ఇక ఆ మ‌హిళా సీఎం మ‌ర‌ణంలో ఎలాంటి మిస్ట‌రీ లేదని తేలిన‌ట్టేనా?

Update: 2022-08-23 00:30 GMT
త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, అన్నాడీఎంకే అధినేత్రిగా ఉంటూ అనారోగ్యంతో జ‌య‌ల‌లిత మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. చెన్నైలోని అపోలో ఆస్ప‌త్రిలో చాలా రోజుల‌పాటు చికిత్స పొందిన జ‌య‌ల‌లిత ఆరోగ్యం మెరుగుప‌డ‌క క‌న్నుమూశారు. అయితే జ‌య‌ల‌లిత‌ది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని పలువురు అనుమానాలు వ్య‌క్తం చేశారు. అలాగే జ‌య‌ల‌లిత విశ్వాస‌పాత్రుడు, న‌మ్మిన బంటు అయిన మాజీ సీఎం ప‌న్నీరు సెల్వం కూడా జ‌య‌ల‌లిత మృతిపై విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు.

దీంతో అప్ప‌ట్లో త‌మిళ‌నాడు సీఎంగా ఉన్న ప‌ళ‌నిస్వామి విశ్రాంత న్యాయ‌మూర్తి ఆర్ముగ‌స్వామి నేతృత్వంలో క‌మిష‌న్ ఏర్పాటు చేశారు. జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై పలువురిని విచారించిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) వైద్య‌ బృందం జ‌య‌లలిత‌ది స‌హ‌జ మ‌ర‌ణ‌మేన‌ని తేల్చింది.

జ‌య‌ల‌లిత‌కు చికిత్స అందించిన అపోలో ఆస్ప‌త్రి చికిత్స‌లో ఎలాంటి లోపాలు జ‌ర‌గ‌లేద‌ని వెల్ల‌డించింది. ఈ మేరకు ఆర్ముగ స్వామి కమిషన్‌కు ఆగ‌స్టు 21న త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి నివేదిక సమర్పించింది.

జయలలిత 2016లో అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. జయలలిత మరణంపై పలువురిని విచారించిన ఎయిమ్స్‌ వైద్యుల బృందం.. ఆర్ముగ స్వామి కమిషన్‌కు మూడు పేజీల నివేదిక సమర్పించింద‌ని స‌మాచారం. అపోలో ఆస్పత్రిలో చేరకముందే జయలలితకు థైరాయిడ్‌, బీపీ, షుగర్‌ మొదలైన పలు అనారోగ్య సమస్యలున్నాయని పేర్కొంది.

ఆస్పత్రిలో చికిత్స స‌మ‌యంలో కూడా జ‌య‌ల‌లిత‌ ద్రాక్ష, కేక్‌, స్వీట్లు తినడంతో సెప్టెంబరు 28న ఆరోగ్యం క్షీణించింద‌ని ఎయిమ్స్ వైద్య బృందం విచార‌ణ‌లో తేలింది. దీంతో జ‌య‌ల‌లిత‌కు ఊపిరితిత్తుల సమస్య తలెత్తినట్లు నివేదికలో స్పష్టం చేసింది. దీంతో 2016న అక్టోబరు 7న ట్రాకియోస్టమీ చికిత్స ప్రారంభించారని పేర్కొంది. అక్టోబరు 14 నుంచి జ‌య‌ల‌లిత‌కు లండన్ నుంచి వచ్చిన‌ వైద్యుడు రిచర్డ్‌ బిలే, అపోలో ప్రత్యేక వైద్యులు, ఎయిమ్స్‌ వైద్యులు చికిత్స‌ అందించారని తెలిపింది.

అయితే డిసెంబరు 3వ తేదీన జ‌య‌ల‌లిత‌ ఆరోగ్యం మరింత క్షీణించింద‌ని వివ‌రించింది. డిసెంబ‌ర్ 4వ తేదీ శ్వాస తీసుకోవడానికి జ‌య‌ల‌లిత‌ ఇబ్బంది పడ్డారని పేర్కొంది. దీంతో ఎక్మో ప‌రికరం స‌హాయంతో శ్వాస అందించి 24 గంటలు వైద్యులు పర్యవేక్షించారని స్పష్టం చేసింది. అయితే డిసెంబర్‌ 5న మెదడు, గుండె పనిచేయలేదని వైద్యులు నిర్ధారించినట్లు నివేదికలో పేర్కొంది. ఆమెకు అందించిన చికిత్సలో ఎలాంటి లోపాలు లేవని నివేదికలో పేర్కొంది.
Tags:    

Similar News