ఒక పక్క హాహాకారాలు..మరోవైపు దోచుకోవడాలు

Update: 2018-10-21 07:12 GMT
పెను విషాదంలోనూ దొంగలు రెచ్చిపోయారు. ఒక పక్క రక్తసిక్తమై పడి ఉన్న మృతదేహాలు - మరో పక్క గాయాలతో అల్లాడుతున్న క్షతగాత్రుల మధ్య లో కూడా కొంత మంది దొరికిన వస్తువులను దోచుకున్నారు. అమృత్ సర్ లో రెండు రోజుల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో జరిగిన ఈ సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి.

అమృత్ సర్ లో దసరా వేడుకలను వీక్షిస్తున్న వారిపై రైలు దూసుకెళ్లిన సంఘటనలో 61 మంది మృతి చెందగా - 143 మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన కలకలం స‌ృష్టించింది. నిస్సహాయ స్థితిలో పడి ఉన్న వారి మెడలో బంగారు వస్తువులు - సెల్ ఫోన్లు ఇతర విలువైన వస్తువులను స్థానికులు లాక్కెళ్లిపోయారు. బాధితులు కొంత మంది తమకు ఎదరైన సంఘటనలను పాత్రికేయులతో పంచుకుని బాధపడ్డారు.

‘‘ నా కొడుకు చనిపోయాడు. అలాంటి సమయంలోనూ నా కొడుకు జేబులోని రూ.20వేల విలువైన సెల్ ఫోన్ ను ఎవరో తీసుకెళ్లారు’’ అని వివరించాడో బాధితుడు. మరో బాధితురాలు మాట్లాడుతూ ‘‘ నేను నా ఇద్దరు పిల్లలు దసరా వేడుకలను చూడటానికి వెళ్లాం. రైలు ప్రమాదంలో కూతురు మృతి చెందింది. కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. సహాయం కోసం తీవ్రంగా అరుస్తుండగా - ఎవరో వెనుక నుంచి వచ్చి నా మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు’’ అని వివరించాడు.

హ‌‌ృదయ విషాదకర సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించాల్సిన ప్రజలు ఇలా వ్యవహరించడం విస్మయానికి గురి చేస్తుంది. దిగ్బ్రాంతికి గురి చేసిన ఈ ఘటనలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మానవత్వం మంట కలుపుతూ కొంతమంది ఇలా వ్యవహరించగా - ఇంకొంత మంది తక్షణమే స్పందించి సహాయ సహకారాలను అందించారు. బాధితులకు ఊరట కల్పించారు.
   

Tags:    

Similar News