జగన్ ఫారిన్ టూర్ ఎందుకంత వ్యక్తిగతం?

Update: 2021-08-24 10:44 GMT
రెండు రోజుల క్రితం చాలా ప్రధాన పత్రికల్లో సింగిల్ కాలమ్ ఐటమ్ ఒకటి కవర్ అయ్యింది. దాని సారాంశం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారని. సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫారిన్ ట్రిప్ అన్నంతనే.. అదో భారీ వార్తగా మారుతుంది. రాష్ట్రానికి అవసరమైన పెట్టుబడులతో పాటు.. పలువురు విదేశీ ప్రముఖులతో భేటీ కావటం.. రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టుల కోసం మంతనాలు లాంటివి జరుగుతుంటాయి. కానీ.. ఇప్పుడు జగన్ ఫారిన్ టూర్ పూర్తిగా వ్యక్తిగతమైనది కావటంతో.. అంత ప్రాధాన్యత మీడియా ఇవ్వలేదు.

అయితే.. ఈ టూర్ వెనుక చాలా పెద్ద విశేషమే ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కారణం.. ఈ నెలలో ఆయన సిల్వర్ జూబ్లీ మ్యారేజ్ యానివర్సిరీ ఉంది. దీన్ని కుటుంబ సమేతంగా జరుపుకోవటం కోసం భార్యా పిల్లలతో కలిసి ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. దాదాపు పాతికేళ్ల క్రితం ఇదే నెలలో భారతిని జగన్ పులివెందులలో పెళ్లి చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహం భారీ ఎత్తున సాగింది. ఆగస్టు 26న వారి పెళ్లి రోజు.

గడిచిన రెండేళ్లుగా జగన్ విదేశీ టూర్లకు వెళ్లింది లేదు. ఆయన చివరి సారి తన కుమార్తె హర్షా రెడ్డి కాలేజీ ఆడ్మిషన్ కోసం వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఆయన ఎక్కడకు వెళ్లలేదు. గత ఏడాదిన్నరగా ఆయన తాడేపల్లిలోని నివాసం.. సీఎంవోకే పరిమితమయ్యారు. కరోనా.. దాని పరిణామాలతో ఆయన కదలటానికి వీల్లేకుండా పోయింది. మధ్య మధ్యలో ఢిల్లీకి వెళ్లి వచ్చినా.. రెండు మూడు రోజుల మినహా మిగిలిన కాలమంతా ఆయన పాలన మీదా.. పార్టీ మీదా ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి.

తాజాగా విజయవాడ నుంచి వారి ప్రయాణం మొదలై మొదట పారిస్.. ఆ తర్వాత లండన్ వెళతారని చెబుతున్నారు. కుమార్తెను కలిసిన అనంతరం వారి సిల్వర్ జూబ్లీ పెళ్లి వేడుక ఉంటుందని చెబుతున్నారు. పూర్తి వ్యక్తిగతంగా సాగుతున్న ఈ పర్యటనకు ప్రభుత్వ నిధుల్ని వినియోగించటం లేదని తెలుస్తోంది. దాదాపు ఐదు రోజుల పాటు సాగనున్న ఈ టూర్  ఆగస్టు 28తో ముగుస్తుంది. ఆయన 29న విజయవాడకు చేరుకుంటారని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. జగన్ ప్రస్తుతం కోర్టు బెయిల్ మీద ఉన్న నేపథ్యంలో ఆయన తాజా విదేశీ పర్యటనకు సంబంధించి కోర్టు అనుమతిని పొందాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి..సీబీఐ కోర్టు నుంచి పరిష్మన్ తీసుకున్నారో లేదన్న దానిపై స్పష్టత రావటం లేదు. దీనికి తోడు ఈ నెలాఖరులో జగన్ బెయిల్ రద్దు అంశం విచారణకు రావాల్సి వస్తోంది.
Tags:    

Similar News