జగన్ టూర్ సక్సెస్ అయినట్లేనా ?

Update: 2021-06-11 03:53 GMT
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు మరికొందరు కేంద్రమంత్రులను జగన్మోహన్ రెడ్డి కలిశారు. ఢిల్లీలో ఎవరితో జగన్ కలిసినా అమిత్ షా తో భేటీ ఎప్పుడూ ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుత కాలమాన పరిస్ధితుల ప్రకారం ప్రధానమంత్రి నరేంద్రమోడి తర్వాత అంతటి శక్తిమంతుడు అమిత్. అందరు మోడిని కలిసి మాట్లాడలేరు కాబట్టి అమిత్ తోనే భేటీ అయి చెప్పదలచుకున్నది, మాట్లాడదలచుకున్నది మాట్లాడుతున్నారు. ఈ రీతిలో చూస్తే అమిత్-జగన్ భేటి దాదాపు గంటన్నర జరిగింది.

మూడు రాజధానుల అంశం, కర్నూలుకు  హైకోర్టు తీసుకెళ్ళటానికి రీ నోటిఫికేషన్, పోలవరం ప్రాజెక్టు రివైజ్డు ఎస్టిమేట్స్ కు కేంద్రం ఆమోదించేట్లు చూడాలనే తదితర అంశాలు చర్చించారు. నిజానికి ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలనే చెప్పాలి. అధికారంలోకి వస్తే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామనే బీజేపీ మ్యానిఫెస్టోను జగన్ గుర్తుచేశారు. అంటే బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాన్ని తాను అమల్లోకి తేబోతున్నట్లు స్పష్టంగా చెప్పినట్లయ్యింది.

పోలవరం సవరించిన అంచనాల అంశం తప్ప ఇప్పటికిప్పుడు మూడు రాజధానుల ఏర్పాటు, కర్నూలుకు హైకోర్టు తరలింపు అంశాలు వెంటనే పరిష్కారం చేయగలిగినవే. మిగిలిన అంటే మెడికల్ కాలేజీలకు నిధుల మంజూరు, ఇళ్ళనిర్మాణాలకు కేంద్రసాయం లాంటి అంశాలు కూడా కీలకమైనవే. అమిత్ తో భేటీలో జగన్ చెప్పిన విధానాన్ని బట్టి కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.

అమిత్ తో పాటు ఇతర కేంద్రమంత్రులతో భేటీ తర్వాత జగన్ బాడీ ల్యాంగ్వేజ్ చూస్తే తన టూర్ సక్సెస్ అయిందనే హ్యాపీతో ఉన్నట్లే కనిపిస్తోంది. ఒక ముఖ్యమంత్రి వస్తే కేంద్రమంత్రులు సాధరంగా ఆహ్వానించటం, మాట్లాడటం మామూలే. కాబట్టి అదే పద్దతిలో ఇపుడు జగన్ తో కూడా అనేకమంది మంత్రులు భేటీ అయ్యారు. అయితే ఫాలోటప్ విషయంలో కేంద్రమంత్రుల చొరవ ఎలాగుంది అనే విషయాలపైనే చర్చలు సక్సెస్ అయ్యిందా లేదా అనేది తేలిపోతుంది.
Tags:    

Similar News