ఈట‌ల ఇంత‌లా పాతుకుపోయాడా?

Update: 2021-05-26 06:56 GMT
హూజూరాబాద్ తో ఈట‌ల బంధం ఈనాటిది కాదు. రెండు ద‌శాబ్దాల నాటిది. 2001లో తెలంగాణ రాష్ట్ర‌స‌మితి పురుడుపోసుకున్న నాడు కేసీఆర్ వెంట ఉన్న పిడికెడు మందిలో ఈట‌ల రాజేంద‌ర్ ఒక‌రు. అప్ప‌టి నుంచి టీఆర్ఎస్ లో, తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌చ్చారు. నాటి నుంచి హుజూరాబాద్ తో ఆయ‌న అనుబంధం పెరుగుతూ వ‌చ్చింది. అందుకే.. ప‌లుమార్లు ఆయ‌న‌ ఎమ్మెల్యేగా గెలిచారు.

అయితే.. ఈట‌ల గెలిచిన త‌ర్వాత త‌న‌దారి తాను చూసుకోలేదు. కేడ‌ర్ ను వెన్నంటి ఉన్నారు. వారి సాద‌క‌బాధ‌కాల్లో భాగ‌మ‌య్యారు. అందుకే.. భూముల క‌బ్జా ఆరోప‌ణ‌లు చేసినా, మంత్రివ‌ర్గం నుంచి ఆయ‌న్ను తొల‌గించినా.. ఏకంగా నియోజ‌క‌వ‌ర్గంలోని 90 శాతం మంది ప్ర‌జాప్ర‌తినిధులు ఆయ‌న వెంట నిల‌బ‌డ్డారు. ఈ ప‌రిస్థితిని మార్చేందుకు టీఆర్ఎస్ అధిష్టానం.. మంత్రి గంగుల‌ను రంగంలోకి దించింది. ఈట‌ల‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేసిన ద‌గ్గ‌ర్నుంచి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంపై ఫోక‌స్ పెట్టిన మంత్రి గంగుల.. ఈట‌ల బ‌లం త‌గ్గించ‌డానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి.

ఈ క్ర‌మంలో ప‌లువురి ఈట‌ల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన వారిని పిలిచి, బుజ్జ‌గిస్తూ వ‌చ్చారు గంగుల‌. దీంతో.. కొంద‌రు తాము టీఆర్ఎస్ వెంటే ఉంటామ‌ని ప్ర‌క‌ట‌న కూడా చేశారు. అయితే.. కొంత మందిని ప్ర‌లోభ‌పెడుతూ.. విన‌నివారిపై బెదిరింపుల‌కు సైతం దిగుతున్నార‌ని ఈట‌ల ఆరోపిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప‌నుల‌కు బిల్లులు ఆపేస్తామ‌ని బెదిరిస్తున్నార‌ని ఆయ‌న‌ అన్నారు.

అయితే.. కాలం గ‌డిచేకొద్దీ ఆవేశం చ‌ల్లారుతుంద‌ని, వాళ్ల‌ను గులాబీ గూటికి తేవ‌డం స‌మ‌స్య కాద‌ని అధిష్టానం భావిస్తూ వ‌చ్చింది. మ‌రోవైపు మంత్రి గంగుల ఆప‌రేష‌న్ కొన‌సాగుతూనే ఉంది. ఇంత జ‌రుగుతున్నా.. కొంద‌రు ఇప్ప‌టికీ ఈట‌ల వెంటే ఉంటామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. హుజూరాబాద్ లోని హ‌నుమాన్ దేవ‌స్థాన క‌మిటీ చైర్మ‌న్ ఆకుల స‌దానందం, టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు ర‌మేష్ గౌడ్‌, ఎంప‌టి సుధీర్ త‌దిత‌రులు మీడియాతో మాట్లాడుతూ.. తాము ఈట‌ల వెంటేన‌ని చెప్ప‌డం విశేషం.

దీన్నిబ‌ట్టి చూస్తే.. ఈట‌ల ఎంత‌గా పాతుకుపోయారో అనే విష‌యం అర్థ‌మ‌వుతోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఈట‌ల వ‌ద్ద ఎమ్మెల్యేప‌ద‌వి త‌ప్ప మ‌రే అధికార‌మూ లేదు. రేపేమోపో దానికి రాజీనామా చేయాల్సిన ప‌రిస్థితి. అయిన‌ప్ప‌టికీ.. ప‌లువురు ఆయ‌న వెంట నిల‌వ‌డం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంద‌ని అంటున్నారు. దీంతో.. ఈట‌ల బ‌లాన్నీ టీఆర్ఎస్ పూర్తిగా ధ్వంసం చేయ‌లేక‌పోతోంద‌నే విష‌యం మాత్రం స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags:    

Similar News