కు వెల్లారు. అలా వెళ్లిన 96 మందిలో మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకొని 38 మంది నవంబరులో తిరిగి వచ్చారు. మిగిలిన 58 మంది వుహాన్ లోని కంపెనీ హాస్టల్ లోనే ఉండిపోయారు.

కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో కంపెనీహాస్టల్ నుంచి వీరిని వారి స్వస్థలాలకు పంపాలని కంపెనీ అనుకున్నా సాధ్యం కాలేదు. అప్పటికే వుహాన్ నగరంలో రాకపోకలు నిలిపివేయటంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో.. వారి కోసం వారి కుటుంబాల వారు తీవ్ర ఆందోళనలకు గురి అవుతున్నారు.

వారిని ఏదో రకంగా భారత్ కు తీసుకురావాలని కేంద్ర.. రాష్ట్రాల్ని ఆయా కుటుంబాల వారు కోరుతున్నారు. కరోనా వైరస్ పుట్టినింట్లో మన తెలుగోళ్లు ఇంత పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆయా కటుంబాలు తీవ్రమైన మనోవ్యధకు గురవుతున్నాయి. వారంతా క్షేమంగా తిరిగి రావాలని పలువురు ప్రార్థిస్తున్నారు.

    

Tags:    

Similar News