భార్య ఇష్టం లేకున్నా భర్తతో కాపురం చేయాల్సిందేనా .. సెక్షన్ 9 లో ఏముంది ?

Update: 2021-07-09 11:30 GMT
పెళ్లి హక్కుల పునరుద్ధరణకి సంబంధించి , హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 9కు రాజ్యాంగబద్ధత ఉందా లేదా అని తేల్చాలని, ఆ సెక్షన్‌ ను కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను విచారించడం ముఖ్యమైన అంశంగా సుప్రీం గురువారం తెలిపింది.  దీనిపై కేంద్రం రెండు వా రాల్లోగా పూర్తిస్థాయిలో కౌంటర్‌ అఫిడవిట్‌ ను దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 9, ప్రత్యేక వివాహాల చట్టంలోని సెక్షన్‌ 22, కోడ్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రొసీజర్‌ ఆర్డర్‌ 21లోని 32, 33 నిబంధనలను సవాల్‌ చేస్తూ గుజరాత్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ విద్యార్థులైన ఓజస్వ పాఠక్‌, మయాంక్‌ గుప్తా సుప్రీంని ఆశ్రయించారు.  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 కు విరుద్ధంగా ఉన్నాయని వారు పిటిషన్‌ లో పొందుపరిచారు. ముఖ్యంగా మహిళలకు ఇష్టం లేకున్నా వారు తమ భర్తతో కాపురం చేయాలంటూ బలవంతం చేసేలా ఉన్నాయని తెలిపారు. 2019లో దీనిపై సుప్రీంకోర్టు కేంద్రం స్పందన తెలియజేయాలని కోరింది.

తాజాగా గురువారం ఈ పిటిషన్‌ ను విచారించిన జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ లతో కూడిన బెంచ్, దీనిపై దాఖలైన అన్ని ఇంటర్వెన్షన్‌ పిటిషన్లనూ కలిపి విచారిస్తామని, తర్వాత  విచారణను జూలై 22కు వాయిదా వేసింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 9 అంటే ఏమిటంటే ..  రెస్టిట్యూషన్‌ ఆఫ్‌ కాంజుగల్‌ రైట్స్‌కు సంబంధించింది. అంటే దాంపత్యహక్కుల పునరుద్ధరణ. ఒక ఉదాహరణను చూస్తే .. పెళ్లి జరిగిన కొన్ని రోజులు భార్య భర్త పై ఉండే కోపం తో అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి ఎన్ని రోజులు గడిచినా కూడా ఆమె తిరిగి మళ్లీ మెట్టినింటికి రాకపోతే ఆమె భర్త సెక్షన్ 9 కింద ఆమె పై కోర్టులో పిటిషన్ వేసి నా భార్య ను నా ఇంటికి పొమ్మని చెప్పండి అని కోరవచ్చు. అప్పుడు కోర్టు భార్యను విచారణకి పిలుస్తుంది. తాను కాపురాన్ని వదిలేసి ఎందుకు వెళ్లిపోయాననేందుకు సరైన కారణాలను భార్య కోర్టుకు వివరించాల్సి ఉంటుంది. సరైన కారణాన్ని తెలియజేస్తే కోర్టు భర్త పిటిషన్‌ ను కొట్టేస్తుంది. ఒకవేళ సరైన కారణాలు చెప్పలేకపోతే ..  వెళ్లి మీ భర్తతో సంసారం చేయండి అని భార్యను ఆదేశిస్తుంది. కోర్టు ఆదేశాల మేరకు భార్య తన భర్త వద్దకు వెళ్లాల్సి వస్తుంది. వెళ్లనని తిరస్కరిస్తే అది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది. కోర్టు తీర్పు ఇచ్చాక కూడా ఆమె రాకపోతే భర్త ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ పిటిషన్‌ వేసి  తనతో సం సారం చేయాల్సిందిగా  భార్యను ఆహ్వానించవచ్చు. ఏడాది దాటిపోయక కూడా భార్య రాకపోతే, ఆ భర్త తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోర్టును కోరితే వెంటనే విడాకులు లభించే అవకాశం ఉంది.

సెక్షన్‌ 9 ప్రకారం భార్య కూడా భర్త మీద ఇదే తరహాలో పిటిషన్‌ వేయొచ్చు. అయితే , ఈ సెక్షన్ పైకి ఇద్దరికి సమానంగానే ఉన్నప్పటికీ,   ఎక్కువ సందర్భాల్లో మహిళలే దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు అన్నది పిటిషనర్ల వాదన. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 9 రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14కు, 21కు విరుద్ధంగా ఉందంటూ తోలిసారి 1983లోఏపీ హైకోర్టులో ప్రముఖ సినీ నటి సరిత సవాల్‌ చేశారు. అప్పుడు ఏపీ హైకోర్టు సరిత వాదనతో ఏకీభవించింది.  అయితే, ఆ తర్వాత 1984లో ఢిల్లీహైకోర్టు హర్వీందర్‌ కౌర్‌ వర్సెస్‌ హర్మేందర్‌ సింగ్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసం కాదని, ఈ సెక్షన్‌ రాజ్యాంగ విరుద్ధంగా లేదని తీర్పునిచ్చింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు కూడా ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించింది.
Tags:    

Similar News