పన్నీర్ వెనుక జైట్లీ మంత్రాంగం

Update: 2017-02-13 04:37 GMT
తమిళనాడులో తాజాగా నెలకొన్న రాజకీయ సంక్షోభం ఎప్పుడెలా మారుతుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. పైకి కనిపించే దృశ్యాల వెనుక అసలు కథ మాత్రం వేరే ఉందని చెబుతున్నారు. ఎవరెప్పుడు ఎలా మారతారన్నది క్వశ్చన్ మార్క్ గా మారుతోంది. ఈ పరిణామం శశికళ వర్గీయులకు ఏ మాత్రం మింగుడపడటం లేదన్న వాదన వినిపిస్తోంది. దీనికి మంత్రి పాండ్యరాజన్ ఉదంతాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.

మొదట్నించి శశికళకు అండగా నిలిచిన మంత్రి పాండ్య రాజన్.. ఒక్కసారిగా ప్లేట్ తిప్పేయటం.. పన్నీరుపక్షాన చేరటమేకాదు.. చిన్నమ్మపై తీవ్ర ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. దీని వెనుక పెద్ద కథే నడిచిందన్నమాట బలంగా వినిపిస్తోంది. చిన్నమ్మ వర్గం నుంచి పన్నీర్ వర్గానికి షిఫ్ట్ కావటం వెనుక అసలు కారణం వేరే ఉందని చెబుతున్నారు.  అసలేం జరిగిందన్న విషయంలోకివెళ్లటానికి ముందు.. పాండ్యరాజన్ బ్యాక్ గ్రౌండ్.. ఆయన ఏ పరిస్థితుల్లో అమ్మ గూటికి చేరాన్న విషయాల్నితెలుసుకోవాల్సిందే.

పెద్ద పారిశ్రామికవేత్త అయిన పాండ్యరాజన్ తొలుత డీఎంకేలో ఉండేవారు. రెండేళ్ల క్రితం అమ్మ బలాన్ని గుర్తించిన ఆయన.. అన్నాడీఎంకేతీర్థం పుచ్చుకున్నారు. అమ్మకు అత్యంత విధేయుడైన ఆయనకు అసెంబ్లీ సీటు వచ్చే విషయంలో చిన్నమ్మ శశికళ సహకారం అందించిందని చెబుతారు. దీంతో.. అమ్మను అదరించినట్లే.. చిన్నమ్మను కూడా అంతే నమ్మకంగా ఆదరించే వారు.

దీంతో.. పాండ్యరాజన్ విషయంలో మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువగానే చిన్నమ్మ నమ్మినట్లుగా చెబుతారు. ఈ కారణంతోనే ఆయన్ను స్వేచ్ఛగా వ్యవహరించేందుకు ఓకే అన్నారు. దీనికి తగ్గట్లే చిన్నమ్మ నమ్మకాన్ని నిలబెడుతూ.. తిరుగుబాటు బావుటా విసిరిన పన్నీర్ పై ఆయన ఫైర్ అయ్యారు. తీవ్ర విమర్శలు కూడా చేశారు. అయితే.. ఇదంతా గతంగా మారిపోయింది.

ఢిల్లీ నుంచి ఒక ఫోన్ కాల్ మొత్తం పరిస్థితిని మార్చేయటమే కాదు.. చిన్నమ్మ పట్ల తన విధేయతను పాండ్య రాజన్ వదిలేసుకునేలా చేసిందని చెబుతున్నారు. కేంద్ర ఆర్థికమంత్రిజైట్లీ స్వయంగా రంగంలోకి దిగి.. పాండ్యరాజన్ తో మాట్లాడటం.. పన్నీర్ పక్షాన నిలవాలని నచ్చజెప్పటం చేశారని చెబుతున్నారు. జైట్లీ మాటలతో సమాధానపడిన ఆయన.. ప్లేట్ తిప్పేసి పన్నీర్ పక్షాన నిలిచి జై కొట్టి.. చిన్నమ్మ వర్గానికి ఊహించని షాకిచ్చారని తెలుస్తోంది. పాండ్యరాజన్ ను జైట్లీ ఏ విధంగా కన్వీన్స్ చేశారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News