హ‌రిబాబుకు ఎస‌రు పెట్టిన ఐవైఆర్?

Update: 2018-09-17 10:21 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి  - ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ....తాజాగా బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది కాలంగా ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తోన్న ఐవైఆర్ .... శనివారం నాడు తెలంగాణ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో పార్టీలో చేరారు. అయితే, ఐవైఆర్ సేవ‌ల‌ను బీజేపీ ఏ విధంగా ఉప‌యోగించుకుంటుంది...ఆయ‌న‌కు ఎక్క‌డ టికెట్ కేటాయిస్తుంద‌న్న అంశం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో ఐవైఆర్ ను విశాఖ‌ప‌ట్నం పార్ల‌మెంటు స్థానం నుంచి బ‌రిలోకి దించాల‌ని బీజేపీ యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ హ‌రిబాబు స్థానంలో ఐవైఆర్ కు టికెట్ ఇవ్వాల‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నార‌ట‌. అయితే, హ‌రిబాబును ఆ త‌ర్వాత రాజ్య‌స‌భ‌కు పంపిస్తామ‌ని బీజేపీ అధిష్టానం హామీ ఇచ్చింద‌ట‌.

రిటైర్మెంట్ త‌ర్వాత ఐవైఆర్ ను  ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా చంద్ర‌బాబు నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత చంద్ర‌బాబుతో విభేదాల కార‌ణంగా...ఆయ‌న టీడీపీపై చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా, బీజేపీలో చేరిన ఐవైఆర్ కు విశాఖ ప‌ట్నం స్థానం కేటాయించాల‌ని బీజేపీ పెద్ద‌లు నిర్ణ‌యించార‌ట‌. స్పెష‌ల్ రైల్వే జోన్ విష‌యంలో విశాఖ ప్ర‌జ‌లు కేంద్రంపై గుర్రుగా ఉన్నార‌ని - అందుకే అక్క‌డ ఐవైఆర్ ను ఎంపిక చేశార‌ని తెలుస్తోంది. అమ‌రావ‌తిలో అభివృద్ధి కేంద్రీకృత‌మ‌వడం....ఉత్త‌రాంధ్ర కు అన్యాయం జ‌ర‌గ‌డం వంటి విష‌యాల‌ను ఐవైఆర్ చాలాకాలంగా లేవ‌నెత్తుతున్నారు. కాబ‌ట్టి, ఆయ‌నే విశాఖ‌లో క‌మ‌లం విక‌సించేలా చేస్తార‌ని బీజేపీ అధిష్టానం భావిస్తోంద‌ట‌. అందులోనూ - చంద్ర‌బాబును ఢీకొన‌డంలో ఐవైఆర్ స‌ఫ‌ల‌మ‌య్యారు కాబ‌ట్టి...రాబోయే కాలంలో బాబుపై ఐవైఆర్ ను ఆయుధంలా ఉప‌యోగించాల‌ని భావిస్తున్నార‌ట‌.


Tags:    

Similar News