బుట్టా రేణుక కు జగనన్న బంపర్ ఆఫర్...?

Update: 2023-06-28 08:00 GMT
బుట్టా రేణుక 2014 ఎన్నికల్లో తొలిసారి వైసీపీ నుంచి పోటీ చేసి కర్నూల్ వంటి కీలకమైన పార్లమెంట్ సీట్లో జెండా ఎగరేశారు. అయిదేళ్ల కాలంలో ఆమె ఎంపీ గా అటు పార్లమెంట్ లోనూ ఇటు కర్నూల్ లోనూ తన సత్తా చాటుకున్నారు. తన ఉనికి ని బలంగా చెప్పుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె టీడీపీలోకి వెళ్ళారు.

అయితే అక్కడ సముచిత ప్రాధాన్యత దక్కకపోవడంతో తిరిగి వైసీపీ లోకి 2019 ఎన్నికల ముందు వచ్చారు. కర్నూల్ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న చేనేత సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుక 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధుల విజయం కోసం ఎంతగానో కృషి చేశారు. అయితే ఆమెకు గత నాలుగేళ్ల లో నామినేటెడ్ పదవి అయితే దక్కలేదు అని కొంత బాధ ఉంది.

కానీ జగన్ మాత్రం ఆమెను అయితే పార్లమెంట్ లేకపోతే అసెంబ్లీ బరిలోకి దించాల ని చూస్తున్నారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే కర్నూల్ ఎంపీ గా వైసీపీ నుంచి ప్రస్తుతం ఉన్న డాక్టర్ సంజీవ్ కుమార్ చురుకుగా లేకపోవడంతో ఆమెను కర్నూల్ ఎంపీ గా పోటీ చేయించవచ్చు అన్న టాక్ ఉంది. బుట్టా రేణుక కు ఎంపీ సీటు కొట్టిన పిండి. పైగా బీసీ కార్డ్ మహిళ అన్నది కూడా ఉపయోగపడుతుంది. ఆమె పోటీ అసెంబ్లీ అభ్యర్ధుల గెలుపున కు కలసి వస్తుంది అని అంటున్నారు.

అదే టైం లో ఎమ్మిగనూరు అసెంబ్లీ సీట్లో కూడా ఆమె పోటీ చేస్తారు అని అంటున్నారు. చేనేత సామాజికవర్గం అధికంగా ఉన్న ఈ సీటు మీద ఆమె కన్నేశారు. అక్కడ బాగా తిరుగుతున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకేశవ రెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పేసారు. ఇక ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కి టికెట్ ఇవ్వాలనుకున్నా 2014లో ఆయన పోటీ చేసి ఓడారు. దాంతో బుట్టా రేణుక కు ఆ సీటు ఇస్తారని ప్రచారంలో ఉంది.

మొత్తానికి జగన్ నుంచి బుట్టా రేణుక కు బంపర్ ఆఫర్ అయితే దక్కింది అని అంటున్నారు. ఇక బుట్టా రేణుక చాయిస్ తో ఆమె ఎంచుకోవడమే అని కూడా అంటున్నారు. అర్ధ బలం అంగబలంతో పాటు పారిశ్రామికవేత్తగా, విద్యాధికురాలి గా ఉన్న బుట్టా రేణుక ఎంపీ గా అయినా ఎమ్మెల్యేగా అయిన గెలిచేందుకు రెడీ గా ఉంటారని ఆమె వర్గం అంటోంది.

అయితే జగన్ ఆమెను ఎమ్మెల్యేగా చేసి రేపటి రోజున ప్రభుత్వం అధికారం లోకి వస్తే మంత్రిగా తీసుకునే ఆలోచన ఉందని అంటున్నారు. ఏది ఏమైనా బుట్టా రాజకీయ జాతకం 2024 తరువాత మారుతుందని ఆమె వర్గం అయితే హ్యాపీ గా ఉన్నారట. మరి రానున్న రోజుల్లో రేణుక ఏ విధంగా దూసుకుపోతారో చూడాల్సిందే.

Similar News