ముగిసిన అమెరికా షట్‌ డౌన్..మ‌నోళ్లు సేఫ్‌

Update: 2018-01-23 08:16 GMT
మూడురోజులుగా స్తంభించిన అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యులు, ప్రతిపక్ష డెమోక్రాట్ల మధ్య ఒక ఒప్పందం కుదరడంతో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందింది. డెమోక్రాట్ల నాయకుడు చక్ షుమర్ మాట్లాడుతూ, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అమెరికాలోకి వచ్చిన వేలాది మంది వలసదారుల భవిష్యత్‌ పై ఒక ఒప్పందం కుదుర్చుకొనేందుకు ప్రభుత్వం అంగీకరించిందని అందువల్ల స్వల్ప కాలిక ద్రవ్య వినిమయ బిల్లుకు అనుకూలంగా తాము మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. దీంతో ఆ దేశంలోని భార‌తీయులు సేఫ్ అని తెలుస్తోంది.

వలసలు - వ్యయాలపై డెమోక్రాట్లు - రిపబ్లికన్ల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన నేపథ్యంలో సెనేట్‌ లో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో ఐదేండ్లలో మొదటిసారిగా ప్రభుత్వ లావాదేవీలు నిలిచిపోయాయి. అమెరికా సెనేట్‌ లో జనవరి 19లోగా ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం నాడు చివరి నిమిషం వరకూ పలువురితో సంప్రదింపులు జరిపారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోవడానికి డెమోక్రాట్లే కారణమని ఆయన ఆరోపించారు. అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్‌ తోపాటు ఇతర ప్రభుత్వ సంస్థల కోసం నిధులు మంజూరు చేసే స్వల్పకాలిక వినిమయ బిల్లును డెమోక్రాట్లతోపాటు కొందరు రిపబ్లికన్లు కూడా అడ్డుకున్నారు. పన్ను రాయితీలు ప్రకటించి తాము సాధించిన విజయాలను అడ్డుకొనేందుకే డెమోక్రాట్లు ద్రవ్య బిల్లును వ్యతిరేకించారని ట్రంప్ మండిపడ్డారు. బిల్లు ఆమోదం పొందకపోవడంతో ఫిబ్రవరి 16 వరకూ ప్రభుత్వం మూతపడుతుంది. అక్రమంగా వలస వచ్చిన వారు దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటంతో వారి విషయమై చర్చలు జరిపే విధంగా ఒత్తిడి తెచ్చేందుకు డెమోక్రాట్లు ఇటువంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. డెమోక్రాట్లు దేశ సైన్యం, భద్రతకన్నా అక్రమవలసదారులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.

అయితే అనంత‌రం ఇరు వ‌ర్గాల మధ్య జ‌రిగిన చ‌ర్చ‌లో ష‌ట్‌ డౌన్‌ కు శుభం కార్డు ప‌డింది. సెనేట్ స్వల్పకాలిక బిల్లును ఆమోదించినందున ఫిబ్రవరి 8వ తేదీ వరకు మాత్రమే ప్రభుత్వ ఖర్చులకు నిధులు అందుతాయి. ఆ తరువాత మరోసారి డెమోక్రాట్ల షరతులకు ప్రభుత్వం అంగీకరించడాన్ని బట్టి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పరిశీలకులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మూతపడిన కారణంగా మూడురోజులుగా ఇళ్ల‌కే పరిమితమైన ప్రభుత్వోద్యోగులు తిరిగి విధులకు హాజరు కానున్నారు.

కాగా, కాందీశీకుల విష‌యంలో ట్రంప్ గతంలో వ‌లే మొండిప‌ట్టుపై ఉండ‌రని అంటున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యం ఆధారంగా ఆ దేశంలోని 8 ల‌క్ష‌ల‌మంది, అందులోనూ 7వేల భార‌తీయులు సేఫ్ అని విశ్లేషిస్తున్నారు. త‌న ప్ర‌తిష్ట కోసం, దేశం స్తంభించ‌కుండా ఉండేందుకు...ట్రంప్ వెన‌క్కు త‌గ్గ‌వ‌చ్చ‌ని  చెప్తున్నారు.
Tags:    

Similar News