తెలంగాణ సీఎం అభ్యర్థి కిషన్ రెడ్డియేనా?

Update: 2021-07-08 12:30 GMT
తెలంగాణలో బలపడేందుకు బీజేపీకి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ పై అంతో ఇంతో వ్యతిరేకత సహజం. ఆ వ్యతిరేకత ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బయటపడింది. ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా యువత అంతా బీజేపీ వైపు నిలబడింది. క్షేత్రస్థాయి నుంచి బీజేపీ బలోపేతం అయితే వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే చాన్స్ ఉంది.

ఇక ఇటీవల టీఆర్ఎస్ నుంచి బలమైన ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం కూడా ఆ పార్టీ బలాన్ని పెంచింది. కేసీఆర్ పాలన చివరి దశలో అసంతృప్తిగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు , నేతలు ఎంతో మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  దీంతో పాటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడైన సారథ్యం కూడా ఆ పార్టీకి ప్లస్ గా మారింది. ఇదే జోరు కొనసాగితే 2023 ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి అధికారం సాధ్యమేనన్న ఆశలున్నాయి.

అయితే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎవరు సీఎం ? అన్న ప్రశ్న తలెత్తినప్పుడు బీజేపీకి ఇద్దరే ఆప్షన్లు ఉన్నారు. ఒకరు బండి సంజయ్ కాగా..రెండో వ్యక్తి కిషన్ రెడ్డి. ఇటీవలే కేంద్రహోంశాఖసహాయ మంత్రి పదవి నుంచి ప్రమోషన్ పొంది పర్యాటక, ఈశాన్య అభివృద్ధి మండలి శాఖకు షిఫ్ట్ అయిన కిషన్ రెడ్డి వైపే బీజేపీ అధిష్టానం చూసే అవకాశాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రి గా ఉన్నప్పుడు ఈశాన్య ప్రాంతంలో ఉగ్రవాద గ్రూపులను అరికట్టడంలో బాగా నిర్వహించారని పేరుపొందారు. మోడీషాల మెప్పు పొందారు.

ఇక ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే అక్కడి స్థానిక నేతలకు కాకుండా ఎంపీలైన యోగి ఆధిత్యనాథ్, త్రివేంద్ర రావత్ లను బీజేపీ సీఎంలను చేసింది. ఈ క్రమంలోనే ఎంపీగా ఉండి కేంద్రమంత్రిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డికి తెలంగాణ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

ఇదే కాదు.. కోవిడ్19 మహమ్మారి వ్యాప్తి సమయంలో హోంశాఖ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ఇన్ చార్జిగా నియమించబడిన కిషన్ రెడ్డి అద్భుతంగా పనిచేశారని కేంద్రం పెద్దలు కితాబిచ్చారు. ఇదే కాకుండా కిషన్ రెడ్డి కూడా పార్టీ పనితీరును మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరించారని.. కీలక ఎన్నికల్లో పార్టీకి మంచి సహకారం అందించారని చెబుతారు.  అమిత్ షా ఆధ్వర్యంలో హోంశాఖ వ్యవహారాల్లో కిషన్ రెడ్డి చేసిన కృతి, పార్టీ పరంగా చేసిన పనులు, వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఆయన పనితీరును బేరీజు వేసుకొనే బీజేపీ అధిష్టానం కిషన్ రెడ్డిని కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతి కల్పించాలని నిర్ణయించిందంటున్నారు.

అందుకే కమలం పార్టీకి ఇప్పుడు కిషన్ రెడ్డి తెలంగాణలో ఆయువుపట్టు కానున్నారు. బీజేపీ చాలా కాలంగా తెలంగాణలో పట్టు సాధించాలని కోరుకుంటోంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చాక దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయడానికి తెలంగాణనే టార్గెట్ చేసుకుంది. ఇటీవల ముగిసిన తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ పేలవమైన పనితీరు కనబరించింది. ఈ క్రమంలోనే ఎలాగైన సరే తెలంగాణలో గెలవాలని పట్టుదలగా ఉంది.

దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఊపును తెలంగాణలో కొనసాగించాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డికి కేంద్రంలో పెద్దపీట వేయడం ద్వారా ఇక్కడి రాష్ట్ర రాజకీయాల్లో బలోపేతం కావాలని బీజేపీ డిసైడ్ అయ్యింది. రాష్ట్రంలో కేసీఆర్ తో పోరాడడానికి బలమైన వ్యక్తులు అవసరం. అందుకే బీజేపీ కిషన్ రెడ్డిని లేపుతోందని అంటున్నారు. బండి సంజయ్ దూకుడుగా కేసీఆర్ ను ఎదుర్కొంటున్నప్పటికీ కేసీఆర్ లాంటి రాజకీయ చాణక్యుడిని ఎదురించాలంటే పెద్ద వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అవసరమని.. అది కిషన్ రెడ్డియేనని బీజేపీ భావిస్తోంది. అందుకే ఇప్పుడు తెలంగాణలో పార్టీ కాబోయే సీఎం కిషన్ రెడ్డియేనని బీజేపీ ఎత్తిచూపుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

ఇక కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ లభించగానే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం వ్యక్తిగతంగా ఢిల్లీ వెళ్లి మరీ అభినందించారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తాను, పార్టీ రాష్ట్రంలో పనిచేస్తాయని బండి సంజయ్ ప్రకటించారు.

దీన్ని బట్టి కిషన్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇష్తున్నారని..రాబోయే రోజుల్లో తెలంగాణలో కేసీఆర్ ను ఢీకొట్టడానికి రెడీ చేస్తున్నారని ఒక స్పష్టమైన సూచన ఇస్తున్నట్టుగా ఉంది.
Tags:    

Similar News