ఒమిక్రాన్ పై యుద్ధం.. ఆ విషయంలో తగ్గేదే లే!

Update: 2021-12-28 07:30 GMT
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వందకుపైగా దేశాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. అతి వేగంగా వ్యాప్తి చెందే గుణాలు కలిగి ఉన్న ఈ వైరస్... డెల్టా కంటే అతి ప్రమాదకరం కాదని వైద్య నిపుణులు ఇప్పటికే చెప్పారు. కానీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్త మవుతున్నాయి. దీనిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి... అమలు చేస్తున్నాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్ దేశం ఓ అడుగు ముందుంది.

ఒమిక్రాన్ పై యుద్ధం ప్రకటించే దిశగా ఇజ్రాయెల్ ప్రభుత్వం సిద్ధమైంది. అనగా కొత్త వేరియంట్ కేసులు పూర్తిగా నియంత్రించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. వైరస్ ను కట్టడి చేయడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే శక్తివంతమైన మార్గమని తెలిసింది. కాగా టీకా పంపిణీ విషయంలో ఇజ్రాయెల్ దూసుకుపోతోంది. ఆగస్టు నెలలో ఆ దేశ ప్రజలందరికీ మూడో డోసు టీకాను కూడా ఇచ్చారు. ఇక వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పుడు నాలుగో డోసు పంపిణీ ప్రక్రియను ప్లాన్ చేస్తున్నారు.

దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ కొత్త వేరియంట్ ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే 150 మంది వైద్య సిబ్బందికి నాలుగో డోసు టీకా ఇచ్చారు. ప్రస్తుతం వారి ఆరోగ్య స్థితిని పరిశీలిస్తున్నారు.

ఆ వైద్య సిబ్బంది పూర్తి ఆరోగ్యంగా ఉండి... ఒమిక్రాన్ ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటే వెంటనే నాలుగో డోసు పంపిణీ చేయాలని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. నాలుగో డోసు వల్ల కట్టడి చేయగలమని తేల్చితే వెంటనే వారందరికీ నాలుగో డోసు త్వరితంగా ఇస్తామని ప్రకటించింది. కాగా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్య శాఖ ఇప్పటి నుంచి సన్నాహాలు చేస్తూనే ఉంది.

ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. భారతదేశంలోనూ క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. అమెరికా, యూకేలో రోజువారీగా వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ఒమిక్రాన్ వేరియంట్ల కేసులు నమోదవుతున్నాయి.

ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు పెరుగుతుండడం గమనార్హం. మహమ్మారిని ఎదుర్కోవడానికి డోసుల విషయంలో తగ్గేదే లేదు అన్నట్లుగా ఇజ్రాయెల్ దూసుకుపోతోంది. అయితే బూస్టర్ డోసు వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదని డబ్ల్యూహెచ్ వో ఇదివరకే ప్రకటించింది. 'వ్యాక్సిన్ తీసుకోని వారికి వైరస్ సోకుతుందని కానీ... బూస్టర్ డోస్ తీసుకోని వారికి కాదని' ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.


Tags:    

Similar News