స్టార్ ఇండియా సీఈవో ఇంటి రియ‌ల్ క్రైం స్టోరీ

Update: 2015-08-26 11:21 GMT
బాలీవుడ్ క్రైం.. థిల్ల‌ర్‌ ను త‌ల‌పించే రియ‌ల్ స్టోరీ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. దేశంలోనే అత్యంత ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల్లో ఒక‌టైన స్టార్ ఇండియా సీఈవో ఇంటి వ్య‌వ‌హారం ఇప్పుడో హాట్ టాపిక్‌ గా మారింది. దేశంలోనే అత్యంత ప‌వ‌ర్‌ ఫుల్ వ్య‌క్తుల్లో ఒక‌రైన పీట‌ర్ ముఖ‌ర్జీ ఇంటి వ్య‌వ‌హారం ర‌చ్చ‌కెక్క‌ట‌మే కాదు.. పోలీస్ స్టేష‌న్‌.. అరెస్ట్ లాంటి ఎన్నింటికో దారి తీసింది.

ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని చూస్తే..

స్టార్ ఇండియా సీఈవో పీట‌ర్ ముఖ‌ర్జీ. ఆయ‌న‌కు గ‌తంలో ఒక పెళ్లి అయ్యింది. త‌ర్వాత వారు విడిపోయారు. అనంత‌రం ఆయ‌న‌.. ఇంద్రాణి ముఖ‌ర్జీ ని పెళ్లాడారు. వారిద్ద‌రూ హ్యాపీగా గ‌డిపేస్తుంటారు. ఇక్క‌డే ఓ పెద్ద సీక్రెట్ ఉంది. పీట‌ర్ ముఖ‌ర్జీ రెండో భార్య ఇంద్రాణికి గ‌తంలోనే పెళ్లి అయ్యింది. కానీ.. ఆమె పీట‌ర్‌ కు ఈ విష‌యాన్ని చెప్ప‌కుండా దాచారు. ఇదే పెద్ద త‌ప్పు అనుకుంటే మ‌రో పెద్ద త‌ప్పు చేశారు. అదేమంటే.. త‌న మొద‌టి భ‌ర్త‌తో క‌లిగిన సంతాన‌మైన షీనా బోరాను..త‌న సోద‌రిగా ఆమె పీట‌ర్‌ కు ప‌రిచ‌యం చేశారు. అంటే.. త‌న సొంత కూతురిని త‌న రెండో భ‌ర్త‌కు.. త‌న సోద‌రిగా చెప్పార‌న్న‌మాట‌.

ఇదిలా ఉంటే.. ఈ రియ‌ల్ స్టోరీలో అనుకోని ఒక మ‌లుపు తీసుకుంది.  పీట‌ర్ మొద‌టి భార్య‌కు పుట్టిన కుమారుడు.. ఇంద్రాణి మొద‌టి భ‌ర్త‌తో జ‌న్మించిన షీనాతో ల‌వ్‌ ట్రాక్ మొద‌లైంది. అంటే.. ఒక‌విధంగా అన్నా చెల్లెళ్ల మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హార‌మ‌న్న మాట‌. దీన్ని ఇంద్రాణి స‌హించ‌లేక‌పోయారు.

త‌న రెండో భ‌ర్త‌కు.. అబ‌ద్ధం మీద అబ‌ద్ధం చెప్పేసిన ఆమె.. తాను ఎంత‌కూ దిద్దుకోలేని మ‌రో పెద్ద త‌ప్పును చేసేశారు. త‌న కూతురు త‌న రెండో భ‌ర్త సంతానంతో ల‌వ్‌ ట్రాక్ న‌డ‌ప‌టంపై అగ్ర‌హం చెందిన ఇంద్రాణి.. త‌న కుమార్తె షీనా అడ్డు తొల‌గించుకోవాల‌ని ప్లాన్ చేసింది. ఇందుకోసం ఇంటి డ్రైవ‌ర్‌ ని సంప్ర‌దించింది.

అనుకున్న‌ట్లే డ్రైవ‌ర్ సాయంతో కుమార్తె షీనాను అడ్డు తొల‌గించుకుంది. 2012లో షీనాను చంపేసి.. ఆమె మృత‌దేహాన్ని రాయ్‌ గ‌ఢ్ అట‌వీ ప్రాంతంలో పూడ్చేశారు. ఇంత దారుణానికి ఒడిక‌ట్టి కూడా ఏమీ తెలియ‌ని అమాయ‌కురాలిగా ఆమె వ్య‌వ‌హ‌రించేవారు. షీనా గురించి అడిగిన ప్ర‌తిసారీ తాను అమెరికాలో ఉంద‌ని.. చాలా బిజీగా ఉందంటూ మాట త‌ప్పించేది. పీట‌ర్ కుమారుడు షీనా కోసం త‌ర‌చూ అడిగినా ఇంద్రాణి నుంచి ఇలాంటి స‌మాధాన‌మే వ‌చ్చేది. చివ‌ర‌కు పాపం పండి.. ఆమె చేసిన అస‌లు దారుణం బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

ఈ మొత్తం ఎపిసోడ్‌ లో పెద్ద షాక్ ఏమిటంటే.. స్టార్ ఇండియా సీఈవో పీట‌ర్‌ కు.. త‌న భార్య ఇంద్రాణికి గ‌తంలోనే పెళ్లి అయ్యింద‌ని.. ఆమెకో కుమార్తె ఉన్నార‌న్న విష‌యం తెలియ‌క‌పోవ‌టం. తాజాగా ఈ విష‌యాన్ని విని ఆయ‌న అవాక్క‌వుతున్నారు. తాను ప్ర‌తి విష‌యంలో నిజాయితీగా ఉండేవాడిన‌ని.. ఇంద్రాణి ఇన్ని అబ‌ద్ధాలు చెబుతుంద‌ని తాను ఊహించ‌లేదంటున్నాడ‌ట‌. త‌న భార్య గ‌తం గురించిన తెలిసిన ఆయ‌న‌కు త‌గులుతున్న షాకులు చూసి.. ఆయ‌న సన్నిహితులు సైతం విస్మ‌యం చెందుతున్నార‌ట‌. తాజాగా ఇంద్రాణిని ముంబ‌యి పోలీసులు అరెస్ట్ చేశారు. తాను చేసిన దారుణాన్ని ఆమె ఒప్పుకున్నార‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News