క‌మ‌ల్ వెనుదిరుగుతున్నారా?

Update: 2021-05-09 16:30 GMT
వెండితెర‌పై క‌మ‌ల్ హాస‌న్ తిరుగులేని నాయ‌కుడు. అనిత‌ర‌సాధ్య‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచే లోక‌నాయ‌కుడు. అయితే.. రాజ‌కీయాల్లో మాత్రం కాద‌ని తేలిపోయింది. మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీ స్థాపించిన ఆయ‌న 2019 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌ను నిలిపిన‌ప్ప‌టికీ.. ఒక్క‌రూ గెల‌వ‌లేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 150 సీట్ల‌లో పోటీచేసినా.. ఒక్క చోట‌కూడా గెలవ‌లేదు. చివ‌ర‌కు తాను కూడా ఓట‌మిపాల‌య్యారు. దీంతో.. క‌మ‌ల్ రాజ‌కీయ భ‌విత‌వ్యంపై ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

జ‌య‌ల‌లిత ఉన్నంత వ‌ర‌కూ క‌మ‌ల్ రాజ‌కీయాల‌పై ఆస‌క్తిలేన‌ట్టుగానే ఉన్నారు. అదే చెప్పారు కూడా. కానీ.. ఆమె మ‌ర‌ణం, ఆ త‌ర్వాత క‌రుణానిథి అవ‌సాన ద‌శ‌కు చేరుకోవ‌డంతో ఈ సంధికాలాన్ని భ‌ర్తీచేయాల‌ని ఆశించారు. పార్టీ పెట్టారు.. జ‌నాల్లో తిరిగారు. కానీ.. ఫ‌లితం మాత్రం అనుకున్నంత కాదుగ‌దా.. సున్నా వ‌చ్చింది. దీంతో.. ఎన్నిక‌ల వ‌ర్షానికి క‌మ‌ల్ చెరువులోకి వ‌చ్చిన క‌ప్ప‌ల‌న్నీ.. బ‌య‌ట‌కు వెళ్లిపోతున్నాయి.

ఇప్ప‌టికే అర‌డ‌జ‌ను మంది నేత‌ల వ‌ర‌కూ వెళ్లిపోయారు. పార్టీలో కీల‌క నేత‌లుగా ఉన్న ఏజీ మౌర్య‌, మురుగ‌నంద‌న్, సీకే.కుమరావెల్‌, ఉమాదేవీ వెళ్లిపోయిన‌ట్టు మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీ అధికారికంగా వెల్ల‌డించింది. తాజాగా.. ఎంఎన్ఎం ఉపాధ్య‌క్షుడు మ‌హేంద్ర‌న్ కూడా త‌ట్టాబుట్టా స‌ర్దేసుకున్నారు. అయితే.. ఆయ‌న పోతూ పోతూ క‌మ‌ల్ పై నాలుగు రాళ్లు విసిరేసి పోవ‌డం గ‌మ‌నార్హం. ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన మ‌హేంద్ర‌న్ ఓ క‌లుపు మొక్క‌గా అభివ‌ర్ణించిన క‌మ‌ల్‌.. ఆయ‌న వెళ్ల‌కపోతే తామే వెళ్ల‌గొట్టేవాళ్ల‌మ‌ని మండిప‌డ్డార‌ట‌.

అయితే.. ఈ విమ‌ర్శ‌ల సంగ‌తి ఎలా ఉన్నా.. ఒక్క సీటూ గెల‌వ‌క‌పోవ‌డం అనేది శ్రేణుల‌కు తీవ్ర నిరాశ క‌లిగించే అంశ‌మే. ఇలాంటి ప‌రిస్థితుల్లో వ‌చ్చే ఐదేళ్ల వ‌ర‌కు పార్టీని కాపాడుకొని, పోరాటాలు నిర్వ‌హించి, ఎన్నిక‌ల్లో పాల్గొన‌డం అనేది సాధార‌ణ విష‌యం కాదు. పైగా.. డీఎంకే అధినేత స్టాలిన్ కు క‌మ‌ల్ స‌న్నిహితంగా ఉంటార‌నే అభిప్రాయం ఉంది. అంతేకాదు.. ఈ ఎన్నిక‌ల్లో ప‌లు చోట్ల గెలుపున‌కు స‌హ‌క‌రించారని కూడా అంటున్నారు. మ‌రి, ఇప్పుడు క‌మ‌ల్ స్టాలిన్ పార్టీపై పోరాటం సాగిస్తారా? అన్న‌ది సందేహం.

ఒక‌వేళ కొన‌సాగించినా.. ఆయ‌న వెంట ఎంత‌మంది నాయ‌కులు నిలుస్తార‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కం. అస‌లే రాజ‌కీయాలు బాగా కాస్ట్ లీ అయిపోయిన నేప‌థ్యంలో.. పార్టీని ఐదేళ్ల‌పాటు నిల‌బెట్ట‌గ‌ల‌రా అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. ఇన్ని స‌వాళ్ల‌ను ఎదుర్కొంటారా? మ‌ధ్య‌లో జెండా పీకేస్తారా? అనే చ‌ర్చ కూడా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి, క‌మ‌ల్ ఏం చేయ‌బోతున్నారు? అన్న‌ది తెలియాలంటే.. మ‌రికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.





Tags:    

Similar News