ముంబై తరహాలో విశాఖ ను అభివృద్ధి .. దానికి రాజ‌ధానే అవ‌స‌రం లేదు!

Update: 2022-10-21 14:30 GMT
ఏపీ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు.. తాజాగా.. వైసీపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న బీజేపీ నాయ‌కుడిగా కూడా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీపై చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. విజ‌య‌వాడలో ఐవైఆర్ మాట్లాడుతూ..  1953 నుంచి ఏపీ రాజధాని అంశం‌ వివాదంగానే ఉంద‌న్నారు. రాజాజీ, ప్రకాశం పంతులు వంటి నేతలు నాడు నిర్ణయించలేక పోయారని తెలిపారు. ఆనాడు గౌతు లచ్చన్న వంటి పెద్దలు  గుంటూరు లో  రాజధాని పెట్టాలని డిమాండ్ చేసిన‌ట్టు చెప్పారు.

అదేస‌మ‌యంలో హైకోర్టు కర్నూలు లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, ఆ తరువాత అనుకోని పరిణామాల తో పూర్తి స్థాయిలో అమలు చేయలేద ని వివ‌రించారు.  2014లో రాష్ట్ర విభజన స‌మ‌యంలో ఇచ్చిన శివ‌రామ‌కృష్ణ‌న్ నివేదిక‌ను చంద్రబాబు పూర్తి స్థాయిలో అమలు‌చేయలేద‌న్నారు.

నేటి రాజధాని వివాదాలకు ఆది పురుషుడు చంద్రబాబు, మూల పురుషుడు జగన్మోహన్ రెడ్డి అని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎంతో చారిత్రక నేపధ్యం ఉన్న నాలుగు ప్రాంతాలను కలుపుకుని‌ వెళ్లడంలో‌ చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు.

1953లో రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ లేదు.. 2014లో రియల్ ఎస్టేట్ ఎంటర్ అయ్యిందని ఐవైఆర్ అన్నారు.  రాజధాని అభివృద్ధి చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి అమరావతి ని చంపేశారని దుయ్య‌బ‌ట్టారు. మధ్యలో ఉన్న పనుల‌ను కూడా పూర్తిగా  ఆపేసి రాజధానిని నాశనం చేసారని నిప్పులు చెరిగారు. అమరావతి ని పరిపాలనా రాజధానిగా ఉంచి, మహానగరంగా విశాఖ‌ను అభివృద్ధి చేస్తే వివాదం ఉండేది కాదన్న ఐవైఆర్‌.. హైకోర్టు ను కర్నూలు కు తరలించాలనేది బిజెపి విధానమ‌ని చెప్పారు.

ముంబై తరహాలో విశాఖను అభివృద్ధి చేయవచ్చున‌ని... దానికి రాజధానే చేయనక్కర్లేదని వివ‌రించారు. పచ్చటి కొండలను తవ్వేసి ప్లాట్లు వేసి దోచుకోవడమే అభివృద్ధా? అని వైసీపీ స‌ర్కారును నిల‌దీశారు. పరిపాలనా రాజధాని ఉన్న ప్రాంతమే ఎపి రాజధాని అవుతుంద‌ని, అసలు మూడు రాజధానుల కాన్సెప్ట్ పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు.

ఎపికి రాజధాని అమరావతి, మహా నగరం విశాఖపట్నం అని పేర్కొన్నారు.  అభివృద్ధి కి కేంద్రంలోని‌ బిజెపి  ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విశాఖలో ఉన్న ల్యాండ్ బ్యాంక్ లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ గొట్టడం సులువు... వాటిని నియంత్రణ చేయడం కష్టమ‌న్నారు. రాష్ట్ర పాలకులు ఈ అంశాలను పరిశీలించి.. ఇటువంటి చర్యలు ఆపాలని సూచించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News