తెరపైకి మరోమారు ‘కోహినూర్’ డిమాండ్

Update: 2015-11-12 17:30 GMT
వందల ఏళ్లు పాలించిన బ్రిటీషోడు దేశ సంపదను ఎంతగా దోచుకెళ్లాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సహజ వనరులు పుష్కలంగా ఉన్న భారతదేశం నుంచి భారీగా తమ దేశానికి తరలించికెళ్లి.. పేదరికానికి కేరాఫ్ అడ్రస్ గా మార్చిన తెల్లవాడు.. విలువైన ఎన్నోవస్తువుల్ని పట్టుకెళ్లాడు. అలాంటి వాటిల్లో ఒకటి కోహినూర్ వజ్రం. కాకతీయ సామ్రాజ్యంలో కొల్లూరు గనుల్లో బయటపడిన ఈ అపురూప వజ్రం ప్రపంచంలోకెల్లా అది పెద్ద వజ్రంగా పేరుంది.

ప్రస్తుతం ఎలిజిబెత్ మహారాణి కిరీటంలో ఉండే కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇవ్వాలన్న డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. 13వ శతాబ్ధంలో బయటకొచ్చిన ఈ వజ్రం కాలక్రమంలో ఎంతోమంది చేతుల్లోకి మారటంతో పాటు.. ఎన్నో ముక్కలు అయ్యింది కూడా. ఈ వజ్రాన్ని మొదట బయటకు తీసినప్పుడు 793 క్యారెట్లుగా ఉండేది. ప్రస్తుతం సుమారు 105 క్యారెట్లు ఉన్నట్లు చెబుతారు. ప్రస్తుతం దీని విలువ వెయ్యి కోట్ల రూపాయిలకు పైమాటగా చెబుతున్నారు.

కాంతి పర్వతంగా పేరున్న కోహినూర్ ను బారత్ కు తిరిగి ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నదే. అయితే.. బ్రిటన్ దీనికి సముఖంగా లేదు. తాజాగా ప్రధాని మోడీ బ్రిటన్ పర్యటన జరుపుతున్న నేపథ్యంలో కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇచ్చేయాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. కోహినూర్ వజ్రం మీద భారతీయులకున్న అనుబంధాన్ని బ్రిటన్ సర్కారుకు మోడీ మాటవరసకైనా చెబుతారా? వందలాది ఏళ్లు పాలించి.. జాతి సంపదనెంతో దోచుకెళ్లిన తెల్లవాడు.. కనీసం కోహినూర్ ను అయినా తిరిగి ఇచ్చేస్తాడా? బ్రిటన్ కు అంత పెద్ద మనసు ఉందనుకోవచ్చా?
Tags:    

Similar News