రైతు దీక్ష‌లో నిప్పులు చెరిగిన జ‌గ‌న్‌

Update: 2017-05-01 09:33 GMT
అధికారం చేతికి రావ‌ట‌మే ముఖ్యం. అందుకోసం ఏమైనా.. ఎంత హామీ అయినా.. వెనుకా ముందు చూసుకోకుండా ఇచ్చేయ‌టం కొంద‌రు రాజ‌కీయ నేత‌ల‌కు అల‌వాటు. అలాంటి వారిలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ముందుంటారు. 2014లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా నాటి విప‌క్ష నేత చంద్ర‌బాబు మాట‌లు చూస్తే.. ప‌వ‌ర్‌ లోకి రావ‌టానికి ఏ హామీ అక్క‌ర‌కు వ‌స్తుందంటే.. ఆ హామీని సాధ్యాసాధ్యాల్ని అస్స‌లు ప‌ట్టించుకోకుండా ఇచ్చేసిన దుర్మార్గం క‌నిపిస్తుంది. విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీ ఆర్థిక ప‌రిస్థితి మీద అవ‌గాహ‌న ఉండి కూడా.. అలివి కాని రీతిలో రైతుల‌కు రుణ‌మాఫీ.. డ్వాక్రా సంఘాల‌కు రుణ‌మాఫీ.. ఇంటికో ఉద్యోగం.. నిరుద్యోగుల‌కు నిరుద్యోగ‌భృతి లాంటి ఎన్నో హామీల్ని ఆయ‌న ఇవ్వ‌టాన్ని మ‌ర్చిపోలేం. ఇలా హామీల‌తో మ‌భ్య‌పెట్టి.. అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు ప‌వ‌ర్‌లోకి వ‌చ్చాక ఏం చేశారో అంద‌రికి తెలిసిందే.

మూడేళ్లుగా ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు.. ఎన్నిక‌ల వేళ తానిచ్చిన కీల‌క హామీల్ని ఎంత‌మేర అమ‌లు చేశారో చూస్తే.. స‌గ‌టు జీవి క‌డుపు మండిపోవ‌టం ఖాయం. ఉత్త మాట‌లే త‌ప్పించి.. చేసిందేమీ లేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. రైతుల‌కు పెద్ద పీట వేస్తాన‌న్న చంద్ర‌బాబు.. వారి స‌మ‌స్య‌ల్ని అస్స‌లు ప‌ట్టించుకోక‌పోవ‌టంతో.. వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి గ‌ళం విప్పారు విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.

మండే ఎండ‌ల్ని లెక్క చేయ‌కుండా.. ఈ రోజు.. రేపు రెండు రోజుల పాటు రైతుదీక్ష చేసేందుకు ఆయ‌న రెఢీ అయ్యారు. గుంటూరు మిర్చియార్డుకు స‌మీపంలో రైతుదీక్ష‌ను ప్రారంభించిన ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా బాబు పాల‌న తీరుపై మండిప‌డ్డారు. మిర్చి ఘాటుకు స‌రిపోయేలా ఉన్న జ‌గ‌న్ చేసిన ప్ర‌సంగాన్ని ఆయ‌న మాట‌ల్లోనే చెబితే..

కడుపు మండుతున్నా.. పండించిన పంటకు ధరలు రాక అవస్థలు పడుతున్నా.. ముఖ్య‌మంత్రి చంద్రబాబు పట్టించుకునే పరిస్థితి లేదు. క‌డుపులో బాధ‌ను.. మ‌న అవ‌స్థ‌ల్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని.. ఆయనకు బుద్ధి రావాలని రైతులంతా ఒక్కచోట ఏకమై దీక్షను చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, ముఖ్యమంత్రి అయిన తర్వాత మ‌రోలా మాట్లాడ‌టం చంద్రబాబుకు అల‌వాటు. రైతుల‌తో ప‌ని అయిపోయిన త‌ర్వాత‌.. ఆయ‌న మ‌రోలా మాట్లాడుతున్నారు.

