ఇక బీజేపీ టార్గెట్ ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డ‌మేనా?

Update: 2022-07-23 10:30 GMT
ఆయా రాష్ట్రాల్లో త‌మ‌కు మ‌ద్ద‌తు లేక‌పోయినా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ.. విపక్షాల ఎమ్మెల్యేలను భయాందోళనలకు గురిచేస్తూ.. ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలను బీజేపీ కూల్చుతోంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇలా తమ పాచిక పారగానే.. రెబల్స్‌, స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల మద్దతుతో అధికారంలోకి రావడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని చెబుతున్నారు. ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టిన 2014 నుంచి మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మేఘాలయ, మణిపూర్‌, గోవా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, పుదుచ్చేరితో పాటు ఇటీవల మహారాష్ట్రలోనూ ఇదే విధానాన్ని ఆ పార్టీ అనుసరించింద‌ని గుర్తు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ ఛత్తీస్‌గఢ్ పై బీజేపీ దృష్టి సారించింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌, సీనియర్‌ మంత్రి సింగ్‌దేవ్‌ మధ్య వైరం బీజేపీకి ఒక అవకాశంగా మారొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. 2018లో నాలుగింట మూడొంతుల మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ క్షణమైనా ముక్కలయ్యే దశకు చేరుకుంద‌ని అంటున్నారు.

ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌, సీనియర్‌ మంత్రి సింగ్‌దేవ్‌ మధ్య వైరం అక్కడి ప్రభుత్వాన్ని సంక్షోభంలో ప‌డేస్తుంద‌ని పేర్కొంటున్నారు. ఇదే అదనుగా ప్రతిపక్ష బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు పావులు కదుపుతోంద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇందులో భాగంగానే జూలై 20న‌ బుధవారం ప్రారంభమైన ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో బఘేల్‌ ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసు ఇచ్చింద‌ని విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్‌ పార్టీని బఘేల్‌, సింగ్‌దేవ్‌ ముందుండి నడిపించారు. 90 సీట్లున్న అసెంబ్లీలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 71 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి పదవిలో బఘేల్‌, సింగ్‌దేవ్‌ చెరో రెండున్నరేండ్లు కొనసాగాలని ఒప్పందం కుదిరిందని సింగ్‌దేవ్‌ వర్గం చెప్తుండగా, అలాంటిదేమీ లేదని బఘేల్‌ వర్గం చెబుతోంది.

ఈ నేపథ్యంలోనే సింగ్‌దేవ్ జూలై 7న బఘేల్‌కు లేఖ రాస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను నిర్వహిస్తున్న నాలుగు మంత్రిత్వ శాఖల్లో గృహ‌నిర్మాణ శాఖ‌ను వదులుకొంటున్నానని ప్రకటించారు. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు ఇళ్లు క‌ట్టించి ఇస్తాన‌న్న హామీని తుంగ‌లో తొక్కుతోంద‌న‌వి.. అందుకే ఆ శాఖ బాధ్య‌త‌ల నుంచి వైదొలుగుతున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ వివాదం ఢిల్లీ వరకు వెళ్లినప్పటికీ కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎలాంటి పరిష్కారం చూపలేద‌ని అంటున్నారు.

అధికార కాంగ్రెస్‌లో లుకలుకలు ఎప్పుడు బయటపడుతాయో.. అని ఎదురుచూస్తున్న కమలదళానికి బఘేల్‌, సింగ్‌దేవ్‌ వైరం ఒక ఆయుధంగా దొరికింది. దీంతో అసెంబ్లీలో బఘేల్‌ ప్రభుత్వంపై బీజేపీ అవిశ్వాస నోటీసు ఇచ్చింది. సింగ్‌దేవ్‌ను తమవైపు తిప్పుకొని ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కమలదళం తెరవెనుక పావులు కదుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 'కాంగ్రెస్ కు మ‌హారాష్ట్ర‌లో పట్టిన గతే.. ఇక్కడా పడుతుంది' అని సింగ్‌దేవ్‌ రాజీనామా అనంతరం.. బీజేపీ నేత అమిత్‌ మాలవీయ ట్వీట్‌ చేయడం గమనార్హం.
Tags:    

Similar News