అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మనోళ్ల ఓట్లు

Update: 2020-07-21 11:30 GMT
ఇవాల్టి రోజున అమెరికాలో అన్నేసి కరోనా కేసులు ఎందుకు నమోదవుతున్నట్లు? అధ్యక్ష కుర్చీలో కూర్చున్న ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవేనా? ప్రపంచంలో మరే దేశంలో లేని రీతిలో అమెరికాలో మార్కెట్లను అలా ఎందుకు వదిలేస్తున్నారు? ప్రభుత్వం కఠినంగా ఎందుకు వ్యవహరించటం లేదు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే కారణం.. అమెరికా అధ్యక్ష ఎన్నికలే. ఒకవేళ.. ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు లేని పక్షంలో అమెరికా పరిస్థితి మరోలా ఉండేదన్న వాదన కూడా లేకపోలేదు.

స్వేచ్ఛను కోరుకునే అమెరికన్లను నియంత్రించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదురు కావటం తథ్యం. ఎన్నికలు ఇప్పట్లో లేకుండా ఉండి ఉంటే.. కాస్తంత కరకుగా వ్యవహరించే వీలుండేది. ఎన్నికల పుణ్యమా అని అలాంటి పరిస్థితి లేదు. ఈ కారణంతోనే దాదాపు 40లక్షల కేసులు పాజిటివ్ అయితే.. అందులో 1.43లక్షల మంది మరణాలు చోటు చేసుకున్నాయి. ఇంత భారీగా అమెరికన్లు మరణించటం ఇదే తొలిసారి. కఠినమైన నియంత్రణ లేకపోవటం కూడా కారణంగా చెప్పక తప్పదు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు ఇంతమంది అమెరికన్ల ప్రాణాల్ని పణంగా పెట్టేందుకు ట్రంప్ సర్కారు సిద్ధమైందన్న విమర్శలు లేకపోలేదు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు భారతీయ అమెరికన్లు కీలకంగా మారనున్నారు. వారు వేసే ఓట్లు అధ్యక్ష ఎన్నికల ఫలితాల మీద ప్రభావితం చేయనున్నాయి. ఇదే విషయాన్ని డెమొక్రాట్లు కూడా బలంగా నమ్ముతారు. గత అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కు భారతీయ అమెరికన్లు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. ఈసారి డెమొక్రాట్ల అభ్యర్థి జో బిడెన్ వైట్ హౌస్ వెళ్లేందుకు మనోళ్ల ఓట్లు కీలకం కానున్నట్లుగా భావిస్తున్నారు.

ఈ వాదనకు బలం చేకూరేలా డెమొక్రటిక్ జాతీయ కమిటీ ఛైర్మన్ టామ్ పెరెజ్ ఒక వర్చువల్ మీటింగ్ లో మాట్లాడుతూ.. భారతీయ అమెరికన్ ఓట్లు కచ్ఛితంగా ఫలితాల్లో తేడాను తీసుకొస్తాయన్నారు. ఇదే విషయాన్ని గత ఎన్నికల ఫలితాల్ని చూసినప్పుడు భారతీయ అమెరికన్లు.. చైనీయులు.. ఫిలిపినో.. కొరియన్.. జపనీస్.. ఇండోనేషియా సంతతి వారు.. ఆసియా అమెరికన్లు.. పసిఫిక్ ద్వీపవాసులు ఎక్కువగా ఉన్న మిచిగాన్.. విస్కాన్సిన్.. పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ట్రంప్ కు తక్కువ మెజార్టీ లభించటాన్ని మర్చిపోకూడదు.

మిచిగాన్ లో 1.25లక్షల మంది భారతీయ అమెరికన్ ఓటర్లు.. పెన్సిల్వేనియాలో 1.56లక్షలు.. విస్కాన్సిన్ లో 37వేల మంది ఉన్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొత్తం 40 లక్షల మంది భారతీయఅమెరికన్లు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో మూడోవంతు మంది ఓట్లు వేయటానికి అర్హులు. తాజా అంచనా ప్రకారం బిడెన్ ను గెలిపించటంలో భారతీయ అమెరికన్లు కీలకభూమిక పోషించనున్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఆ పార్టీ తన ఫోకస్ మనోళ్ల మీద పెట్టినట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News