అనర్హుల నుంచి ‘వైఎస్ఆర్ చేయూత’ వెనక్కి?

Update: 2020-10-04 07:32 GMT
వైఎస్ఆర్ చేయూత పథకంలో అనర్హులను వేరేసే పనిని వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. అక్రమంగా ఈ చేయూత పథకంలో లబ్ధి పొందిన మహిళల నుంచి రికవరీకి జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ మేరకు వలంటీర్లను అధికారులు పురమాయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్ చేయూత పథకంలో కొందరు గల్ఫ్ లో పనిచేస్తున్న మహిళలకు డబ్బులు జమ అయ్యాయని.. ఇక ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న అంగన్ వాడీల్లో కొందరికీ కూడా ఈ డబ్బులు జమ అయినట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వారి నుంచి రికవరీకి ఆదేశించినట్టు సమాచారం.
 
45 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన మహిళలకు ఏడాదికి వైఎస్ఆర్ చేయూత పథకం కింద రూ.18750 చొప్పున నాలుగేళ్లలో రూ.75వేలు అందించేలా ప్రభుత్వం నెల కిందట ఈ పథకాన్ని జగన్ సర్కార్ ప్రారంభించింది. వలంటీర్లు 45 ఏళ్లు నిండిన మహిళా లబ్ధిదారుల జాబితాను సేకరించి అప్ లోడ్ చేశారు. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 1.71 లక్షలమంది మహిళలను అర్హులుగా గుర్తించారు. వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమచేశారు.
 
వైఎస్ఆర్ చేయూత కింద 45 ఏళ్లు నిండిన మహిళలందరికీ డబ్బులు జమ చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు ఇందులో అనర్హులైన వారు లబ్ధిపొందినట్టు గుర్తించింది. ఈ మేరకు  నిబంధనల ప్రకారం వారి నుంచి రికవరీకి సిద్ధమైంది. భీమవరం, నరసాపురంతోపాటు డెల్టాలోని పలు ప్రాంతాల్లో మహిళలు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లారు.  గల్ఫ్ వెళ్లిన మహిళలకు ‘వైఎస్ఆర్ చేయూత’ వర్తించదని జగన్ ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల్లో ఉంది. కానీ క్షేత్రస్థాయిలో దీనిని అధికారులు పట్టించుకోకుండా మంజూరు చేశారు.. కానీ ఇప్పుడు హఠాత్తుగా గల్ఫ్ వెళ్లిన మహిళల ఖాతాల్లో జమైన సొమ్మును వెంటనే తిరిగి తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి, వలంటీర్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారట.. గల్ఫ్ వెళ్లిన మహిళలు ఇక్కడ లేకపోవవడం.. ఆ సొమ్ము అంతా ఖర్చు అయిపోవడంతో లబ్దిదారులు తాము కట్టలేమంటూ మొరపెట్టుకున్నారట.. దీంతో వలంటీర్లే సొమ్ము చెల్లించాలని అధికారులు ఒత్తిడి తెస్తున్న పరిస్థితి నెలకొంది. నెలకు రూ.5 వేల జీతం తీసుకునే వలంటీర్లకు ఇప్పుడు చేయూత సొమ్ము రూ.18750 ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్నారు.

అంగన్ వాడీ ఉద్యోగులకు జగన్ సర్కార్ ప్రతి నెల రూ.11500 వేతనం ఇస్తోంది.. వారిని ప్రభుత్వ ఉద్యోగులంటూ ‘వైఎస్ఆర్ చేయూత’ పథకంలో ఆ మహిళలను పక్కనపెట్టేశారు. నిబంధనల ప్రకారం వైఎస్ఆర్ చేయూత అంగన్వాడీలకు దక్కదు. దీంతో  అటు చేయూత దక్కక.. ఇటు జీతం సరిపోక అంగన్ వాడీలు మాకు పథకం వర్తింప చేయాలని మొరపెట్టుకున్నారు. పొరపాటున పేరు నమోదు చేసుకున్న అంగన్ వాడీల  నుంచి చేయూత సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇదే విషయంపై తూర్పుగోదావరి జిల్లా డీఆర్డీఏ పీడీ ఉదయ్ భాస్కర్ స్పందించారు. అంగన్ వాడీ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులన్నారు. కొంతమందికి సొమ్ము జమైందని.. అది రికవరీ చేస్తామన్నారు. గల్ఫ్ వెళ్లిన మహిళలకు చేయూత వర్తించదని స్పష్టం చేశారు. వారంతా జమైన సొమ్ము తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వలంటీర్లను ఆ సొమ్ము కట్టాలని తాము చెప్పలేదని వివరణ ఇచ్చారు.
 
ప్రభుత్వం నిబంధనలు చూసుకోకుండా క్షేత్రస్థాయి అధికారులు దరఖాస్తు చేసిన వారందరికీ వైఎస్ఆర్ చేయూత కింద రూ.18750 ఇచ్చేశారు. అనర్హులను గుర్తించి ఇప్పుడు ఆ డబ్బు రికవరీకి ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ సొమ్మును అర్హులైన లబ్ధిదారులకే అందాలని.. అనర్హులకు చేరవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ వెళ్లిన మహిళలు.. అంగన్ వాడీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయూత పథకం వర్తించదు.  

ఈ విషయంలో ప్రభుత్వ ఆలోచన సరైందే.కానీ ఇప్పుడు ఈ పథకం పేరుతో ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఇలాంటి పొరపాట్ల వల్ల మహిళలకు, ప్రతిపక్షాలు ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. అందుకే.. కింది స్థాయి అధికారుల తప్పిదం వల్ల ఇప్పుడు ప్రభుత్వం అభాసుపాలు చేసే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News