పవన్ హెల్ప్ చేసేది జగన్ కేనా... ?

Update: 2021-11-02 14:30 GMT
ఇది వినడానికే వింతగా ఉంది. కానీ అచ్చమైన రాజకీయం. ఇక్కడ ఏమైనా జరగవచ్చు. ఒక్క మాట చాలు టోటల్ ఈక్వేషన్స్ మార్చేస్తుంది. అందుకే ఎవరైనా ఆచీ తూచీ మాట్లాడుతూంటారు. రాజకీయాల్లో మాటకు ఉన్న పవర్ అలాంటిది. మరి ఈ సంగతి పవర్ స్టార్ గా పేరు గడించిన పవన్ కళ్యాణ్ కి తెలియదు అనుకోగలమా. అయితే ఆయనలో ఆవేశం పాలు ఎక్కువ. అదే సమయంలో ఆయనకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ జనసేనను ఏపీలో నంబర్ వన్ గా నిలపాలనుకుంటున్నారు. ఎవరికైనా అలాగే ఉంటుంది. తాము సొంతంగా ఎదగాలని కూడా ఉంటుంది. పవన్ ఇపుడు అలాంటి ఆలోచనలతోనే ఏపీలో ఇద్దరు బద్ధ శత్రువులను ఒకే గాటికి కడుతున్నారు.

పవన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా కార్మికులకు మద్దతు ఇస్తూ నిర్వహించిన సభలో చేసిన కొన్ని కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో కలకలాన్నే రేపుతున్నాయి. పవన్ మా వాడు, ఇవాళ కాకపోయినా రేపటి రోజున అయినా ఆయన మాతోనే జట్టు కడతారు అని తమ్ముళ్లు ఆఫ్ ది రికార్డుగా ఎపుడూ ధీమాగా ఉంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఆ సభలో మాట్లాడుతూ వైసీపీ టీడీఎపీల మధ్య మాచ్ ఫిక్సింగ్ జరుగుతోంది అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. దీని మీదనే సీనియర్ తమ్ముళ్ళు కూడా మండిపడుతున్నారు.

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అయితే పవన్ ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల అంతిమంగా వైసీపీకే మేలు జరుగుతుందని అన్నారు. తాము ఏపీలో వైసీపీ పాలన పోవాలని గట్టిగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఈ టైమ్ లో తాము వారితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇక వైసీపీకి టీడీపీకి మధ్య బద్ధ శత్రుత్వమే ఉంది తమ్మ స్నేహం ఎక్కడిది అని కూడా నిలదీశారు. పవన్ కళ్యాణ్ అలా మాట్లాడి ఉంటే మాత్రం కచ్చితంగా అది వైసీపీకే హెల్ప్ చేస్తుందని కూడా అభిప్రాయపడ్డారు. ఏపీలో వైసీపీ పాలనను లేకుండా చేసేందుకు జనసేన వంటి పార్టీలు కూడా తమతో కలసి రావాల్సి ఉందని ఆయన అన్నారు.

ఈ విషయంలో దిగువ స్థాయి క్యాడర్ కూడా అదే ఆలోచన చేస్తోందని, పవన్ మాత్రం వేరేగా మాట్లాడడం మంచి విధానం కాదని కూడా అయ్యన్న అన్నారు. మొత్తానికి చూస్తే పవన్ కళ్యాణ్ అన్న ఈ మ్యాచ్ ఫిక్సింగ్ మాటలు మాత్రం జనసేన‌తో టీడీపీకి ఎడం పెంచేలాగానే ఉన్నాయనుకోవాలి. అయితే పవన్ వ్యూహాత్మకంగానే ఆ రెండు పార్టీల మీద ఈ బాణం వేశారు అంటున్నారు. ఈ రెండు పార్టీలు లేకుండా మూడవ పార్టీగా జనసేనకు ఏపీ జనాలు అవకాశం ఇవ్వాలన్నదే పవన్ ఆలోచన అని కూడా అంటున్నారు. మొత్తానికి పవన్ పోకడలు మాత్రం తమ్ముళ్లను బాగానే ఇరుకున పెడుతున్నాయనుకోవాలి.


Tags:    

Similar News