ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లిక్క‌ర్ కింగ్ పోటీ ఖాయ‌మేనా?

Update: 2022-09-22 00:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లకు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఆయా పార్టీలు దృష్టి సారించాయి. గెలుపు గుర్రాల‌ను, అంగ బ‌లం, అర్థ బ‌లాలు దండిగా గ‌ల అభ్య‌ర్థుల కోసం అన్వేష‌ణ సాగిస్తున్నాయి.

కాగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంగోలు పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లిక్క‌ర్ కింగ్, ప్ర‌స్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి త‌న‌యుడు రాఘ‌వరెడ్డి పోటీ చేస్తార‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి ఉన్నారు. త‌న‌కు 60 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చింద‌ని.. ఇక తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడిని పోటీ చేయిస్తాన‌ని చెబుతున్నారు.

కాగా ఒంగోలు లోక్‌స‌భ‌ నియోజ‌క‌వ‌ర్గం మాగుంట కుటుంబానికి కంచుకోట‌. ఇక్క‌డ నుంచి 1991 నుంచి మ‌ధ్య‌లో రెండుసార్లు (1999లో క‌రణం బ‌ల‌రామ్‌, 2014లో వైవీ సుబ్బారెడ్డి) మిన‌హాయించి ఇప్ప‌టివ‌ర‌కు మాగుంట కుటుంబీకులే ఎంపీలుగా ఉన్నారు. 1991లో తొలిసారిగా మాగుంట సుబ్బిరామిరెడ్డి ఎంపీగా కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. త‌ర్వాత ఆయ‌న‌ను మావోయిస్టులు హ‌త్య చేశారు. దీంతో 1996 ఎన్నిక‌ల్లో ఆయ‌న స‌తీమ‌ణి మాగుంట పార్వ‌త‌మ్మ ఎంపీగా గెలుపొందారు.  ఇక 1998 ఎన్నిక‌ల్లో మాగుంట సుబ్బిరామిరెడ్డి సోద‌రుడు మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి ఎంపీగా గెలుపొందారు. 2004, 2009 ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న కాంగ్రెస్ ఎంపీగా ఘ‌న‌విజ‌యం సాధించారు. 2014లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన ఓడిపోయిన మాగుంట 2019 ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున గెలుపొందారు.

కాగా కొద్ది రోజుల క్రితం ఢిల్లీ మ‌ద్యం స్కామ్‌కు సంబంధించి మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఒంగోలులో మీడియాతో మాట్లాడిన మాగుంట వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌నకు బ‌దులుగా త‌న కుమారుడు రాఘ‌వ‌రెడ్డి పోటీ చేస్తార‌ని ప్ర‌క‌టించారు.

రాఘ‌వ‌రెడ్డి ప్ర‌స్తుతం లిక్క‌ర్ బిజినెస్‌లు చూసుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌న తండ్రి త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌డం మిన‌హా ఆ త‌ర్వాత ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌లేదు. రాఘ‌వ‌రెడ్డి ఎక్కువ‌గా ఢిల్లీ, హైద‌రాబాద్‌ల్లోనే ఉంటార‌ని చెబుతున్నారు. దీంతో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేర‌ని అంటున్నారు.

మ‌రోవైపు రాఘ‌వ‌రెడ్డి ఒంగోలు నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగితే ప్ర‌త్య‌ర్థి పార్టీలు మ‌ద్యం స్కామ్ వ్య‌వ‌హారంలో ఆయ‌న‌ను విమ‌ర్శించే అవ‌కాశాలున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొని విజ‌యం సాధించ‌డంపైనే రాఘ‌వ‌రెడ్డి సామ‌ర్థ్యాలు ఆధార‌ప‌డి ఉన్నాయ‌ని చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News