బాబు పవన్ భేష్ అంటూ జేడీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆ తరువాత ఆయన అనేక కీలక హోదాలలో పనిచేసి 2018లో తన ఉద్యోగానికి స్వచ్చందంగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు

Update: 2024-10-25 04:07 GMT

జేడీ లక్ష్మీనారాయణ పేరు తెలియని వారు ఏపీ రాజకీయాల్లో ఎవరూ ఉండరు. ఆయన వైసీపీ అధినేత జగన్ కేసులను సీబీఐ అధికారి హోదాలో విచారించారు. ఆ తరువాత ఆయన అనేక కీలక హోదాలలో పనిచేసి 2018లో తన ఉద్యోగానికి స్వచ్చందంగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు.

ఆయన 2019లో విశాఖ నుంచి జనసేన తరఫున పోటీ చేసి రెండు లక్షల ఎనభై వేల ఓట్లను సాధించారు. ఒక విధంగా చూస్తే ఆయన గెలుపు అంచులను తాకారు అనే చెప్పాలి. అయితే జనసేన ఆ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో పాటు ఆయన జనసేన కార్యకలాపాల తీరుకు విసుగు చెంది పార్టీ నుంచి బయటకు వచ్చారు అన్న ప్రచారం ఉంది. ఆయన 2024 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా తన సొంత పార్టీ తరఫునే పోటీ చేశారు. అయితే ఓటమి పాలు అయ్యారు. జై భారత్ నేషనల్ అని ఆయన పార్టీ పెట్టినా అది ఆ తరువాత అయితే పెద్దగా కనిపించడం లేదు.

ఇక అడపా తడపా ఆయన మీడియా ముందుకు వస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు. ఇక సడెన్ గా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను పొగుడుతూ ఆశ్చర్యపరచారు. ఏపీ ఈ ఇద్దరి నాయకత్వంలో గుణాత్మకమైన అభివృద్ధిని సాధిస్తోందని జేడీ పేర్కొనడం విశేషం.

అంతే కాదు అమరావతికి అనుసంధాన రైల్వే లైన్ తో పాటు రణస్థలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు హోదాలో ఆయన స్పందించారు. అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ ను సాధించడంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు చూపిన చొరవ అభినందనీయం అని పేర్కొన్నారు.

అమరావతి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు, రణస్థలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు ఏపీ అనుసంధానానికి, మౌలిక సదుపాయాల రంగానికి గణనీయంగా ఊతమిస్తాయని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు గుణాత్మక అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని కొనియాడారు. ఈ మేరకు లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.

దీంతో జేడీ తన పార్టీని కూడా కూటమికి మిత్ర పక్షంగా చేస్తారా అన్న చర్చ వస్తోంది. ఆయనకు లోక్ సభకు పోటీ చేసి పార్లమెంట్ లో అడుగుపెట్టాలని ఉంది. అయితే అది కలగానే మిగులుతోంది. ఇంతలో జమిలి ఎన్నికలు అంటూ వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ మధ్యలో ఎన్నికలు వస్తే కనుక జై భారత్ నేషనల్ పార్టీని కూటమిలో చేర్చి జేడీ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News