రాజీ దిశగా రవిప్రకాష్ అడుగులు.?

Update: 2019-05-16 05:34 GMT
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కాళ్ల బేరానాకి వస్తున్నాడా.? అష్టదిగ్భంధనం చేసి ఫోర్జరీ, డేటా కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అలంద మీడియాతో రాజీకి ప్రయత్నిస్తున్నారా.? అజ్ఞాతంలో ఉండి మధ్యవర్తులను అలంద మీడియా డైరెక్టర్ల వద్దకు పంపాడా? అంటే వీటన్నింటికి ఔననే సమాధానం వస్తోంది. అలంద మీడియా వెనుక తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఉన్నారని.. వాళ్లే తనను కక్ష గట్టి వేధిస్తున్నారని రవిప్రకాష్ ఇటీవల ఓ మీడియాతో వ్యాఖ్యానించారు. అన్ని దారులు మూసుకుపోయి ఇరుక్కుపోవడంతో ఇప్పుడు  రవిప్రకాష్ బలమైన అలంద మీడియాను ఎదుర్కోలేక  రాజీకి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఆరో రోజు కూడా తెలంగాణ పోలీసుల నోటీసులకు స్పందించలేదు. 41 సీఆర్పీపీసీ నోటీసు గడువు బుధవారమే ముగిసింది. నిన్న హైకోర్టుకు వెళ్లినా రవిప్రకాష్ కు చుక్కెదురు అయ్యింది. దీంతో ఆయన పోలీసుల వద్దకు వచ్చి స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాడా.? లేదా పోలీసులే ఆయనను పట్టుకొని అరెస్ట్ చేస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే రవిప్రకాష్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు మేరకు ఈనెల 9న సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు.  ఆయనపై ఫోర్జరీ , డేటా చోరీ కేసులు నమోదు చేశారు. దాడులు జరిగిన నాటి నుంచి ఆయన కనిపించకుండా పోయారు. అయితే పోలీసులు తమ ముందు హాజరు కావాలని ఇప్పటికే 161 సీఆర్పీఎస్ కింద నోటీసులు జారీ చేశారు.

నోటీసులకు స్పందించకుండా అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాష్ రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అలంద మీడియా డైరెక్టర్లతో మధ్యవర్తుల ద్వారా మాట్లాడి వారు పెట్టిన కేసులు వెనక్కి తీసుకునేలా ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
    

Tags:    

Similar News