2010లో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ దగ్గర చంద్రబాబు ధర్నా చేశారు.. హూడా కమిటీ సిఫార్సులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని, కష్టాల్లో ఉన్న రైతులకు ఎకరాకు రూ.10-15 వేలు ఇవ్వాలని దీక్ష చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హూడా కమిటీ సిఫార్సులు కనిపించాయి కానీ.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మాత్రం ఇదే చంద్ర‌బాబు హూడా ఎవరు? ఆయన సిఫార్సులేంటి? త‌న‌కు తెలియదని మాట్లాడటం చూస్తుంటే.. ఈయనా మన ముఖ్యమంత్రి అనిపిస్తుంది. ఇదే వ్య‌క్తి ఎన్నికల వేళ‌.. రైతుల కోసం రూ.5వేల కోట్లతో స్థిరీకరణ నిధి తీసుకొస్తానని.. ఏ రైతూ బాధపడకుండా చూస్తానని.. ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాకపోతే ఈ నిధితో ఆదుకుంటానన్నారు.

అప్ప‌ట్లో ఆయ‌న‌కు రూ.5వేల కోట్లు ఇవ్వాలని ఎందుకు అనిపించిందంటే..  అప్పుడు జగన్ రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెడతానన్నాడు కాబ‌ట్టి. జ‌గ‌న్ నోటి నుంచి మాట‌కు ఆయ‌న‌కు ఎక్క‌డ ఓట్లు పడతాయోనని వెన్నులో భయం మొదలై.. రూ.5వేల కోట్లతో స్థిరీకరణ నిధి అన్నారు. ఎన్నిక‌లైన త‌ర్వాత రైతుల‌తోప‌ని అయిపోయిన త‌ర్వాత ఆ నిధి గురించి మాట్లాడుతున్న‌దే లేదు.

 ఇదే చంద్రబాబు ఎన్నికలకు ముందు రైతులకు కనీస మద్దతుధర చాలా తక్కువగా ఉందని.. అధికారంలోకి రాగానే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలుచేస్తామని.. వ్య‌వ‌సాయ‌ ఖర్చు మీద 50 శాతం లాభం వేసి మరీ ధర ఇప్పిస్తానన్నారు. ఎన్నిక‌లై.. బాబు పాల‌న మొద‌లై మూడేళ్లు అయిపోయిన త‌ర్వాత మ‌ద్ద‌తు ధ‌ర ఏంటంటే.. వరికి 50.. 60 రూపాయల చొప్పున ముష్టి వేసినట్లు ఇస్తున్నారు. అయినా ఆయ‌న నోటి నుంచి మాట రాదు.  పత్తికి కూడా రూ.50.. 60 చొప్పున ఇచ్చారు. కనీసం ద్రవ్యోల్బణం కంటే కూడా తక్కువగా రేట్లు పెంచుతున్నా ఈయన మాట్లాడరు. రైతుల స‌మ‌స్య‌ల మీద ప్రధానమంత్రికి ఒక్కటంటే ఒక్క లేఖ కూడా రాయలేదు.

 ఇదే చంద్రబాబు ఎన్నికల వేళ‌.. రైతులకు తోడుగా నిలబడ‌తాన‌ని.. కుటుంబ పెద్దగా నిలుస్తాన‌న్నారు. 2013-14లో వరుస తుఫాన్లు వచ్చాయి.. ఆ తర్వాత కరువు వచ్చింది.  అప్పుడాయ‌న రాష్ట్రంలో తిరుగుతూ.. అదిగో ఎన్నికలు వచ్చేస్తున్నాయి, ముఖ్యమంత్రి కాగానే ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటానని చెప్పారు.  కానీ సీఎం అయిన తర్వాత ఈ మూడేళ్లలో ఒక్క ఇన్‌పుట్ సబ్సిడీ అక్షరాలా రూ.4394 కోట్లు బకాయిలు పడ్డారు. వరుసగా మూడేళ్లలో ఇన్‌పుట్ సబ్సిడీకి పూర్తిగా ఎగనామం పెట్టారు.

