వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే మ‌ధ్య ముదురుతున్న వివాదం

Update: 2021-12-16 06:13 GMT
వాళ్లిద్ద‌రూ అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులే. ఒక‌రు అనంత‌పురంలోని హిందూపురం ఎంపీ కాగా.. మ‌రొక‌రు క‌ర్నూల్లోని ప‌త్తికొండ ఎమ్మెల్యే. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వీళ్లిద్ద‌రూ కొన్ని రోజ‌లు పాటు త‌మ ప‌నే తాము చేసుకున్నారు. కానీ ఇటీవ‌ల కాలంలో ఆ ఎంపీ.. ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్నేయ‌డంతో వివాదం రాజుకుంది.

అది రోజురోజుకూ ముదురుతోంది. ఆ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ కాగా.. ఆ శాస‌న స‌భ్యురాలు శ్రీదేవి. వీళ్లిద్ద‌రి మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా వివాదం సాగుతోంది. తాజాగా మ‌రోసారి ఫ్లెక్సీల గొడ‌వ‌తో అది తీవ్ర‌మైంది.

ఈ మ‌ధ్య ఎంపీ గోరంట్ల మాధ‌వ్ త‌ర‌చుగా ప‌త్తికొండ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటిస్తున్నారు. దీన్ని మాధ‌వి వ‌ర్గం వ్య‌తిరేకిస్తోంది. తాజాగా త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన కురువ కుల స‌మావేశానికి మాధ‌వ్ ప‌త్తికొండ‌కు వ‌చ్చారు. ఎంపీ రాక నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు కురువ కుల స‌భ్యులు ప‌త్తికొండ‌లో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కానీ అది స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి వ‌ర్గానికి రుచించ‌లేదు. త‌న సొంత జిల్లాలో అనంత‌పురం నేత హ‌డావుడి చేయ‌డమేంట‌ని ఆమె ఆగ్ర‌హంతో ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో మాధ‌వ్ ప‌త్తికొండ నుంచి వెళ్ల‌గానే పంచాయ‌తీ అధికారులు ఆయ‌న ఫ్లెక్సీల‌ను తొల‌గించారు. దీనిపై కురువ కుల స‌భ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి ఆదేశాల మేర‌కే పంచాయ‌తీ అధికారులు ఎంపీ మాధ‌వ్ ఫ్లెక్సీల‌ను తొల‌గించార‌ని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఓ అధికార పార్టీ ఎంపీ ఫ్లెక్సీల‌ను అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎలా తొల‌గించ‌మంటార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో మెజారిటీ ఓట్లు కురువ కుల ప్ర‌జ‌లవే.

అందుకే వాళ్ల‌ను త‌న‌వైపు తిప్పుకుని 2024 ఎన్నిక‌ల్లో ప‌త్తికొండ ఉంచి ఎమ్మెల్యే టికెట్ ద‌క్కించుకోవాల‌ని మాధ‌వ్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని శ్రీదేవి వ‌ర్గం అనుమానం చెందుతోంది. అందుకే త‌ర‌చుగా ఆయ‌న కుల సంఘం స‌మావేశం పేరుతో ఇక్క‌డ త‌న కేడ‌ర్‌ను పెంచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని అంటున్నారు. మాధ‌వ్‌ను ప‌త్తికొండ రాకుండా అడ్డుకోవ‌డం కోసం సీఎం జ‌గ‌న్‌కు శ్రీదేవి ఫిర్యాదు చేసే అవ‌కాశం ఉంది.



Tags:    

Similar News