సమ్మె త‌ప్ప‌దా.. ఇక జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పేనా?

Update: 2022-02-04 08:45 GMT
ఉద్యోగులు అనుకున్నంత తీవ్రంగా ఆందోళ‌న ఉండ‌క‌పోవ‌చ్చు.. పోలీసులు అడ్డుకోవ‌డంతో చ‌లో విజ‌య‌వాడ ఫెయిల్ అవుతుంద‌ని అనుకుని ఉండ‌వ‌చ్చు.. ఉద్యోగుల ఉద్య‌మానికి ఏ వ‌ర్గం నుంచి మ‌ద్ద‌తు లేదు అని ఊహించుకుని ఉండ‌వ‌చ్చు.. ఇలా కార‌ణం ఏదైనా ఉద్యోగుల ఆందోళ‌న‌ను సీఎం జ‌గ‌న్ లైట్ తీసుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు చ‌లో విజ‌య‌వాడ‌లో ఉద్యోగుల ఉద్య‌మ గ‌ర్జ‌న చూశాక జ‌గ‌న్‌కు వాళ్ల ఆందోళ‌న‌ల తీవ్ర‌త తెలిసొచ్చింద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆయ‌న ఇక ఉద్యోగుల స‌మ‌స్యపై దృష్టి పెట్టాల్సిందేన‌న్న చ‌ర్చ మొద‌లైంది.

ప్ర‌భుత్వం కొత్త‌గా ప్ర‌క‌టించిన పీఆర్సీ జీవోల‌ను ర‌ద్దు చేసి.. పాత పీఆర్సీ ప్ర‌కార‌మే జీతాలు చెల్లించాల‌ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. కానీ జ‌గ‌న్ మాత్రం వాళ్ల డిమండ్లను ప‌ట్టించుకోలేదు. దీంతో ఉద్యోగ సంఘాల‌న్నీ ఒక్క‌తాటిపైకి వ‌చ్చి పీఆర్సీ సాధ‌న స‌మితి పేరుతో ఉద్య‌మానికి శ్రీకారం చుట్టాయి. దీనికి ఆర్టీసీ కార్మికుల‌తో పాటు ఇత‌ర ప్ర‌భుత్వ విభాగాల ఉద్యోగులు కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల ఆరు అర్ధ‌రాత్రి నుంచి స‌మ్మెకు వెళ్లేందుకు ఉద్యోగులంద‌రూ సిద్ధ‌మ‌య్యారు.  ఆ మేర‌కు సీఎస్‌కు స‌మ్మె నోటీసు కూడా ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం నుంచి ఆశించిన స్పంద‌న రాలేదు.

త‌మ ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ‌లో భాగంగా గురువారం చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మానికి పీఆర్సీ సాధ‌న స‌మితి పిలుపునిచ్చింది. కానీ అందుకు అనుమ‌తి లేద‌ని పోలీసులు ఈ కార్యక్ర‌మాన్ని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఎక్క‌డికక్క‌డ ఉద్యోగుల‌ను అడ్డుకున్నారు. అయిన‌ప్ప‌టికీ పోలీసుల క‌ళ్లు గ‌ప్పి వివిధ మార్గాల్లో మారువేషాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ల‌క్ష‌కు పైగా బెజ‌వాడ చేరుకోవ‌డంతో ప్ర‌భుత్వానికి షాక్ త‌ప్ప‌లేదు. సెల‌వులు పెట్టేందుకు వీల్లేద‌ని.. ఒక‌వేళ ఎవ‌రైనా ఉత్త‌ర్వులు ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు కూడా తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రించినా ఉద్యోగులు ప‌ట్టించుకోలేదు. ఒక్క‌టిగా క‌లిసి విజ‌య‌వాడ గ‌డ్డ‌పై గ‌ర్జించారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గుతుందేమో అనుకుంటే జ‌గ‌న్‌కు ఆ ఆలోచ‌న ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. జ‌గ‌న్ను క‌లిసి వ‌చ్చిన త‌ర్వాత మీడియాతో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట‌ల‌ను చూస్తుంటే ఆ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. దీంతో స‌మ్మె అనివార్యంగా క‌నిపిస్తోంది. ఒక‌సారి స‌మ్మెలోకి వెళ్తే ఉద్యోగులు వెన‌క్కి త‌గ్గే అవ‌కాశం ఉండ‌దు. ఏదో ఒక‌టి సాధించుకునే స‌మ్మెను విర‌మింప‌జేస్తామ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పి త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని రాజ‌కీయ నిపుణులు అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఉద్యోగులు స‌మ్మెకు వెళ్తే అది ప్ర‌భుత్వ కార్యాక‌లాపాల‌పై ప్ర‌జా జీవ‌నంపై తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది.

అప్పుడు అన్ని వేళ్లూ జ‌గ‌న్‌వైపే చూపిస్తాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎప్పుడూ లేనంత‌గా ఇప్పుడు ఉద్యోగుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న జ‌గ‌న్ మ‌రి ఏం చేస్తారో చూడాలి. ఏం చేసినా మ‌రో రెండు రోజులు మాత్ర‌మేన‌న్న విష‌యం గుర్తుంచుకోవాలి.
Tags:    

Similar News