ఈసీ చేతిలో జగన్ కు ఝులక్.. ఆ మీడియా సంస్థ పుణ్యమేనా?

Update: 2022-09-22 04:30 GMT
తన చేతిలో ఉన్న అపరిమితమైన అధికారంతో ఏమైనా చేయొచ్చన్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తుంటారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు అప్పుడప్పుడు ఆరోపణలు చేస్తుంటారు. తాను అలా చేయట్లేదన్న రీతిలో సమాధానాలు చెప్పేందుకు ససేమిరా అన్నట్లు ఫీలయ్యే జగన్.. అలాంటి వ్యాఖ్యల్ని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తారు. కాల క్రమంలో అలాంటి ఆరోపణలతో వచ్చి పడే సమస్యలు జగన్ ను మరింత ఇబ్బందికర పరిస్థితులకు తీసుకెళుతుంటాయి. తాజాగా ఈసీ చేతిలో జగన్ కు ఎదురైన ఇబ్బందికర పరిస్థితి సైతం జగన్ అండ్ కో మైండ్ సెట్ గా చెబుతున్నారు.

వైసీపీ శాశ్విత అధ్యక్షుడిగా ప్లీనరీలో విజయసాయి చేసిన ప్రకటనపై కేంద్ర ఎన్నికల సంఘం రియాక్టు కావటం.. వివరణ ఇవ్వాలని ఆదేశించటం.. శాశ్విత అధ్యక్షులు లాంటి పదవులు మన దగ్గర లేవన్న విషయాన్ని గుర్తు చేయటంతో పాటు.. అదే విషయాన్ని వివరణ రూపంలో ఇవ్వాలన్నట్లుగా ఈసీ వ్యాఖ్యానించటం తెలిసిందే.

ఇంతకీ ఇలాంటి పరిస్థితికి ఎవరు కారణం? అన్నప్పుడు జగన్ వైపు అందరి వేళ్లు చూపిస్తుంటాయి. కానీ.. అసలు వాస్తవం మరోలా ఉందన్న మాట వినిపిస్తోంది.

వైసీపీ ప్లీనరీ సందర్భంగా విజయసాయి చేసిన ప్రకటనకు మీడియాలో ప్రాధాన్యం లభించినా.. ఒక మీడియా సంస్థ చేసిన పని ఇప్పుడున్న పరిస్థితికి కారణమన్న మాట వినిపిస్తోంది. వైసీపీ జీవితకాల అద్యక్షుడన్న ప్రకటన నేపథ్యంలో.. అలాంటి ప్రకటన సాధ్యం కాదని.. ఇలాంటి పని రాజకీయ పార్టీలు చేస్తే ఈసీ ఊరుకోదన్న విషయాన్ని జగన్ కు ఏ మాత్రం నచ్చిన మీడియా సంస్థ ఒకటి తెలియజేసేలా కథనాన్ని అప్పట్లో ప్రచురించింది.

అంతేకాదు.. ''కింగ్ పిన్ జగన్'' పేరుతో ఒక కథనం పబ్లిష్ కావటమే కాదు.. వైసీపీ చేసిన తప్పును ఎత్తి చూపటమే తాజా పరిస్థితికి కారణమని చెబుతున్నారు. వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ.. విమర్శనాత్మకంగా రాసిన కథనం ఆధారంగా ఈసీకి పలువురు పిర్యాదు చేయటం.. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రశ్నించటం లాంటివి ఒకటి తర్వాత ఒకటి జరిగాయి.

జగన్ నిత్యం ఒక్కసారైనా తన మాటల్లో తిట్టే ఒక మీడియా సంస్థ కథనం జగన్ కు తాజా షాకిచ్చిందన్న మాట కొందరు ప్రస్తావించటం గమనార్హం.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News