డెడ్ లైన్ దగ్గర పడింది..వారందరికి 2 నెలల టైమిచ్చిన జగన్

Update: 2023-02-14 12:29 GMT
విషయం ఏదైనా క్లియర్ గా క్లారిటీతో చెబితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోవాలి. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అన్న విషయాన్ని ఆయన తెగ నమ్మేస్తుంటారు.

అందుకే.. శషబిషలు పెట్టుకోకుండా తాను చేసే ప్రతి పనిని ముందుగానే చెప్పేస్తుంటారు. బోలెడంత టైం ఇస్తారు. ఆ తర్వాత తాను చేయాల్సిన పనిని చేసేస్తుంటారు. సాధారణంగా మరే ఇతర ముఖ్యమంత్రుల్లో లేని తీరు సీఎం జగన్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది.

మంత్రి పదవులు ఇచ్చినట్లే ఇచ్చి.. రెండున్నరేళ్లు మాత్రమే టైముంది. మరో కొత్త టీంతో ముందుకు వస్తానని మొదటి రోజే తేల్చి చెప్పేందుకు ఎంత దమ్ము? మరెంత ధైర్యం ఉండాలి? అలాంటివి ఎలాంటి మొహమాటాలు లేకుండా జగన్ తేల్చి చెబుతారు. దీంతో.. కావాల్సినంత టైమిచ్చి వేటు వేసినందున ఆయన్ను పల్లెత్తు మాట అనేందుకు ఎవరూ ఇష్టపడరు. తాజాగా ఆయన గడప గడపకు మన ప్రభుత్వం అన్న కార్యక్రమాన్ని రివ్యూ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రోగ్రాంకు పలువురు ఎమ్మెల్యేలు.. పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. తాను ఇవ్వాల్సిన సందేశాన్ని ఆయన మొహమాటం లేకుండా ఇచ్చేశారు. మరో 14 నెలల్లో ఎన్నికలు వస్తున్న వేళ.. ఎమ్మెల్యేలు.. నియోజకవర్గబాధ్యులకు చిలకకు చెప్పినట్లుగా చెప్పుకొచ్చారు జగన్.

‘మీ మంచి కోసమే చెబుతున్నా. మీ పని తీరు మెరుగుపర్చుకోండి. ప్రజల్లో ఉండండి. లేకపోతే ఆ తర్వాత మీకు అవకాశం ఉండదు. కొత్త వాళ్లను తీసుకొచ్చి ప్రజల్లోకి పంపాల్సి ఉంటుంది’ అని తేల్చేశారు.

తాను మే వరకు టైమిస్తున్నాని.. ఆ లోపు కానీ పని తీరు మెరుగుపర్చుకోకుంటే.. అలాంటివారిని తాను తీసేసి.. కొత్తవారికి బాధ్యతలు అప్పజెబుతానని చెప్పిన జగన్ మాటలు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశారు. రివ్యూ భేటీ అని చెప్పి.. హోల్ సేల్ గా అందరికి కలిసికట్టుగా వార్నింగ్ ఇచ్చేసిన తీరు చూస్తే.. జగనా మజాకానా? అనుకోకుండా ఉండలేం

Similar News