దుబ్బాకలో ఆ ఐఎఎస్ ను కేసీఆర్ దించబోతున్నాడా?

Update: 2020-10-04 09:10 GMT
నవంబర్‌లో జరిగే దుబ్బాక అసెంబ్లీ  ఉప ఎన్నికకు పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి. టీఆర్ఎస్ ఇప్పటికే రంగంలోకి దిగగా.. కాంగ్రెస్.. బిజెపి లు తమ అదృష్టాన్ని పరీక్షించబోతున్నాయి. దీంతో దుబ్బాకలో  ఆసక్తికరమైన యుద్ధానికి తెరలేచింది.

నిజానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం మొదట మరణించిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతను నిలబెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆగస్టు 6న ఆయన మరణం తర్వాత ఈ మేరకు నిర్ణయించింది. ఉప ఎన్నికల్లో సోలిపేట మరణంతో వచ్చిన సానుభూతిని క్యాష్ చేసుకోవాలని టిఆర్ఎస్ ఆశించింది. కానీ ఇప్పుడు అది  సురక్షితమైన ఆట కాదని భావిస్తున్నట్టు తెలిసింది. అంతేకాకుండా, దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలో ఉంది. ఈ జిల్లాలో  విపరీతమైన ఫాలోయింగ్  ఉన్న స్థానిక మంత్రి టి హరీష్ రావు ఓటర్లకు ప్రయోజనాలను చేకూర్చే పనిలో ఇప్పుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఆకర్షిస్తున్నారు.

 ఈ నేపథ్యంలోనే ఇటీవల టీఆర్ఎస్ దుబ్బాక నియోజకవర్గంలో సర్వే నిర్వహించినట్టు తెలిసింది. ఆ సర్వేలో టీఆర్ఎస్ కు పెద్దగా పాజిటివ్ వేవ్స్ లేవని తేల్చినట్టు ప్రచారం సాగుతోంది.  మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై ప్రజలలో  టిఆర్ఎస్ పట్ల కోపం ఉందని.. అది ప్రతికూలమయ్యే చాన్స్ ఉందని తేలిందట.. పైగా సోలిపేట కుటుంబానికి కూడా ఓటర్లలో పెద్దగా సానుభూతి లేదని సర్వేలో వెల్లడైనట్టు ప్రచారం సాగుతోంది.

సోలిపేట భార్య లేదా కొడుకు అభ్యర్థిత్వంపై టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. దీనికి కారణం సోలిపేట, ఆయన జీవించి ఉన్నప్పుడు, గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీలో వారి కుటుంబాన్ని, బంధువులను ప్రోత్సహించారనే విమర్శలున్నాయి. దీంతో టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోలిపేట  పార్టీ టికెట్ ఆయన భార్యకు ఇవ్వడంపై పునరాలోచన చేస్తున్నట్టు తెలిసింది.

మాజీ మంత్రి, దివంగత  నేత ముత్యం రెడ్డి కుమారుడి పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది, అయితే పార్టీ కార్యకర్తలు ఆయనను వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు, తాజాగా టీఆర్ఎస్ తరుఫున దుబ్బాక బరిలో మరో పేరు తెరపైకి వస్తోంది. దుబ్బాకతోపాటు  జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్న  ఐఎఎస్ అధికారి, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కేసిఆర్ దుబ్బాక అసెంబ్లీకి పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. కలెక్టర్ కూడా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారని, గతంలో హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్ టికెట్ కోసం కూడా ప్రయత్నించారని చెబుతున్నారు.

గతంలో చాలాసార్లు, కేసిఆర్ స్వయంగా ఈ ఐఏఎస్ అధికారిని టిఆర్ఎస్ లో చేరమని ఆహ్వానించారు. వెంకట్రామిరెడ్డిని నిజమైన ప్రజల ప్రతినిధిగా కెసిఆర్ పిలిచిన సందర్భాలు ఉన్నాయి.ఆయన ఎప్పుడూ ప్రజలతో కలిసిపోయి ఉత్తమ సేవలందించారు. కాబట్టి వెంకటరామిరెడ్డి ఎన్నికల యుద్ధంలోకి ప్రవేశిస్తే, అది దుబ్బాకలో ఆసక్తికరమైన యుద్ధంగా ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.
Tags:    

Similar News