జ‌గ‌న్ ఎత్తు మ‌ళ్లీ ఫెయిల‌యింది

Update: 2016-03-28 09:01 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈనెల 29 - 30 తేదీల్లో ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు వస్తున్నందున తప్పకుండా హాజరవ్వాలని తన పార్టీ ఎమ్మెల్యేలకు వైకాపా విప్ జారీ చేయ‌డం ఇపుడు ఆ పార్టీలో అసంతృప్తుల‌కు కార‌ణం  అవుతోంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా చర్చలో పాల్గొని ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా విప్ జారీ చేసినట్లు వైసీపీ విప్ అమరనాథ్ రెడ్డి ప్రకటించారు. వైకాపా గుర్తుపై గెలిచిన శాసనసభ్యులందరికీ ఈ నెల 21వ తేదీన విప్ జారీ చేసినట్లు చెప్పారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ముగిసిన వెంటనే డివిజన్ (శాసనసభ్యుల లెక్కింపు) ద్వారా లెక్కింపు నిర్వహించాలని స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. పార్టీ నిర్ణయానికి ఎవరు వ్యతిరేకంగా ఓటు వేసినా, సమావేశానికి హాజరుకాకపోయినా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్లవుతుందని ఆయన చెప్పారు.

అయితే ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకించాలని విప్ జారీ చేయడం పట్ల వైకాపాలోని కొంతమంది సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. బిల్లులో ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే అంశాలున్నా తాము ఎలా వ్య‌తిరేకిస్తామ‌ని స‌ద‌రు నాయకులు ప్ర‌శ్నిస్తున్నారు. కీల‌క‌మైన బీసీల‌కు న్యాయం చేసే అంశాల‌తో పాటు రాష్ట్ర ఆర్థిక విష‌యాలు ఇమిడి ఉన్న క్ర‌మంలో తాము వ్య‌తిరేకించ‌డం స‌రైంది కాద‌ని చెప్తున్నారు. ఇంతేకాకుండా డివిజ‌న్ ద్వారా తాము వ్య‌తిరేకించిన‌ప్ప‌టికీ టీడీపీ ఎమ్మెల్యేలే ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ బిల్లును ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గెలిపించుకుంటుంద‌ని వైసీపీ నాయ‌కులు విశ్లేషిస్తున్నారు. మ‌రోవైపు ఈ విప్ జారీ వారిని కొంత బాధిస్తున్నట్టు తెలుస్తోంది. వీటన్నింటినీ ఆసరాగా తీసుకుని కొంతమంది సీనియర్లు పార్టీని వెళ్లడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News