మెంటలెక్కించే మొయిల్ టుడే మాట

Update: 2016-01-27 04:47 GMT
ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) భారత్ లో మారణహోమం సృష్టించేందుకు విపరీతంగా కసరత్తు చేస్తుందా? భారత్ లో తన పరిధిని పెంచుకోవాలన్న లక్ష్యంతో ఎంతలా ప్రయత్నిస్తుంది? భారత్ లో దాడులకు పాల్పడేందుకు ఎలాంటి వ్యూహాల్ని పన్నుతోందన్న విషయంపై మొయిల్ టుడే ప్రచురించిన ప్రత్యేక కథనం ఇప్పుడు సంచలనంగా మారింది.

భారత్ లో దాడులు చేసేందుకు వీలుగా.. తన పరిధిని విస్తృతం చేసుకునేందుకు ఐసిస్ విపరీతంగా ప్రయత్నిస్తున్నట్లు సదరు కథనం తేల్చింది. ఇందుకోసం భారీగా హ్యాకర్లను రిక్రూట్ చేసుకోవాలని భావిస్తోంది. విన్న వెంటనే టెంప్ట్ అయ్యేంత భారీ మొత్తాన్ని జీతంగా ఇస్తామని ప్రతిపాదిస్తోందని పేర్కొంది. ఐసిస్ నాయకత్వం ఇప్పటివరకూ 30 వేలమందికి పైగా యువ టెకీలతో సంప్రదింపులు జరిపిందని.. వీరికి రూ.7లక్షల ప్యాకేజీతో కూడిన ఉద్యోగ ఆఫర్ ను ఇచ్చినట్లుగా చెబుతోంది.

భారత్ ప్రభుత్వానికి చెందిన ఏ సమాచారాన్ని అయినా హ్యాక్ చేసి.. తమకు సమాచారం అందిస్తే.. భారీ మొత్తంగా ప్యాకేజీ లభిస్తుందన్న ఆఫర్ ఇస్తుందని పేర్కొంది. ప్యారిస్ లో మారణహోమం సృష్టించిన ఐసిస్ ఉగ్రమూక.. భారత్ లో కూడా ఇదే తరహా విధ్వంసానికి పాల్పడేందుకు వీలుగా భారీగా కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలువురిని ఈ ప్యాకేజీ కింద ఉద్యోగాలు ఇచ్చి ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది. ఈ కథనం వింటే భారత్ మీద ఐసిస్ ఫోకస్ ఎంత భారీగా ఉందన్న విషయం అర్థం కావటంతో పాటు.. భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు ఎంత భారీగా ప్లాన్ వేస్తున్నారా? అన్న విషయం అర్థకాక మానదు.

ఇదిలా ఉంటే తాజాగా.. ఐసిస్ తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో హైదరాబాద్ కు చెందిన మరో యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నాయి. గత కొద్ది రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఐసిస్ తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకుంటున్న యువకుల జాబితాలో మరొకరు చేరారు. రిపబ్లిక్ డే సందర్భంగా దేశంలోని పలుమెట్రో నగరాల్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన వైనాన్ని గుర్తించి.. దాన్ని భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ హైదరాబాద్ కు చెందిన మరొకరిని అరెస్ట్ చేశారు. దీంతో.. హైదరాబాద్ లో ఐసిస్ సానుభూతిపరుల్ని అదుపులోకి తీసుకున్న సంఖ్య నాలుగుకు చేరినట్లైంది.
Tags:    

Similar News