ఉద్ధ‌వ్ నిర్ణ‌యంతో మ‌హా వికాస్ అఘాడీ కూట‌మికి బీట‌లేనా?

Update: 2022-07-16 02:30 GMT
మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన పార్టీలో వ‌చ్చిన చీలిక‌తో కాంగ్రెస్ - ఎన్సీపీ-శివ‌సేన ప్ర‌భుత్వం కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే. విశ్వాస ప‌రీక్ష‌కు ముందే మ‌ద్ద‌తు లేక మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న ఉద్ధ‌వ్ ఠాక్రే రాజీనామా చేశారు. ఈ నేప‌థ్యంలో శివ‌సేన చీలిక నేత ఏక‌నాథ్ షిండే.. బీజేపీతో క‌లిసి మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. కాగా మొత్తం శివ‌సేన ఎమ్మెల్యేలు 55 మందిలో 42 మందికి పైగా ఏక‌నాథ్ షిండేతోనే ఉన్నారు.

మ‌రోవైపు తాజాగా ఉద్ధ‌వ్ ఠాక్రే తీసుకున్న నిర్ణ‌యం మ‌హా వికాస్ అఘాడీ కూట‌మి పుట్టి ముంచ‌బోతుంద‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. జూలై 18న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు జ‌ర‌గనున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీయే కూట‌మి త‌ర‌ఫున మాజీ గ‌వ‌ర్న‌ర్ ద్రౌప‌ది ముర్ము, విప‌క్షాల కూట‌మి త‌ర‌ఫున కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం బీజేపీతో ఉప్పూనిప్పుగా వ్య‌వ‌హ‌రిస్తున్న శివ‌సేన చీఫ్ ఉద్ధ‌వ్ రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం తోటి భాగ‌స్వామ్య ప‌క్షం కాంగ్రెస్ కు కాక రేపింది.

దీనిపై కాంగ్రెస్ విరుచుకుప‌డింది. శివ‌సేన‌-ఎన్సీపీ-కాంగ్రెస్ ఒక కూట‌మిగా మ‌హారాష్ట్ర‌లో కొన‌సాగుతున్నాయ‌ని.. ఈ నేప‌థ్యంలో త‌మకు ఒక మాట కూడా చెప్ప‌కుండా ఉద్ధ‌వ్ బీజేపీ అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం ఏమిటంటూ కాంగ్రెస్ నిల‌దీస్తోంది.

ఈ నేపథ్యంలో కూటమి ధర్మాన్ని ఎవరైనా అతిక్రమిస్తే తాము అందులో నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ప్రకటిస్తుండడం మ‌హా వికాస్ అఘాడీ కూటమి బీటలు వారేందుకు దారి తీయ‌డ‌మేన‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌప‌ది ముర్ముకు శివసేన మద్దతు ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బాలాసాహెబ్‌ థోరట్‌.. కూటమిలో భాగస్వామ్య పక్షాలను సంప్రదించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ఉద్ధవ్‌ తీరు సిద్ధాంతపరమైన ఫిరాయింపులకు పాల్పడడమేనని నిప్పులు చెరిగారు.

ఇదే విషయంపై మాట్లాడిన మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మిలింద్‌ దేవ్‌రా కూడా శివ‌సేన‌పై మండిప‌డ్డారు. ప్ర‌త్య‌ర్థి పార్టీలకు ప్రయోజనం చేకూర్చేలా శివసేన వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ తన ప్రయోజనాలను చూసుకుంటే మ‌హా వికాస్ అఘాడీ కూటమికి ముప్పేనని హెచ్చరించారు. ఈ నేప‌థ్యంలో కూటమి నుంచి బయటకు వచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమేనని మిలింద్‌ దేవ్‌రా స్పష్టం చేశారు.

మ‌రోవైపు ఉద్ధ‌వ్ నిర్ణ‌యాన్ని మ‌రో భాగ‌స్వామ్య పార్టీ నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) స‌మ‌ర్థించింది.
ద్రౌపది ముర్మూకు శివసేన మద్దతు ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో తమ కూటమిపై ఎటువంటి ప్రభావం చూపదని ఎన్సీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు జ‌యంత్ పాటిల్ పేర్కొన్నారు. పేర్కొంది.

కాగా ఎమ్మెల్యేలు జారుకున్న‌ట్టు ఎంపీలు కూడా బీజేపీలోకి జారుకునే ప్ర‌మాదం ఉండ‌టంతోనే ఉద్ధ‌వ్ ఠాక్రే ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించార‌ని చెబుతున్నారు. ఏక‌నాథ్ షిండే తిరుగుబాటు లేవ‌నెత్తిన‌ప్పుడు 12 మంది శివ‌సేన ఎంపీలు కూడా ఆయ‌న‌తో ట‌చ్ లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఉద్ధ‌వ్ ఠాక్రే జాగ్ర‌త్త‌ప‌డ్డార‌ని అంటున్నారు.
Tags:    

Similar News