ఆ సీఎంకు స‌వాల్ విసిరిన ఐసిస్‌

Update: 2017-03-22 11:20 GMT
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌ కు ఐసిస్ పేరుతో  గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఛాలెంజ్ చేశారు. మార్చి 24న పూర్వాంచ‌ల్‌ లో జ‌రిగే హింస‌ను ద‌మ్ముంటే అడ్డుకోండి అంటూ ఆ లేఖ‌లో వార్నింగ్ ఇచ్చారు. ఇస్లామిక్ స్టేట్ పేరు రాసి ఉన్న ఆ లేఖ‌ను ఇవాళ పోలీసులు గుర్తించారు. వార‌ణాసిలోని మిర్జామురాద్ ప్రాంతంలో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ అని రాసి ఉన్న ఆ కాగితంపై పాకిస్థాన్ జిందాబాద్ అని కూడా రాసి ఉంది. పూర్వాంచ‌ల్ ప్రాంతంలో హింస సృష్టిస్తామ‌ని, ఆ గంద‌ర‌గోళాన్ని ఆపండి అంటూ ఆ లేఖ‌లో రాశారు. ప్ర‌ధాని నియోజ‌క‌వ‌ర్గంలో లేఖ దొర‌క‌డం వ‌ల్ల పోలీసులు కేసును సిరీయ‌స్‌ గా తీసుకున్నారు. లేఖ‌కు సంబంధించిన కేసులో పోలీసులు కొంద‌ర్ని అరెస్టు చేసిన‌ట్లు ఎస్పీ ఆశిష్ తివారీ తెలిపారు. గోవ‌ధ‌పై రాష్ట్రంలో నిషేధం విధించ‌డాన్ని ఆగ్ర‌హిస్తూ లేఖ రాసిన‌ట్లు తెలుస్తోంది.

గోవ‌ధ‌-గోవుల స్మగ్లింగ్‌ ను అరిక‌ట్టేందుకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ న‌డుం బిగించారు. అక్ర‌మంగా కొన‌సాగుతున్న గోవ‌ధశాల‌ల‌ను మూసివేయ‌డానికి త‌గిన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేయాల‌ని రాష్ట్ర పోలీస్ చీఫ్ ను ఆదేశించారు. దీనిపై ఇంత‌కుముందే యోగి ఆదేశాలు జారీచేసినా.. రాష్ట్రంలో అనుమ‌తుల‌తో న‌డిచే గోవ‌ధశాల‌లు కూడా ఉండ‌టంతో అధికారులు అయోమ‌యానికి గుర‌య్యారు. దీనిపై ఆయ‌న ఇవాళ స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఇక ఆవుల స్మగ్లింగ్‌ను ఏమాత్రం ఉపేక్షించ‌కూడ‌ద‌ని, అలాంటి చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డేవారిని క‌ఠినంగా శిక్షించాల‌ని యోగి ఆదిత్య‌నాథ్ స్ప‌ష్టంచేశారు. గోవ‌ధ‌పై కొత్త‌గా ఏమీ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేద‌ని, మేనిఫెస్టోలో చెప్పిన ప్ర‌కారమే చేస్తున్నామ‌ని యూపీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ చెప్పారు. సీఎం యోగి మరో ఆర్డర్ కూడా జారీ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పాన మసాలా, గుట్కాలను నిషేధించాలని ఆదేశించారు.

మ‌రోవైపు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో పలు మాంసం షాపుల‌కు నిప్పుపెట్టారు. ఈ ఘ‌ట‌న హ‌త్రాస్ జిల్లాలో మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగింది. యూపీ సీఎంగా యోగి ఆదిత్య‌నాథ్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన రెండు రోజుల్లోనే ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. అయితే గోసంరక్షక దళాలు మీట్ షాపులకు నిప్పు పెట్టినట్టు తెలుస్తున్నది. వాస్త‌వానికి ప్ర‌మాణ స్వీకారం చేసిన రెండ‌వ రోజే సీఎం యోగి రాష్ట్రంలోని రెండు క‌బేళాల‌పై నిషేధం విధించారు. గోవుల స్మ‌గ్లింగ్‌ ను ఆపేందుకు మొరాదాబాద్ ఎస్పీ కూడా అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను నెల‌కొల్పేందుకు పోలీసులు కూడా పికెటింగ్ నిర్వ‌హిస్తున్నారు. బీజేపీ త‌న ఎన్నిక‌ల్లో మేనిఫెస్టోలో అక్ర‌మ క‌బేళాల‌ను మూసివేస్తామ‌ని హామీ ఇచ్చింది. ఆ వాగ్ధానం ప్ర‌కార‌మే రాష్ట్రంలో క‌బేళాల‌ను మూసివేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News