విదేశీ విద్యపై 'మోజు' పడుతున్న భారతీయులు..!

Update: 2022-12-13 12:30 GMT
భారత్ లో ఐఐటీ.. బిట్స్.. నల్సార్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక విద్య సంస్థలు ఎన్నో ఉన్నాయి. వీటిలో విద్యను అభ్యసించేందుకు భారతీయ విద్యార్థులుతీవ్రంగా పోటీ పడుతుంటారు. విదేశీయులు సైతం భారత్ లో విద్యను అభ్యసించేందుకు వస్తుంటారు. అయితే వీటిలో అవకాశం దక్కని చాలామంది విద్యార్థులు మాత్రం విదేశాలకు పయనం అవుతూ ప్రపంచ స్థాయి విద్య కోసం పోటీ పడుతున్నారు.

ప్రతి యేటా విదేశాలకు విద్య కోసం వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరిగి పోతోంది. వీరిలో ఎక్కువ మంది అమెరికా.. కెనడా.. బ్రిటన్.. ఆస్ట్రేలియా దేశాల్లోని విదేశీ విద్యపై మోజు పెంచుకున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. 2019లో భారత్ నుంచి అత్యధికంగా 5 లక్షల 19వేల మంది రికార్డు స్థాయిలో విదేశీ విద్యకు అభ్యసించేందుకు వెళ్లడం విశేషం.

అయితే ఆ తర్వాత కరోనా ఎంట్రీ ఇవ్వడంతో విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు భారతీయులు కొంత వెనుకంజ వేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితులన్నీ యథాస్థితికి రావడంతో భారతీయులు మళ్లీ విదేశాలకు వెళ్లేందుకు భారీ క్యూ కడుతున్నారు. ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో ఆరు లక్షల 49 వేల మంది విదేశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్లినట్లు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

ఉక్రెయిన్-రష్యా వార్ నేపథ్యంలో చాలా మంది భారతీయులు ఈసారి అమెరికా.. కెనడా.. బ్రిటన్.. ఆస్ట్రేలియా దేశాలకు వెళ్లేందుకు మొగ్గుచూపారు. ముఖ్యంగా బ్రిటన్ కు వెళ్లేందుకు భారతీయులు ఆసక్తి చూపుతున్నట్లు గణంకాలు వెల్లడిస్తున్నాయి. భారత్ లోని బ్రిటన్ హై కమిషన్ నివేదికల ప్రకారం మార్చి 2022 ముగిసిన ఏడాదిలో ఒక లక్షా 8 వేల మందికి బ్రిటన్ స్టూడెంట్ వీసాలు మంజూరు చేసింది.

అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింతలు అయిందని బ్రిటన్ యూనివర్సీటీలు పేర్కొంటున్నాయి. బ్రిటన్ పట్ల భారతీయులు మొదటి నుంచి ఆసక్తి చూపిస్తున్నారని బ్రిటన్ యూనివర్సిటీల ఐక్యవేదిక యూనివర్శిటీస్ యూకే ఇంటర్నేషనల్  డైరెక్టర్ వివియన్ స్టర్న్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇరుదేశాల విద్యార్థులకు లబ్ధి చేకూరేలా ఉమ్మడి కార్యక్రమాలు ఇందుకు కారణమని పేర్కొన్నారు. గతేడాది జూలై ప్రారంభంలో గ్రాడ్యూయేట్ విద్యార్థి వీసాపై భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు.. చదువు పూర్తయ్యాక కూడా బ్రిటన్లో రెండేళ్లపాటు ఉద్యోగం చేసుకునే వెలుసుబాటు ఉండటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఆయన తెలిపారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News