ఐఎస్ చావు ద‌గ్గ‌ర ప‌డుతోంది

Update: 2016-10-20 07:07 GMT
మాన‌వ‌త్వం అన్న‌ది మిల్లీగ్రాము ప‌రిమాణంలో కూడా లేని ముష్క‌రుల మూక అది. ఉగ్ర‌వాదం అన్న ప‌దం కూడా త‌మ ముందు చిన్న‌దే అన్నంతగా దారుణాలకు పాల్ప‌డి ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టించిన ఐఎస్ ఉగ్ర‌మూక‌ల‌కు కాలం చెల్లుతోంది. ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు జీతాలిచ్చి మ‌రీ ఉగ్ర‌వాదుల‌ను రిక్రూట్ చేసుకున్న ఆ సంస్థ ఇప్పుడు సంకీర్ణ సేన‌ల దాడుల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతుడ‌డంతో పాటు ఆర్థికంగానూ చితికిపోయింది. దీంతో ఐఎస్ కు చావుద‌గ్గ‌ర‌ప‌డుతోంది.

తాను ఆక్రమించుకున్న భూభాగం సంకీర్ణసేనల దాడులతో తరిగిపోతుంటే... మరోవైపు నుంచి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి ఐఎస్ సంస్థ‌కు. ప్రస్తుతానికైతే సిరియా - ఇరాక్ లలోని సహజ వనరులు - తమ పట్టు ఉన్న ప్రాంతాల్లో పన్నులు విధించడం ద్వారానే ఐఎస్ కు ఆదాయం సమకూరుతోంది. తాజాగా, తన అధీనంలో ఉన్న మోసుల్ (ఇరాక్) పట్టణాన్ని చేజిక్కించుకోవడానికి ఇరాకీ సేనలు సంకీర్ణ బలగాలతో కలసి యుద్ధం మొదలుపెట్టడంతో ఐసిస్ కష్టాలు మరింత పెరిగాయి.

ఐఎస్ ఆదాయం ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. బలవంతపు వసూళ్లు - పన్నుల ద్వారా 2015లో ఐఎస్ కు నెలకు 30 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరేది. ఒక్క మోసుల్ నగరం నుంచే నెలకు 4 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చేది. దీనికి తోడు, బ్యాంకులను కొల్లగొట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేది. మోసుల్ ని ఆక్రమించిన కొత్తలో అక్కడ ప్రభుత్వ బ్యాంకులను దోపిడీ చేసి ఒకేసారి 500 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో తన ఫైటర్స్ కి జీతాలు ఇవ్వడానికి కూడా ఐఎస్ ఇబ్బందులు పడుతోంది.  దీంతో ఉగ్ర‌వాదుల జీతాల్లో స‌గానికి పైగా కోత పెట్టింద‌ట‌. ఆయుధాలు స‌మ‌కూర్చుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతుండ‌డం... జీతాలు త‌గ్గ‌డంతో ఫైట‌ర్లూ బ‌య‌ట‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని.. ఐఎస్ పీడ వ‌ద‌ల‌బోతోంద‌ని అంత‌ర్జాతీయ నిపుణులు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News