కిర‌ణ్ కుమార్ రెడ్డి వారసుడు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా?

Update: 2022-06-26 16:30 GMT
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ చివ‌రి ముఖ్య‌మంత్రిగా చ‌రిత్ర‌లో నిలిచిపోయారు.. న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 2009లో దుర్మ‌ణం చెందాక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రోశయ్య‌ను ముఖ్య‌మంత్రిని చేసినా ఆయ‌న ఏడాది కూడా ప‌ద‌విలో ఉండ‌లేక‌పోయారు. ఈ ప‌రిస్థితుల్లో అనూహ్యంగా కిర‌ణ్ కుమార్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యారు. అప్ప‌టిదాకా ఆయ‌న ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఒక్క‌సారి కూడా మంత్రి కాలేక‌పోయారు. అయితే స్పీక‌ర్ కాగ‌లిగారు. స్పీక‌ర్ గా ఉన్న ఆయ‌న‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్య‌మంత్రిని చేసింది. దాదాపు మూడేళ్ల‌కుపైగా కిర‌ణ్ కుమార్ రెడ్డి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చివ‌రి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు.

ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభ‌జ‌న‌కు పూనుకోవ‌డంతో కిర‌ణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీ నుంచి బ‌య‌టికొచ్చేశారు. జై స‌మైక్యాంధ్ర పేరుతో పార్టీని ఏర్పాటు చేసి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఒక్క సీటు కూడా రాలేదు. త‌న సొంత త‌మ్ముడు న‌ల్లారి కిశోర్ కుమార్ రెడ్డిని కూడా పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో గెలిపించుకోలేక‌పోయారు. ఇక అప్ప‌టి నుంచి దాదాపు 8 ఏళ్లుగా ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ రాజ‌స్థాన్ లో నిర్వ‌హించిన చింత‌న్ బైఠ‌క్ లో పార్టీని బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో కిర‌ణ్ కుమార్ రెడ్డికి కూడా ఇటీవ‌ల కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వ‌చ్చింది. దీంతో కిర‌ణ్ న్యూఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌ను క‌లిశారు. ఆయ‌న ఏపీ పీసీసీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌ని వార్తలు కూడా వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో కిర‌ణ్ కుమార్ రెడ్డి రాజ‌కీయంగా క్రియాశీల‌క‌మ‌య్యారు. త‌ర‌చూ త‌న నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లాలోని పీలేరులో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. తాజాగా త‌న సొంత‌మండ‌లం క‌లికిరిలోనూ ప‌ర్య‌టించారు. ఒక‌ప్ప‌టి త‌న అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌ను పేరుపేరునా ప‌ల‌క‌రించారు.

కిర‌ణ్ కుమార్ రెడ్డితోపాటు ఆయ‌న కుమారుడు నిఖిలేష్ కుమార్ రెడ్డి కూడా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా కిర‌ణ్ ఆయ‌న కుమారుడిని నేత‌లంద‌రికీ ప‌రిచ‌యం చేశారు. చ‌దువు పూర్తి చేసుకున్న నిఖిలేష్ రెడ్డి రాజ‌కీయ అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నార‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే కిర‌ణ్ కుమార్ రెడ్డి సోద‌రుడు న‌ల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రాజ‌కీయాల్లో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీ అభ్య‌ర్థిగా పీలేరు నుంచి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు.

ఈ నేప‌థ్యంలో మ‌రోసారి కిర‌ణ్ కుమార్ రెడ్డి రాజ‌కీయంగా క్రియాశీలం కావ‌డం, మ‌రోవైపు ఆయ‌న కుమారుడు నిఖిలేష్ రెడ్డి కూడా రాజ‌కీయ అరంగేట్రానికి సిద్ధంగా ఉండ‌టంతో కిర‌ణ్ అనుచ‌రుల్లో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News