 రైతుల రుణాలన్నీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని.. రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని ప్ర‌చారం చేయించారు. ఎన్నిక‌ల వేళ‌.. ఎప్పుడు టీవీ ఆన్ చేసినా.. మనకు ఇదే వినిపించింది కూడా. ఇప్పుడు చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి ఏంటంటే.. కోటి 4 లక్షల అకౌంట్లకు గాను 40 లక్షల రైతుల అకౌంట్లు ఓవర్ డ్యూ.. ఎన్‌పీఏ అకౌంట్లుగా తయారయ్యాయి. బాబు పాలన చూసి తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఇదే మిర్చియార్డుకు ఐదువారాల క్రితం వచ్చా. అప్పుడు మిర్చి రేటు క్వింటాలుకు రూ.6000-7000 వరకు పలుకుతోంది.  ఇది అన్యాయమని, గత సంవత్సరం 14వేల వరకు పలికిందని చెప్పా.   అప్పుడు చంద్రబాబు మొసలి కన్నీరు కార్చారు.  ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉందంటే.. కేవ‌లం ఐదు వారాల వ్య‌వ‌ధిలో రూ.ఆరేడు వేలున్న మిర్చి క్వింటాళ్ల ధ‌ర ఇప్పుడు రూ.2500-4000కు రేటు పడిపోయింది. ఎక్కడైనా సీఎం అంటే.. రైతులకు తోడుగా ఉండేందుకు స్థిరీకరణ నిధి పెట్టి రైతులను ఆదుకోవాలి. మార్కెట్లో పోటీ సృష్టించాలి. కానీ చంద్రబాబు రైతులకు తోడుగా నిలబడలేదు.. వ్యాపారులకు అండ‌గా నిలిచారు.  వ్యాపారులు కొంటే.. ఈయన ముష్టేసినట్లు రూ.1500 ఇస్తారట. అది కూడా 8వేలకు ఎంత తక్కువైతే అంతే ఇస్తారట. అది కూడా ఒక్కో రైతు 20 క్వింటాళ్లు మాత్రమే తేవాలట. పొలాలన్నీ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా రైతులు ట్రాక్టర్లలో తీసుకొస్తున్నారు.  మిర్చి కోసిన తర్వాత మార్కెట్ యార్డు వరకు ఖర్చులు చూస్తే క్వింటాలుకు 2500 దాటింది. కానీ కొనుగోలు ధర బాగోలేదు.

ఇక్కడకు తెచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు.. కోల్డ్ స్టోరేజిలోకి తీసుకెళ్తే అక్కడ స్థలం ఇవ్వబోమని ఇప్పటికే టిక్కీ రేటు పెంచారు. ఏడాదికి 160 రూపాయల్ని కాస్తా రూ.190కి పెంచేశారు. అయినా స్థలాలు లేవు. నాలుగైదు రోజుల పాటు రైతులు రోడ్డుమీద పడుకోవాల్సి వస్తోంది. మిర్చి మాత్రమే కాదు.. పసుపు గత ఏడాది రూ.9వేలయితే ఈసారి 4వేలకు కూడా కొనుగోలు చేయట్లేదు. మామిడి, వరి, సుబాబుల్.. ఏ పంటకూ సరైన ధర రావడం లేదు. 2016-17 సంవత్సరంలో ఏ ఒక్క పంటకూ రేటు ఉండని పరిస్థితి కనిపిస్తోంది. ఈ దారుణమైన మోసానికి నిరసన తెలుపుతూ.. చంద్రబాబుకు జ్ఞానం రావాలని దీక్ష చేపడుతున్నాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News