జ‌గన్ కేబినెట్లో ఈ ఎమ్మెల్యేల‌కు బెర్త్ అంత సులువా ?

Update: 2021-05-08 02:01 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రో నాలుగైదు నెల‌ల్లో త‌న కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నారు. కేబినెట్ ఏర్ప‌డిన రోజునే జ‌గ‌న్ రెండున్న‌రేళ్ల త‌ర్వాత త‌న కేబినెట్లో 90 శాతం మందిని మార్చి కొత్త వారికి ఛాన్స్ ఇస్తాన‌ని ఓపెన్‌గానే చెప్పారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి చాలా మంది నేత‌లు కేబినెట్లో బెర్త్ కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు. వీరిలో ఐదు సార్లు గెలిచిన నేత‌లు కూడా ఉన్నారు. వీరి సంగ‌తి ఇలా ఉంటే రెండు సామాజిక వ‌ర్గాల‌కు చెందిన ఎమ్మెల్యేలు మాత్రం ఈ సారి త‌మ‌కు కుల స‌మీక‌ర‌ణ‌ల్లో ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ధీమాతో ఉన్నారు. వెల‌మ‌, బ్రాహ్మ‌ణ వ‌ర్గాల‌కు చెందిన ఎమ్మెల్యేలు మిగిలిన సామాజిక వ‌ర్గాల ఎమ్మెల్యేలు, నేత‌ల‌తో పోలిస్తే సులువుగా మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని అనుచ‌రుల‌తో చ‌ర్చిస్తోన్న ప‌రిస్థితి.

జ‌గ‌న్ కేబినెట్లో అన్ని సామాజిక వ‌ర్గాల నేత‌ల‌కు ప‌ద‌వులు ల‌భించినా వెల‌మ‌, బ్రాహ్మ‌ణ వ‌ర్గం వారికి కేబినెట్ బెర్తులు ద‌క్క‌లేదు. ఈ సారి మార్పులు, చేర్పుల్లో వీరికి ఖ‌చ్చితంగా ప‌ద‌వులు వ‌స్తాయ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అందుకే ఈ రెండు వ‌ర్గాల ఎమ్మెల్యేలు మంత్రి ప‌ద‌విపై ఆశ‌ల్లో ఉన్నారు. వెల‌మ వ‌ర్గం నుంచి గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఫిరాయింపు ఎమ్మెల్యే సుజ‌య్ కృష్ణ‌రంగారావు మంత్రి అయ్యారు. ప్ర‌స్తుతం ఈ వ‌ర్గం ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్ర‌తాప్ అప్పారావు ఒక్క‌రే ఉన్నారు. ఆయ‌న సీనియ‌ర్.. ఇప్ప‌టికే మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇది ఆయ‌న‌కు క‌లిసి వ‌స్తుంద‌ని అంటున్నారు.

ఇక క్ష‌త్రియ వ‌ర్గం కోటాలో ఇప్ప‌టికే మంత్రిగా ఉన్న చెరుకువాడ శ్రీ రంగ‌నాథ‌రాజును త‌ప్పించ‌డం ఖాయం. ఆ ప్లేస్‌లో న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్ర‌సాద‌రాజు కేబినెట్ బ‌ర్త్ ద‌క్కించుకోనున్నారు. ఇక బ్రాహ్మ‌ణుల‌కు జ‌గ‌న్ మంచి ప్ర‌యార్టీ ఇస్తున్నా.. ఈ వ‌ర్గం నుంచి మంత్రులుగా ఎవ్వ‌రూ లేరు. బాప‌ట్ల ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి వ‌రుస‌గా రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచారు. అయితే ఆయ‌న‌కు జ‌గ‌న్ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వితో స‌రిపెట్టారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోకి వ‌చ్చి ఎమ్మెల్యే అయిన మ‌ల్లాది విష్ణుకు బ్రాహ్మణ కార్పొరేష‌న్ చైర్మన్ ప‌ద‌వి ఇచ్చారు. ఈ ఇద్ద‌రూ కూడా సామాజిక స‌మీక‌ర‌ణ‌ల్లో మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్నారు. మ‌రి వీరిలో ఎవ‌రికి కేబినెట్ బెర్త్ ల‌క్ చిక్కుతుందో ?  చూడాలి.
Tags:    

Similar News