ప‌వ‌న్ బాట‌లో జ‌గ‌న్ కూడా బ‌స్సు యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారా?

Update: 2022-07-09 10:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 2024లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డమే ల‌క్ష్యంగా అన్ని పార్టీలు త‌మ వ్యూహ‌, ప్ర‌తి వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నాయి. ఇప్ప‌టికే అధికార వైఎస్సార్సీపీ.. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం పేరుతో ప్ర‌తి ఇంటికీ పోతోంది. ఇక టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మినీ మ‌హానాడులు, బాదుడే బాదుడు కార్య‌క్ర‌మాల‌తో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇక జ‌న‌సేనాని పవ‌న్ క‌ల్యాణ్ జ‌నసేన కౌలు రైతు భ‌రోసా యాత్ర‌, జ‌న‌వాణి కార్య‌క్ర‌మాల‌తో స్పీడు పెంచేశారు.

ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ప్లీన‌రీ నిర్వ‌హిస్తున్న వైఎస్సార్సీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కూడా బ‌స్సు యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ఏడాది న‌వంబ‌ర్ నుంచి బ‌స్సు యాత్ర ద్వారా రాష్ట్రాన్ని చుట్టేస్తార‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌స‌రా న‌వ‌రాత్రుల నుంచి అంటే అక్టోబ‌ర్ 5 నుంచి బ‌స్సు యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ప‌వ‌న్ బాట‌లోనే జ‌గ‌న్ కూడా బ‌స్సు యాత్ర‌కు శ్రీకారం చుడ‌తార‌ని తెలుస్తోంది.

జ‌న‌సేన పార్టీ, టీడీపీ రోజురోజుకూ బ‌లం పుంజుకుంటుండ‌టం, ప‌థ‌కాల వ‌ల్ల ల‌బ్ధి కొంద‌రికి చేరుతున్నా ఇంకా అందుకోనివారు కూడా అంతేస్థాయిలో ఉండ‌టం త‌దిత‌ర కార‌ణాలతో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే వీలైనంత త్వ‌ర‌గా తానే స్వ‌యంగా జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌ని అంటున్నారు. వాస్తవానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల‌కు సామాజిక న్యాయం చేశామంటూ ఆ వ‌ర్గాల మంత్రుల‌తో రాష్ట్ర‌వ్యాప్తంగా సామాజిక న్యాయ‌భేరీలు నిర్వహించినా అవి అంత‌గా సక్సెస్ కాలేద‌ని అంటున్నారు.

ప్ర‌జా సంక‌ల్ప పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. ఆ తరువాత మళ్లీ పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు చేపట్టలేదు. పరిపాలనపై దృష్టి పెట్టడంతో పాటు కరోనా విజృంభణ కూడా ఇందుకు కారణమే వాదన ఉంది. అయితే మళ్లీ సాధ్యమైనంత తొందరగా ప్రజల్లోకి వెళ్లాలనే తనకంటే ముందు పార్టీ నేతలందరూ గడప గడపకు మ‌న ప్ర‌భుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోని నేత‌ల‌కు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వ‌బోన‌ని హెచ్చ‌రించారు.

నవంబర్ నుంచి తాను చేపట్ట‌బోయే బ‌స్సు యాత్రలో తాను అధికారంలోకి వచ్చాక‌ ప్రజల కోసం ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలు, వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల గురించి సీఎం జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తార‌ని అంటున్నారు. ఇప్పటికే ప్ర‌తిప‌క్ష పార్టీలు జోరుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తుండ‌టంతో జ‌గ‌న్ కూడా వీలైనంత తొంద‌ర‌గా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌నే బ‌స్సు యాత్ర‌కు నిర్ణ‌యించార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.
Tags:    

Similar News