త‌మిళ‌నాట ఏం జ‌రుగుతోంది?

Update: 2017-11-16 07:35 GMT
త‌మిళ‌నాట రాజ‌కీయం మ‌రింత రంజుగా మారిపోయింది. ఆ రాష్ట్ర దివంగత ముఖ్య‌మంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జె.జ‌య‌ల‌లిత హ‌ఠాన్మ‌ర‌ణంతో త‌మాళ‌నాట ఏర్ప‌డ్డ రాజ‌కీయ శూన్య‌త... ఎప్ప‌డిక‌ప్పుడు భ‌ర్తీ అవుతూనే, ఆ వెంట‌నే ఖాళీ అయిపోతూ వ‌స్తోంది. వెర‌సి నిత్యం అక్క‌డ చోటుచేసుకునే ప‌రిణామాలు ఆ రాష్ట్రానికి మాత్ర‌మే ప‌రిమితం కాకుండా దేశ‌వ్యాప్తంగానూ సంచ‌ల‌నంగా మారిపోతున్నాయి. ప్రాంతీయాభిమానానికి పెట్ట‌ని కోట‌గా ఉన్న త‌మిళ‌నాట‌... ఇప్ప‌టిదాకా జాతీయ పార్టీలు పెద్ద‌గా పొడిచిందేమీ లేదు. ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా... అటు కాంగ్రెస్ గానీ, ఇటు బీజేపీ గానీ... త‌మిళ‌నాడులోని ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో  పొత్తు పెట్టుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఆ పొత్తులు కూడా జాతీయ పార్టీల‌కు పెద్ద‌గా క‌లిసి రాలేద‌నే చెప్పాలి. అస‌లు ఇప్ప‌టిదాకా త‌మిళ‌నాడులో జాతీయ పార్టీల‌కు క‌నీస బేస్ కూడా లేదంటే అతిశ‌యోక్తి కాదేమో. మ‌రి అలాంటి ప్రాంతీయ పార్టీలు... అమ్మ మ‌ర‌ణంతోనే డ‌మ్మీలుగా మారిపోయాయా? అంటే... ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ లాంటి రాజ‌కీయ ధురంధురులు ఉంటే... ఆ ప్రాంతీయ పార్టీలేంటీ... ఎంత‌టి బ‌ల‌మున్న పార్టీలైనా చేతులు ముడుచుకుని కూర్చోవాల్సిందే.

క‌ల‌మ ద‌ళాన్ని దేశ‌వ్యాప్తంగా విస్త‌రించాల‌న్న ఒకే ఒక్క ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్న మోదీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాల ద్వ‌యానికి.. జ‌య మ‌ర‌ణం ఒక ఆయాచిత వ‌రంగానే ప‌రిణ‌మించింద‌ని చెప్పాలి. క‌ష్టాల్లో ఉన్న రాష్ట్రానికి అండ‌గా ఉంటామ‌ని చెబుతూనే... తెర వెనుక పావులు క‌దుపుతున్న మోదీ_షా లు త‌మ అస‌లు సిస‌లు గేమ్ ప్లాన్‌ను ఇప్పుడిప్పుడే మొద‌లుపెట్టిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అయినా ఇప్పుడు త‌మిళ‌నాడులో ఏం జ‌రుగుతోంద‌న్న విష‌యంపై ఓ క‌న్నేస్తే... మ‌న‌కు షాక్ త‌గ‌ల‌క త‌ప్ప‌దు. ప్ర‌జాస్వామ్య దేశ‌మైన భార‌త్‌లో ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వాల‌నే పాల‌న సాగించాల్సి ఉంది. ఆ పాల‌న‌ను ప‌ర్య‌వేక్షించే రాజ్యాంగ బ‌ద్ధ ప‌ద‌విలో... కేంద్రంలో రాష్ట్ర‌ప‌తి, రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్లు కీల‌క‌మ‌నే చెప్పాలి. ర‌బ్బ‌ర్ స్టాంప్‌లుగా పేరున్న ఈ ప‌దవుల్లోని నేత‌లు పెద్ద‌గా సాధించేదేమీ కూడా లేద‌నే చెప్పాలి. అయితే కేంద్రంలో అదికారం ఉన్న పార్టీకి చెందిన నేత‌లు ఈ ప‌ద‌వుల్లో ఉంటే మాత్రం... ఆ పార్టీకి వైరి వ‌ర్గాలుగా ఉన్న పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల‌కు చుక్క‌లు క‌న‌డ‌బ‌తాయి.

