మొబైల్ ఫోన్ వాడకమే రష్యా సైనికుల కొంప ముంచిందా?

Update: 2023-01-04 10:23 GMT
2022 ఫిబ్రవరిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై వార్ ప్రకటించారు. నాటి నుంచి యుద్ధం నిరాటంకంగా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ యుద్దం కారణంగా ఇరు దేశాల్లో భారీ ఆస్తి నష్టం.. ప్రాణ నష్టం సంభిస్తోంది. అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోతుండటం శోచనీయంగా మారింది. అయినప్పటికీ ఇరుదేశాలు మొండిగానే యుద్ధాన్ని కొనసాగిస్తుండటంతో ఇప్పట్లో వార్ కు ఎండ్ కార్డు పడే అవకాశం కనిపించడం లేదు.

రష్యా-ఉక్రెయిన్ వార్ లో తొలుత రష్యాదే పైచేయిగా కన్పించింది. ఉక్రెయిన్ లోని పలు నగరాలను రష్యా ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే ఉక్రెయిన్ సైతం ధీటుగా జవాబిస్తూ తమ నగరాలను రష్యా నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈక్రమంలోనే ఇరు దేశాల సైనికుల మధ్య భీకర యుద్దం నడుస్తోంది. కీవ్ నగరంతో సహా పలు కీలక నగరాలన్నీ బాంబు మోతలు.. క్షిపణుల పేలుళ్లతో దద్దరిల్లి పోతున్నాయి.

ఉక్రెయిన్ కు నాటో దేశాలు.. అమెరికా పరోక్షంగా సహకారం అందిస్తుండటంతోనే కొన్ని నెలలుగా ఉక్రెయిన్ యద్దం కొనసాగిస్తుందని అర్థమవుతోంది. ఈక్రమంలోనే ఉక్రెయిన్ నుంచి రష్యాకు ఇటీవలి కాలంలో ఎదురుదెబ్బలు భారీగానే తగులుతున్నాయి. జనవరి 1న తూర్పు డొనెట్స్క్ ప్రాంతంలో రష్యన్ సైనికులపై ఉక్రెయిన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో రష్యాకు చెందిన సైనికులు భారీగా ప్రాణాలను కోల్పోయారు.

ఈ ఘటనపై రష్యన్లు సోషల్ మీడియాలో ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక వీడియోను రిలీజు చేసింది.  మకివ్కాలో రష్యా సైనికులు బస చేసిన వొకేషనల్ కాలేజీపై ఉక్రెయిన్ నాలుగు క్షపణులను ప్రయోగించిందని దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయుధాల పరిధిలో సైనికులు మొబైల్స్ వాడటం నిషేధమని తెలిపారు. అయితే నూతన సంవత్సర సందర్భంగా సైనికులు ఈ నిబంధనను ఉల్లంఘించినట్లు గుర్తించారు.

ఈ కారణంగానే శత్రువులు మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా తమ సైనికుల లోకేషన్ ను గుర్తించి క్షిపణితో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 89 మంది సైనికులు మృతి చెందినట్లు రష్యా లెప్టినెంట్ జనరల్ సెర్గీ సెవ్యుకోవ్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని ఆయన తెలిపారు. చనిపోయిన సైనికులంతా రిజ్వరిస్టులేనని.. ఇటీవలే వారంతా సైన్యంలో చేరి యుద్ధంలో పాల్గొన్నారని వెల్లడించారు.

కాగా కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకొని రష్యా అధ్యక్షుడు పుతిన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కొద్దిసేపటికే ఉక్రెయిన్ దాడిలో రష్యా సైనికులు భారీగా చనిపోయాడు. ఈ ఘటనలో 400 మంది రష్యా సైనికులు మృతిచెందగా.. 300మందికి గాయాలైనట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే రష్యా మాత్రం 89మంది సైనికులు మృతి చెందినట్లు తాాజాగా ధృవీకరించింది.

ఇక ఈ దాడి కోసం ఉక్రెయిన్ అమెరికాకు చెందిన హిమార్స్ రాకెట్లను వాడింది. ఈ రాకెట్లు అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను చేరుకుంటాయనే పేరుంది. ఈ దాడి తర్వాత రష్యా కీవ్ పై ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది.     



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News