స‌రిగ్గా ఇప్పుడు త‌మిళ‌నాడులోనూ అదే జ‌రుగుతోంది. ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశ‌య్య ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత తాత్కాలిక గ‌వ‌ర్న‌ర్‌గా తెలుగు నేల‌కే చెందిన మ‌హారాష్ట్ర గ‌వ‌ర్నర్ సీహెచ్ విద్యాసాగ‌ర్ రావు చాలా కాలం పాటు కొన‌సాగారు. అయితే త‌మిళ‌నాట త‌మ‌కు అనుకూల‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌న్న ధీమా వ‌చ్చిన త‌ర్వాత మోదీ స‌ర్కారు.. విద్యాసాగ‌ర్ స్థానంలో ఫుల్ టైం గ‌వ‌ర్నర్‌గా బీజేపీకి చెందిన సీనియ‌ర్ నేత‌... భ‌న్వ‌రిలాల్ పురోహిత్‌ను నియ‌మించింది. కేంద్రం ఆదేశాల‌తో ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన పురోహిత్‌... కేంద్రం త‌న చెవిలో చెప్పిన ప్లాన్‌ను కూడా పక్కాగా అమ‌లు చేసేందుకు రంగంలోకి దిగిపోయారు. ప్ర‌స్తుతం త‌మిళనాడులో ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వం ఉంది. సీఎంగా ఎడ‌ప్పాడి ప‌ళ‌నిసామి, డిప్యూటీ సీఎంగా ఓ ప‌న్నీర్ సెల్వంలు ఉన్నారు. వారి ఆధ్వ‌ర్యంలో మంత్రివ‌ర్గం కూడా ఉంది. వెర‌సి అక్క‌డ పాల‌న‌కు ఎలాంటి ఇబ్బందులు లేవ‌నే చెప్పాలి. అయితే త‌న‌దైన శైలి ప్లాన్‌ను బ‌య‌ట‌కు తీసిన పురోహిత్ గ‌డ‌చిన రెండు రోజులుగా అన్నాడీఎంకే స‌ర్కారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. స్వ‌చ్ఛ‌భార‌త్ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకునే నిమిత్తం... మొన్న‌ చీపురు ప‌ట్టి బ‌స్టాండ్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన పురోహిత్‌.. ఆ త‌ర్వాత అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

బ‌య‌ట‌కు వ‌చ్చిన తొలి సంద‌ర్భంగా స‌మీక్ష నిర్వ‌హించి ఉంటారులే అనుకున్న ఈపీఎస్‌ - ఓపీఎస్‌ల‌కు షాకిస్తూ... నిన్న కూడా పురోహిత్ మ‌రో జిల్లాకు వెళ్లి అక్క‌డ కూడా స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పురోహిత్‌... రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స‌మీక్ష‌లు నిర్వ‌హించి తీర‌తాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంటే ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వం ఉండ‌గానే... దానికి స‌మాంత‌రంగా తాను ఓ వ్య‌వ‌స్థ‌ను న‌డుపుతాన‌ని పురోహిత్ చెప్ప‌క‌నే చెప్పేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే ఈ ప‌రిణామంపై ఓపీఎస్‌గానీ, ఈపీఎస్‌గానీ నోరు విప్పేందుకు కూడా సాహ‌సించ‌డం లేదు. ఎందుకంటే... అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత అన్నాడీఎంకే ముక్క‌లై పోగా... ఏ చిన్న అవ‌కాశం దొరికినా... సీటు లాగేసుకుందామంటూ కాసుకుని కూర్చున్న ప్ర‌త్య‌ర్థుల‌ను చూసి భ‌య‌ప‌డుతున్న వీరిద్ద‌రూ... గ‌వ‌ర్న‌ర్ ఏం చేసినా కూడా నోరు మెదిపే స్థితిలో లేర‌నే చెప్పాలి. ఇదిలా ఉంటే... జిల్లాల్లో స‌మీక్ష‌ల పేరిట రంగంలోకి దిగిన పురోహిత్‌... త‌న కోసం ఏకంగా సెక్ర‌టేరియ‌ట్‌లోనూ ప్ర‌త్యేకంగా ఛాంబ‌ర్లు ఏర్పాటు చేయించుకుంటున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌ను చూస్తుంటే... నేడో, రేపో త‌మిళ‌నాడులో రాష్ట్రప‌తి పాల‌న విధించినా ఆశ్చ‌ర్యపోవాల్సిన ప‌నిలేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?
Tags:    

Similar News